LIVE : కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం
Published: May 20, 2023, 12:19 PM

Siddaramaiah takes oath as Chief Minister : కర్ణాటక ముఖ్యమంత్రిగా రెండోసారి సిద్ధరామయ్య ఇవాళ ప్రమాణస్వీకారం చేస్తున్నారు. గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ సిద్ధరామయ్య చేత ప్రమాణం చేయిస్తున్నారు. డీకే శివకుమార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఎనిమిది ఎమ్మెల్యేలతో కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయించాలని సిద్ధరామయ్య కర్ణాటక గవర్నర్కు లేఖ రాశారు. కొత్త మంత్రివర్గంలో పరమేశ్వర, ముణియప్ప, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, సతీశ్ జార్కిహోళి, ప్రియాంక్ ఖర్గే, రామలింగారెడ్డి, జమీర్ అహ్మద్ ఖాన్కు స్థానం దక్కింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు తొలి మంత్రివర్గంలో స్థానం దక్కింది.
మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి బెంగళూరులోని కంఠీరవ క్రీడా మైదానంలో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి కంఠీరవ స్టేడియాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. లక్ష మందికి పైగా కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారానికి బిహార్ సీఎం నితీశ్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే హాజరవుతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ తనకు బదులుగా పార్టీ ప్రతినిధిని పంపుతారని తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా అగ్ర నేతలందరూ హాజరయ్యారు. పార్లమెంటు ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీల ఐక్యతను చాటేందుకు ఈ వేదికను కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోనుంది.