రాజకీయ సెమీఫైనల్​గా 2023.. ఏడాదిలో 9 రాష్ట్రాలకు ఎన్నికలు

author img

By

Published : Jan 1, 2023, 6:34 AM IST

2023 india election

2023 India election : కొత్త సంవత్సరంలో తొమ్మిది రాష్ట్రాల శాసనసభలకు జరిగే ఎన్నికలు- భాజపా, కాంగ్రెస్‌లతోపాటు కొన్ని ప్రాంతీయ పార్టీలకూ కీలకమే! 2024లో జరిగే లోక్‌సభ సాధారణ ఎన్నికలకు వీటిని సెమీఫైనల్‌ పోరుగా భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాకు, విపక్ష కాంగ్రెస్‌కు కీలక రాష్ట్రాలు కావడంతో పోటీ ప్రతిష్ఠాత్మకంగా మారనుంది. జాతీయ పార్టీగా ఆవిర్భవించిన భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కీ ఈ ఏడాది ముఖ్యమే. ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయాలన్న ప్రయత్నాల్లో ఉండటంతోపాటు, తెలంగాణ శాసనసభకూ ఎన్నికలు జరగనుండటంతో కొత్త సంవత్సరం కీలకం కానుంది.

Election in India 2023 : 2023లో ఎన్నికలు జరిగే తొమ్మిది రాష్ట్రాలకుగాను అయిదింటిలోనే 110 లోక్‌సభ స్థానాలున్నాయి. మిగిలిన నాలుగు ఈశాన్య రాష్ట్రాలు; అక్కడ ఆరు లోక్‌సభ స్థానాలు మాత్రమే ఉన్నాయి. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, తెలంగాణలో చెరి రెండు రాష్ట్రాల్లో భాజపా, కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా- తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఉంది. నాలుగు రాష్ట్రాల్లో ప్రధాన పోటీ భాజపా, కాంగ్రెస్‌ మధ్యనే నెలకొంది. దక్షిణాదిలో అధికారంలో ఉన్న కర్ణాటకను తిరిగి దక్కించుకోవడంతో పాటు తెలంగాణలో పాగా వేయడానికి భాజపా విశ్వప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ ఏర్పడిన తరవాత వరసగా రెండుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్‌పై దృష్టిపెట్టడంతోపాటు దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలనుకొంటున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అత్యంత కీలకం కానున్నాయి.

కాంగ్రెస్‌ కలహాలు అధిగమించేనా?
State election this year : ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ముఖ్య నాయకుల మధ్య కలహాలు కాంగ్రెస్‌కు ప్రధాన సమస్యగా మారుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భాజపా లబ్ధి పొందుతుంది. ఈ ఎన్నికల ప్రాధాన్యాన్ని పరిగణనలోకి తీసుకొని కాంగ్రెస్‌ నాయకత్వం రాష్ట్రాల్లోని నాయకుల మధ్య ఐక్యత సాధించకపోతే ఆ ప్రభావం లోక్‌సభ సాధారణ ఎన్నికలపైనా పడుతుంది. రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌, పీసీసీ మాజీ అధ్యక్షుడు సచిన్‌ పైలట్‌ల మధ్య బహిరంగంగానే పోరు కొనసాగుతోంది. అక్కడి కాంగ్రెస్‌ నాయకులు తమలో తామే పోరాడుకుంటున్నారు. గతంలో పార్టీలో తలెత్తిన తిరుగుబాటును సర్దుబాటు చేసినా, విభేదాలు సమసిపోలేదు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా చాలా స్వల్పం. తరవాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాజపా పూర్తి ఆధిక్యాన్ని సాధించింది. కుమ్ములాటలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ రాష్ట్రాన్ని నిలబెట్టుకోవడం కాంగ్రెస్‌కు అంత సులభమేమీ కాదు. ఇక్కడ భాజపాలో కూడా గ్రూపులు ఉన్నాయి. అయితే ప్రధాని మోదీ, ఇతర జాతీయ నాయకులు మొత్తంగా ఎన్నికల ప్రచారాన్ని తమ చేతుల్లోకి తీసుకొనే అవకాశం ఉండగా, కాంగ్రెస్‌కు అలాంటి పరిస్థితి లేదు. ఇటీవలి ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ గెలుపొందడం ఆ పార్టీలో విశ్వాసాన్ని పెంచినా ముఖ్యనాయకుల మధ్య ఉన్న అనైక్యత సమస్యగా మారే అవకాశం ఉంది.

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినా, జ్యోతిరాదిత్య తిరుగుబాటుతో అక్కడ భాజపా మళ్ళీ అధికారాన్ని చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌ మధ్య ఓట్ల తేడా చాలా స్వల్పం; తరవాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాజపా పూర్తి ఆధిపత్యం సాధించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన పోటీని తిరిగి కాంగ్రెస్‌ ఇవ్వగలదా అన్నది ప్రశ్నార్థకమే. ముఖ్యనాయకులంతా ఐక్యంగా పనిచేస్తేనే అది సాధ్యం. గత ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చిన ఛత్తీస్‌గఢ్‌లోనూ అంతర్గత కుమ్ములాటలను హస్తం పార్టీ ఎదుర్కొంటోంది. సీఎం భగేల్‌కు, ఆరోగ్యశాఖమంత్రి సింగ్‌దేవ్‌కు మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు ఉన్నాయి. సింగ్‌దేవ్‌ మొదటి నుంచి ముఖ్యమంత్రి స్థానాన్ని ఆశిస్తున్నారు. ఇక్కడా పార్టీలోని విభేదాలు కాంగ్రెస్‌ విజయావకాశాలపై ప్రభావం చూపనున్నాయి.

జోడోయాత్రపై ఆశ
గత ఎన్నికల్లో అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉండి నాయకులమధ్య విభేదాల కారణంగా దెబ్బతిన్న కర్ణాటకలో ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. భాజపాలో ముఖ్యమంత్రి మార్పు, కమలం పార్టీలోనూ నాయకుల మధ్య విభేదాలుండటం కాంగ్రెస్‌కు కలిసివచ్చే అంశం. ముఖ్యనాయకులు డి.కె.శివకుమార్‌, సిద్దరామయ్యల మధ్య పొరపచ్చాలున్నా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలను కలిసికట్టుగానే చేపడుతుండటంతో భాజపాకు కాంగ్రెస్‌ గట్టి సవాలు విసరనుంది. మాండ్య, మైసూరు ప్రాంతాల్లో పట్టున్న కుమారస్వామి నేతృత్వంలోని జనతాదళ్‌(ఎస్‌) పొందే సీట్లు కూడా ఇక్కడ కీలకంగా మారనున్నాయి.

తెలంగాణ రాష్ట్ర సమితి, భారాసగా మారిన తరవాత ఇక్కడ జనతాదళ్‌(ఎస్‌)తో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న రాయచూరు, బళ్లారి తదితర జిల్లాల్లో జనతాదళ్‌(ఎస్‌)తో కలిసి భారాస పోటీకి దిగితే, ఆ ప్రభావం కాంగ్రెస్‌, భాజపాలలో ఎవరిపై పడుతుందన్న దానిపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ప్రభావం తమకు లాభిస్తుందన్న ఆశ కాంగ్రెస్‌ వర్గాల్లో ఉంది.

తెలంగాణలో పట్టు నిలుపుకొనేందుకు...
తెలంగాణ అవతరణ తరవాత రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తెరాస ఇప్పుడు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా మారి తెలంగాణతోపాటు, జాతీయ రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలను గెలుచుకొని తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. ఆ తరవాత విపక్షాల నుంచి పలువురు అధికార పక్షంలోకి చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం భాజపా అనూహ్యంగా నాలుగు, కాంగ్రెస్‌ మూడు స్థానాల్లో గెలుపొందాయి. పార్టీ ఆవిర్భావం నుంచి పట్టున్న స్థానాలను కూడా తెరాస (ప్రస్తుతం భారాస) కోల్పోయింది. తరవాత రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భాజపా గెలుపొందింది. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థిని ఓడించడానికి అధికార పక్షం కష్టపడాల్సి వచ్చింది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ నామమాత్రం కావడం, ఆ పార్టీలో ఉన్న కుమ్ములాటలతో భారాసకు తామే ప్రత్యామ్నాయమన్న అభిప్రాయానికి వచ్చిన భాజపా నాయకత్వం రాష్ట్రంపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. అయితే, తెలంగాణకు సంబంధించి భారాసకు రాష్ట్రవ్యాప్తంగా బలం ఉండగా- భాజపా, కాంగ్రెస్‌లు కొన్నిచోట్ల బలంగా ఉన్నాయి. దీనివల్ల కొన్ని స్థానాల్లో భారాస, భాజపా మధ్య, మరికొన్ని సీట్లలో భారాస, కాంగ్రెస్‌ మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉంది. కాంగ్రెస్‌కు వరస ఓటములు ఎదురుకావడం, ఆ పార్టీలో నేతల మధ్య నెలకొన్న విభేదాలు, కుమ్ములాటలను తమ పార్టీకి అనుకూలంగా మలచుకోవడానికి భాజపా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌ అధిష్ఠానం పార్టీ పరిస్థితిని చక్కదిద్దకపోతే, అన్ని రకాల వనరులున్న భాజపా అధికార భారాసకు ప్రధాన పోటీదారుగా నిలిచే అవకాశం లేకపోలేదు.
-- ఎం.ఎల్‌.నరసింహారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.