తుమ్మితే ఊడిపోయే అమెరికా స్పీకర్‌ పదవి.. మెకార్థీ అంతలా లొంగిపోయారా?

author img

By

Published : Jan 13, 2023, 7:59 AM IST

McCarthy freedom caucus

అగ్రరాజ్యం అమెరికా అవకాశవాద రాజకీయాలకు అతీతం కాదని నిరూపించిన వ్యక్తి- ఆ దేశ కొత్త స్పీకర్‌ కెవిన్‌ మెకార్థీ! తన ఉద్వాసనకు ఒక్క రిపబ్లికన్‌ సభ్యుడు డిమాండ్‌ చేసినా అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు సమ్మతిస్తానన్న ఒప్పందంతో ఆయన స్పీకర్‌గా ఎన్నికయ్యారు. పదవి కోసం మెకార్థీ ఇంతలా లొంగిపోవడం విమర్శలకు తావిచ్చింది.

నిరుడు మధ్యంతర ఎన్నికల్లో అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు) ఎగువసభ సెనేట్‌ను పాలక డెమోక్రటిక్‌ పార్టీ కైవసం చేసుకొంది. కానీ ప్రజాప్రతినిధుల సభలో మెజారిటీ సాధించలేకపోయింది. దిగువసభలోని మొత్తం 435 సీట్లకు డెమోక్రాట్లు 213 సీట్లు గెలిస్తే, ప్రతిపక్ష రిపబ్లికన్లు అంతకు తొమ్మిది సీట్లు ఎక్కువగా 222 సీట్లతో మెజారిటీ పక్షంగా నిలిచారు. అయినప్పటికీ సభాపతిని ఎన్నుకోవడానికి ఆపసోపాలు పడ్డారు. నాలుగు రోజులపాటు ఏకంగా 14 దఫాలు ఓటింగ్‌ నిర్వహించినా కొత్త స్పీకర్‌ను ఎన్నుకోలేకపోయారు! రిపబ్లికన్‌ పార్టీలో ఫ్రీడమ్‌ కాకస్‌ అనే అతి మితవాదవర్గం అడుగడుగునా మోకాలడ్డటం వల్ల మెకార్థీకి ఆశాభంగం ఎదురైంది. చివరకు ఈనెల 7న 15వ దఫా ఓటింగ్‌లో కెవిన్‌ మెకార్థీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

రిపబ్లికన్‌ పార్టీకి చెందిన 222 మంది సభ్యుల్లో ఫ్రీడం కాకస్‌ సభ్యుల సంఖ్య 54. కొందరు అతిమితవాద రిపబ్లికన్లు, 2009నాటి టీపార్టీ ఉద్యమ వారసులు కలిసి 2015లో ఫ్రీడమ్‌ కాకస్‌గా ఏర్పడ్డారు. ఈ వర్గం అమెరికాలోకి ఇతర దేశాలవారి వలసలను వ్యతిరేకిస్తుంది. చిన్న ప్రభుత్వమే ముద్దు అంటుంది. సంపన్నులు, కార్పొరేట్లపై పన్నులు మోపకూడదని వాదిస్తుంది. అమెరికా 31 లక్షల కోట్ల డాలర్ల రుణభారం మోస్తోంది కాబట్టి, ప్రజాసంక్షేమం కోసం చేసే వ్యయానికి కోత పెట్టాలంటుంది.

ఫ్రీడమ్‌ కాకస్‌కు లొంగిపోయిన స్పీకర్​..!
ఇలాంటి కార్యక్రమాల కోసం ప్రవేశపెట్టే బిల్లులు సభ ఆమోదం పొందేందుకు గతంలో ఉదారవాద రిపబ్లికన్లు రాజీపడి డెమోక్రాట్లకు తోడ్పడేవారు. అయితే స్పీకర్‌ పదవి కోసం మెకార్థీ తన పంథాను మార్చుకున్నారు. అతిమితవాద వర్గానికి పదవులు ఇవ్వడంతో పాటు సభ నిర్వహణలో వారు కోరిన సంస్కరణలు చేపడతానంటూ వాగ్దానం చేశారు. ఏ సమయంలోనైనా తన ఉద్వాసనకు కేవలం ఒక్క రిపబ్లికన్‌ సభ్యుడు డిమాండ్‌ చేసినా- అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు సమ్మతిస్తానంటూ ఫ్రీడమ్‌ కాకస్‌ ముందు లొంగిపోయారు!

అభిప్రాయాలను మార్చుకోలేనివాడు రాజకీయ నాయకుడు కాలేడన్నది గిరీశం మాట. దాన్ని అక్షరాలా పాటించిన వ్యక్తి మెకార్థీ. కాలిఫోర్నియా రాష్ట్రం నుంచి రిపబ్లికన్‌ అభ్యర్థిగా ఎన్నికైన ఆయన మొదట్లో ఉదారవాదిగానే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. తరవాత అవసరార్థం అతివాదిగా మారిపోయారు. ఆయన 2010 మధ్యంతర ఎన్నికల్లో పాల్‌ రాయన్‌, ఎరిక్‌ కాంటొర్‌ అనే సాటి రిపబ్లికన్‌ నాయకులతో జట్టు కట్టారు. ప్రభుత్వ సంక్షేమ విధానాలను, పన్నుల విధింపును వ్యతిరేకించే అతివాద అభ్యర్థులను కలుపుకొనిపోయారు. వారి వ్యూహం ఫలించి 2010 ఎన్నికల్లో రిపబ్లికన్లు దిగువసభను కైవసం చేసుకున్నారు.

కాంటొర్‌ సభలో మెజారిటీ పక్ష నాయకుడిగా, మెకార్థీ విప్‌గా పదవులు చేపట్టారు. 2012-13లో అమెరికాను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ఫెడరల్‌ ప్రభుత్వం పన్నులు పెంచి, వ్యయాన్ని తగ్గించాల్సి వచ్చింది. టీపార్టీ ఉద్యమ నేతలతో కలిసి మెకార్థీ బిల్లుకు ప్రతికూలంగా ఓటు వేసినా, చివరకు విప్‌ హోదాలో బిల్లు ఆమోదం పొందేలా చూశారు! దీంతో అతిమితవాదులు టీపార్టీ ఉద్యమ సభ్యులతో కలిసి ఫ్రీడం కాకస్‌గా ఏర్పడ్డారు.

అవకాశవాదం.. అంతు తేల్చుతుంది సుమీ!
స్పీకర్‌ పదవికి 2014లో పోటీ చేసిన కాంటొర్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకున్నారు. తమ విధానాలను సమర్థించడం లేదని 2015లో స్పీకర్‌ జాన్‌ బోనర్‌ను, 2019 నాటి స్పీకర్‌ పాల్‌ రాయన్‌ను వారు సాగనంపారు. బోనర్‌కు 2015లో ఉద్వాసన పలికినప్పుడే కాకస్‌ మద్దతుతో స్పీకర్‌ పదవి చేపట్టాలని మెకార్థీ ఉవ్విళ్లూరినా అందుకు ఆ వర్గం సహకరించలేదు. తరవాత ట్రంప్‌ విధానాలను సమర్థించడం ద్వారా కాకస్‌కు దగ్గరవ్వాలని మెకార్థీ ప్రయత్నించారు.

కానీ 2021 జనవరి 6న అధ్యక్ష ఎన్నికల ఫలితాలను నిరసిస్తూ ట్రంప్‌ మద్దతుదారులు కాంగ్రెస్‌ భవనంపై దాడి చేసినప్పుడు మెకార్థీ దాన్ని తీవ్రంగా ఖండించారు. ట్రంప్‌ రాజీనామా చేయాలని పట్టుపట్టారు. ఇది పార్టీలోని అతిమితవాదులకు ఆగ్రహం కలిగించడంతో వెంటనే మాటమార్చి ట్రంప్‌ నివాసానికి వెళ్ళి మద్దతు ప్రకటించారు. ఇప్పుడు స్పీకర్‌ పదవిని చేపట్టేందుకు తన అవకాశవాదాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్ళారు. అమెరికన్ల సంక్షేమం కోసం స్పీకర్‌ హోదాలో మెకార్థీ ఉదారవాదులతో చేయికలపాల్సి వస్తే ఫ్రీడం కాకస్‌ ఆయన్ను ఇంటిముఖం పట్టించడం ఖాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.