చదువుల బడికి విఘ్నాలు.. చిన్నారుల భవితపై నీలినీడలు!

author img

By

Published : Sep 10, 2021, 8:01 AM IST

improving educaitonal sector

కరోనా కారణంగా సుదీర్ఘకాలంగా బడులు మూతపడ్డాయి. గ్రామీణ భారతంలో 37శాతం, పట్టణాల్లో 19శాతం విద్యార్థులు చదువులమ్మ ఒడికి శాశ్వతంగా దూరమయ్యారు. ఈ నేపథ్యంలో విద్యాప్రమాణాల పెంపునకు ప్రణాళికాబద్ధమైన కార్యాచరణను రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు.

పుస్తకాలకు పసుపు బొట్లు.. తొలిపుటలపై ఓంకార చిహ్నాలు.. చదువుల్లో చురుకుదనాన్ని ఆశిస్తూ బొజ్జగణపయ్యకు భక్తిగా మొక్కే చిన్నారులు- వినాయక చవితి పర్వదినాన ఇంటింటా దర్శనమిచ్చే సుందర దృశ్యాలివి. కొవిడ్‌ మహమ్మారి పుణ్యమా అని దేశవ్యాప్తంగా ఎందరో పసివాళ్ల బంగరు భవితపై నేడు నీలినీడలు పరచుకొంటున్నాయి! విఖ్యాత ఆర్థికవేత్త జీన్‌ డ్రెజ్‌ నేతృత్వంలో పదిహేను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇటీవల జరిగిన అధ్యయనంలో ఈ మేరకు విషాద వాస్తవాలెన్నో వెలుగుచూశాయి. విష రక్కసి విలయ తాండవంతో సుదీర్ఘకాలంగా బడులు మూతపడ్డాయి. తత్ఫలితంగా గ్రామీణ భారతంలో 37శాతం, పట్టణాల్లో 19శాతం విద్యార్థులు చదువులమ్మ ఒడికి శాశ్వతంగా దూరమయ్యారు. మిగిలిన పిల్లల అభ్యసనంపైనా కరోనా పెనుప్రభావమే చూపినట్లు డ్రెజ్‌ బృందం గుర్తించింది.

కల్లోల కాలంలో క్రమం తప్పకుండా ఆన్‌లైన్‌ పాఠాలు విన్నవారి సంఖ్య పల్లెపట్టుల్లో ఎనిమిది శాతానికి పరిమితమైతే- పట్టణాల్లో అది 24 శాతంగా నమోదైంది. గ్రామాల్లోని దళితులు, ఆదివాసీ విద్యార్థి సమూహాల్లోనైతే ఈ నష్టం మరింత గణనీయంగా చోటుచేసుకుంది. అణగారిన వర్గాలకు చెందిన చిన్నారుల్లో కేవలం నాలుగు శాతమే ఆన్‌లైన్‌ బోధనకు నోచుకొన్నారు. ప్రాంతాలు, సామాజిక నేపథ్యాలకు అతీతంగా 40 శాతానికి పైగా పిల్లలు పట్టుమని పది వాక్యాలైనా చదవలేని దుస్థితిలోకి జారిపోయారు. కరోనా ధాటికి డిజిటల్‌ బోధన తప్పనిసరైన తరవాత తమ బిడ్డల అభ్యాస సామర్థ్యాలు బాగా దెబ్బతిన్నట్లు తల్లిదండ్రుల్లో అత్యధికులు తేల్చిచెబుతున్నారు. విద్యారంగంలో సంక్షోభం దేశాభివృద్ధికి విఘాతకరమని గుర్తించి పాలకులు సత్వరం స్పందించాలి. చిన్నారుల విద్యాహక్కు కొల్లబోకుండా కాచుకుంటూ, విద్యాప్రమాణాల పెంపుదలకు ప్రణాళికాబద్ధమైన కార్యాచరణను తక్షణం పట్టాలెక్కించాలి!

ఆన్‌లైన్‌ పాఠాలు వినేందుకు అవసరమైన ఉపకరణాలు దేశంలోని 27శాతం చిన్నారులకు అందుబాటులో లేవని జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) లోగడే కుండ బద్దలుకొట్టింది. తరగతి గది చదువులు అటకెక్కడం వల్ల పిల్లల మనోవికాసం దెబ్బతిందని పార్లమెంటరీ స్థాయీసంఘం ఇటీవల ఆందోళన వ్యక్తంచేసింది. పాఠశాలలను పునఃప్రారంభించాల్సిన ఆవశ్యకతను స్పష్టీకరించింది. ప్రత్యక్ష బోధనకు డిజిటల్‌ తరగతులు ఏ మాత్రం ప్రత్యామ్నాయం కావని నిపుణులు ఆది నుంచీ చెబుతూనే ఉన్నారు. కొవిడ్‌ కేసుల వ్యాప్తి మందగించడం వల్ల చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రత్యక్ష పాఠాలు మొదలయ్యాయి. చదువులకు దూరమైన పిల్లలందర్నీ మళ్ళీ బడి బాట పట్టించడంపై యంత్రాంగం దృష్టి సారించాలి. బాలకార్మికులుగా వారి భవిష్యత్తు కడతేరిపోకుండా కాచుకోవాలి.

గతేడాది నుంచి తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి, రెండు తరగతుల పిల్లలకు టీవీ పాఠాలనూ బోధించలేదు. సరైన సన్నద్ధత లేకుండానే ఆ చిన్నారులంతా పై తరగతులకు వెళ్తారు. ఆన్‌లైన్‌లోనూ అరకొర చదువులతో చాలామంది ఆయా తరగతులకు తగిన విజ్ఞానాన్ని ఒడిసిపట్టుకోలేకపోయారు. బ్రిడ్జి కోర్సుల నిర్వహణతో పిల్లల పూర్వ అభ్యసన నష్టాన్ని పూరించగల వీలుంది. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలూ ఈ సరళిని అందిపుచ్చుకొంటే చదువుల్లో వెనకబడిన విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆన్‌లైన్‌ బోధనను మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దడమూ అత్యవసరం. విద్యావ్యవస్థకు కరోనా చేసిన గాయం నయంకావడానికి సుదీర్ఘ కాలమే పడుతుంది. ఈ సంక్షుభిత తరుణంలో పాలకులు ఏ మాత్రం అలక్ష్యం వహించినా కొన్ని తరాలు తీవ్రంగా నష్టపోతాయి. ఆ ప్రమాదాన్ని నివారించాలంటే- చిన్నారుల సర్వతోముఖాభివృద్ధికి మేలిమి బాటలు పరచేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా ముందడుగేయాల్సిందే!

ఇదీ చూడండి : ప్రాణాలు పోసే చేతులే.. ఉసురు తీసుకుంటున్న దైన్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.