పొగబారుతున్న నగరాల ఆరోగ్యం- ప్రత్యామ్నాయాలే శరణ్యం

author img

By

Published : Jan 8, 2022, 6:57 AM IST

Global Warming 2021

Global Warming 2021: భూతాపాన్ని కట్టడి చేయాలనే 2015 నాటి ప్యారిస్‌ ఒప్పందం దరిమిలా బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి నియంత్రణకు దేశాలు భారీ లక్ష్యాలు నిర్దేశించుకున్నా.. ఆచరణలో అవి కొల్లబోతున్నాయని 'సి40' నివేదిక నిగ్గుతేల్చింది. ఉద్గారాలను కట్టడి చేసేందుకు అవసరమైన యంత్ర పరికరాలను వెంటనే అమర్చుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల 79 థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను ఆదేశించింది. బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాలకు దశలవారీగా ముగింపు పలికేందుకు సిద్ధమవుతోంది.

Global Warming 2021: బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి వెలువడుతున్న హరిత వాయు ఉద్గారాలతో నగరాల్లో అర్ధాంతర మరణాలు, వివిధ అనారోగ్య సమస్యలు పెచ్చరిల్లుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల మేయర్లు సభ్యులుగా ఉన్న 'సి40' సంస్థ తాజా అధ్యయన నివేదిక ఈ మేరకు వెల్లడించింది. భూతాపాన్ని కట్టడి చేయాలనే 2015 నాటి ప్యారిస్‌ ఒప్పందం దరిమిలా బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి నియంత్రణకు దేశాలు భారీ లక్ష్యాలు నిర్దేశించుకున్నా- ఆచరణలో అవి కొల్లబోతున్నాయని నివేదిక నిగ్గుతేల్చింది. మొత్తం ఉద్గారాల్లో 30శాతానికి పైగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలే వెలువరిస్తున్నాయని గతంలో ఐక్యరాజ్య సమితి పర్యావరణ నివేదిక స్పష్టం చేసింది. ప్యారిస్‌ ఒప్పందం ప్రకారం భూ ఉష్ణోగ్రతలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు కట్టడి చేసేందుకు దేశాలు 61శాతం మేరకు బొగ్గు వినియోగాన్ని తగ్గించవలసి ఉంది. కానీ, అదనంగా నాలుగు శాతందాకా బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాల సామర్థ్యాన్ని పెంచడానికి వర్ధమాన దేశాలు సంకల్పించినట్లు సి40 నివేదిక వెల్లడించింది. 2030 నాటికి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల సామర్థ్యాన్ని మరో 64 గిగావాట్లు పెంచాలని భారత ప్రభుత్వం ఆలోచిస్తోంది. నేడు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో 481 గిగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. థర్మల్‌ విద్యుదుత్పత్తి ఆలోచన- నగరాలు, పట్టణాల ఆరోగ్య భద్రతకు చేటుగా పరిణమించనుందని సి40 నివేదిక హెచ్చరిస్తోంది.

ఆర్థిక స్థితిగతులపైనా ప్రభావం

Paris Agreement 2030: థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నుంచి వెలువడే వాయు కాలుష్య కణాలు రాష్ట్రాలు, దేశాల సరిహద్దులను దాటి చాలా దూరం ప్రయాణిస్తాయి. వాటివల్ల కాలుష్యానికి గురయ్యే నగరాలు అధికంగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇండియా, థాయ్‌లాండ్‌, వియత్నాం, టర్కీ, ఇండొనేసియా దేశాల్లో ఉన్నాయి. ఆ కాలుష్యం ముందస్తు, తక్కువ బరువు కలిగిన శిశువుల జననాలకు కారణమవుతోంది. దానివల్ల శిశు మరణాలు, మధుమేహం, గుండె జబ్బులు వంటి వాటి తీవ్రత పెరిగే ప్రమాదముందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల విస్తరణ ప్రతిపాదనలు ఆచరణ రూపం దాలిస్తే పెద్ద నగరాల్లో సుమారు 2.65 లక్షల అర్ధాంతర మరణాలు సంభవిస్తాయని సి40 నివేదిక నిగ్గుతేల్చింది. వాటివల్ల ఉత్పన్నమయ్యే కాలుష్యం వల్ల 2019లో 19,100 మంది పౌరులు మృత్యువాత పడ్డారని పేర్కొంది. 2020-30 మధ్య కాలంలో థర్మల్‌ కాలుష్యం వల్ల నగరాల పిల్లల్లో 2,47,600 మందికి శ్వాసకోశ ఆత్యయిక పరిస్థితులు తలెత్తవచ్చని అంచనా. భారత్‌లో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల విస్తరణ, సామర్థ్యం పెంపు ప్రతిపాదనలు అమలైతే దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై నగరాల్లో ప్రజారోగ్యానికి తీవ్ర హాని కలుగుతుందని నివేదిక హెచ్చరించింది. థర్మల్‌ కాలుష్య ప్రభావంవల్ల ఆరోగ్యంపై వ్యయం పెరుగుతుంది. పట్టణ ఆర్థిక వ్యవస్థకు ముప్పు వాటిల్లుతుంది. థర్మల్‌ కాలుష్యంతో పిల్లల్లో కలిగే శ్వాసకోశ వ్యాధుల వల్ల ప్రపంచవ్యాప్తంగా వైద్య చికిత్సలకు 65 కోట్ల డాలర్లకు పైగా అదనంగా వ్యయమవుతుంది. అర్ధాంతర మరణాల వల్ల సుమారు 88 కోట్ల డాలర్ల మేరకు ఆర్థిక నష్టం జరుగుతుందని, పట్టణాల్లో పేదల పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతుందని నివేదిక అంచనా వేసింది.

ప్రధాన బాధ్యత వాటిదే!

Thermal Pollution on Environment: ఉద్గారాలను కట్టడి చేసేందుకు అవసరమైన యంత్ర పరికరాలను వెంటనే అమర్చుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల 79 థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో ఇప్పటికే అధిక జనాభా, కాలుష్యాలతో సతమతమవుతున్న నగరాలకు సమీపంలో ఈ కేంద్రాలు ఉండటం గమనార్హం. మరో 517 ప్లాంట్లు ఆ పరికరాలను అమర్చుకొనేందుకు కొంత గడువిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో 68శాతం నగరాలకు 500 కిలోమీటర్లలోపే ఉన్నాయి. విద్యుత్‌ వినియోగంలో రెండింట మూడు వంతుల వాటా నగరాలదే. అందులో థర్మల్‌ విద్యుత్‌ శాతమే ఎక్కువ. అందువల్ల భూతాప నియంత్రణ ప్రధాన బాధ్యత నగరాలదే. నగర పాలక సంస్థలు థర్మల్‌ విద్యుత్‌కు బదులుగా సౌర విద్యుత్‌, బయోగ్యాస్‌ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల విధానాలను రూపొందించి వినియోగించవచ్చు. అమెరికాలోని హ్యూస్టన్‌, ఆస్ట్రేలియాలోని సిడ్నీ, జపాన్‌లోని యొకాహామా నగరాలు వంద శాతం పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగిస్తున్నాయి. కొత్త నగరాల నిర్మాణంలో ముందుగానే పునరుత్పాదక ఇంధన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. గుజరాత్‌లో నిర్మించిన ‘గిఫ్ట్‌ సిటీ’ అందుకు ఉదాహరణ.

ప్రత్యామ్నాయాలే శరణ్యం

ప్రభుత్వాలు బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాలకు దశలవారీగా ముగింపు పలికేందుకు సిద్ధమవుతున్నాయి. సౌర, పవన శక్తిని సమధికంగా వినియోగించడంపై దృష్టిసారించాలి. అల్ట్రా సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ సాంకేతికతతో నడిచే థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అభివృద్ధి చెందని దేశాలకు ఇంకా కొంతకాలం బొగ్గు వాడకం తప్పనిసరి అనుకునే పరిస్థితుల్లో ఈ కేంద్రాలు కొంత వరకు మేలు చేస్తాయి. థర్మల్‌ కేంద్రాలు మూతపడటంవల్ల పలువురు ఉపాధి కోల్పోయినా- పునరుత్పాదక ఇంధన శక్తి వల్ల 2020-30 మధ్య కాలంలో 64 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని అంచనా. 2070 నాటికి కర్బన ఉద్గార తటస్థతను సాధిస్తామని, పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తును 2030 నాటికి 500 గిగావాట్లకు పెంచుతామని కాప్‌-26 సదస్సులో భారత్‌ లక్ష్యాలను ప్రధాని మోదీ ప్రకటించారు. అందుకనుగుణంగా నీతిఆయోగ్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల తుక్కు విధానానికి రూపకల్పన చేసింది. విద్యుత్‌ పరివర్తన ప్రణాళికపై ‘ఇంధన పర్యావరణ జల మండలి (సీఈఈడబ్ల్యూ)’ రూపొందించిన నివేదికలోని అంశాలను అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. కాప్‌-26 సదస్సు తరవాత కేంద్ర శక్తివనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల బృందం రాష్ట్రాలతో చర్చలు జరిపిన అనంతరం 25 సంవత్సరాలు దాటిన థర్మల్‌ ప్లాంట్లను 2023కల్లా మూసివేయాలని సూచించింది. దానివల్ల ఎక్కువ లబ్ధి పొందేది నగరాలే. కేంద్ర ప్రభుత్వ లక్ష్య సాధనకు నగరాల కార్యాచరణే కీలకం. 2020-30 మధ్య కాలంలో ప్రపంచంలోని 61 ముఖ్య నగరాలు బొగ్గు ఆధారిత వినియోగాన్ని క్రమేపీ తగ్గించగలిగితే 24 గిగాటన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌కు సమానమైన హరిత వాయు ఉద్గారాలను నిలువరించడం సాధ్యపడుతుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించడంలో దృఢ సంకల్పం, పటిష్ఠ కార్యాచరణ, ప్రభుత్వాల చిత్తశుద్ధి, ఆధునిక సాంకేతికతల సమర్థ వినియోగాలవల్లే పూర్తిస్థాయి ఫలితాలు సాధ్యమవుతాయి.

-పుల్లూరు సుధాకర్​

ఇదీ చదవండి: అక్కడినుంచి వచ్చిన మరో 173 మందికి కరోనా- ఒక్క విమానంలోనే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.