రణశక్తికి సాంకేతికత దన్ను.. చైనా సరిహద్దు వద్ద భారత్​ అప్రమత్తంగా ఉండాల్సిందే!

author img

By

Published : Dec 29, 2022, 9:20 AM IST

china bharat boarder dispute

భారత్‌, చైనా సరిహద్దుల్లో ఇటీవలి సైనిక ఘర్షణలతో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది. డ్రాగన్‌ విస్తరణవాదంతోనే తరచూ ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి. భారత్‌ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా చైనా అతిక్రమణలపై అప్రమత్తంగా ఉండాలి.

భారతీయ జవాన్లు చైనా సైనికులను తరిమికొడుతున్న దృశ్యాలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విరివిగా చక్కర్లు కొట్టాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో అక్రమంగా చొరబడటానికి చైనా ప్రజావిమోచన సైన్యం (పీఎల్‌ఏ) చేసిన ప్రయత్నాన్ని మన జవాన్లు వీరోచితంగా వమ్ముచేశారు. ఈ ఘటన డిసెంబరు తొమ్మిదో తేదీన జరిగినా ప్రభుత్వం వెంటనే వెల్లడించలేదు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా దాని గురించి బయటపెట్టింది. తవాంగ్‌ ఘర్షణలపై హడావుడి చేయకపోవడానికి సహేతుక కారణమే ఉంది. గల్వాన్‌ ఘర్షణలు జరిగినప్పటి నుంచి పెద్దసంఖ్యలో ఉభయ దేశాల సైనికులు సరిహద్దులో మోహరించి ఉన్నందువల్ల ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇది మరింత పెచ్చరిల్లకూడదనే భారత ప్రభుత్వం సంయమనం పాటించింది. ఎవరు రెచ్చగొట్టే మాటలు, చేతలకు పాల్పడినా పరిస్థితి అదుపు తప్పి పూర్తిస్థాయి యుద్ధం విరుచుకుపడవచ్చని సర్కారు సంయమనం వహిస్తోంది.

రెండేళ్ల క్రితం గల్వాన్‌లో చైనీయులు ముళ్లతీగలు చుట్టిన ఇనుప రాడ్లతో అనూహ్యంగా దాడి చేయడంతో పలువురు భారత జవాన్లు మరణించారు. ప్రతిగా మన జవాన్లు ఎదురుదాడి చేసి అంతకు రెట్టింపు సంఖ్యలో చైనీయులను హతమార్చినట్లు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి సరిహద్దుల్లో పరిస్థితి సాధారణ స్థాయికి తిరిగిరాలేదు. పైగా చైనీయులు సరిహద్దు వెంబడి పెద్దయెత్తున బంకర్లు, రహదారులు, వైమానిక స్థావరాలను నిర్మించసాగారు. కీలక ప్రాంతాల్లో కొత్త గ్రామాలనూ నెలకొల్పారు. సరిహద్దుల్లోకి అప్పటికప్పుడు సైనిక దళాలను తరలించడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. భారత్‌ కూడా దీనికి దీటుగా సరిహద్దు వెంబడి కొత్త రహదారులు, వంతెనలు, హెలిపాడ్లు నిర్మించింది. సరకులు, ఆయుధ డిపోలను ఏర్పాటు చేసింది. ఈ హిమాలయ ప్రాంతంలో ఎవరికైనా సరే ప్రమాదకర శత్రువులు- అతిశీతల వాతావరణం, మంచు పలకలే. ఈ వాతావరణానికి చైనీయులకన్నా భారత సైనిక దళాలే చక్కగా అలవాటుపడ్డాయి. యుద్ధమే వస్తే అది మనవాళ్లకు ఉపయుక్తంగా మారుతుంది. ఆధునిక యుద్ధంలో గెలవాలంటే కేవలం సైనికుల ధైర్యసాహసాలు, బలిదానాలే సరిపోవు. ఒక దేశ ఆర్థిక, శాస్త్రసాంకేతిక బలం విజయానికి కీలకమవుతుంది. భారత్‌కన్నా చైనా ఆర్థిక వ్యవస్థ పెద్దది కావడంతో ఆధునిక ఆయుధాలను సమకూర్చుకునే స్థోమత బీజింగ్‌కు అధికం. చైనా తన సాయుధ బలగాలను అత్యాధునిక సేనలుగా తీర్చిదిద్దింది. కృత్రిమ మేధ సహాయంతో పోరాడే సైబర్‌ దళాలను ఏర్పాటు చేసుకుంది. ఒకవేళ డిజిటల్‌ యుద్ధమే వస్తే కండబలంకన్నా బుద్ధి బలమే గెలుపు సాధించి పెడుతుంది.

విదేశీ పాలకుల పెత్తనంలో తాము బలహీనంగా ఉన్నప్పుడు కోల్పోయిన భూభాగాలను మళ్ళీ చేజిక్కించుకొంటామని చైనా పంతం పడుతోంది. చరిత్రలో జరిగిన తప్పులను సరిదిద్దుతామంటే ఇతర దేశాలతో వైరం తలెత్తుతుందని తెలిసీ మొండిగా వ్యవహరిస్తోంది. రెండో ప్రపంచయుద్ధం ముగిసినప్పటి నుంచి యుద్ధాలకు దూరంగా ఉండి శాంతి మంత్రం జపిస్తున్న జపాన్‌ సైతం చైనా దూకుడును చూసి మళ్ళీ ఆయుధాలను సమకూర్చుకొంటోంది. చైనా పొరుగున ఉన్న తైవాన్‌ తదితర దేశాలూ అదే బాట పడుతున్నాయి. చైనా దూకుడును యావత్‌ ప్రపంచం నిరసిస్తున్నా దానివల్ల భారత్‌కు ఒరిగేదేమీ లేదు. మన భూభాగాన్ని మనమే కాపాడుకోవాలి. ఇందుకు అమెరికా, ఐరోపాలు తోడ్పడే అవకాశాలున్నాయి. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ఆగడాలను అడ్డుకోవడానికి భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా క్వాడ్‌గా ఏర్పడిన సంగతి తెలిసిందే. భారత్‌, అమెరికా జతకడుతున్నాయని రుసరుసలాడుతున్న చైనా- పరిస్థితి అంతదాకా రావడానికి తానే కారణమని గ్రహిస్తే మంచిది. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా వైఖరిని భారత్‌ ఖండించకున్నా, రష్యన్‌ చమురును దిగుమతి చేసుకుంటున్నా అమెరికా తదితర దేశాలు భారత్‌ను సమర్థిస్తున్నాయి. అంతమాత్రాన చైనాతో యుద్ధానికి భారత్‌ తొందరపడకూడదు. చైనా అతిక్రమణలను ఎదుర్కొంటూ సరిహద్దులను కాపాడుకోవడమే ఉత్తమం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.