chandbali latest designs: మగువ మనసు దోచే అందాల చందమామలు.. ఆ చాంద్​బాలీ నగలు!

author img

By

Published : Aug 29, 2021, 11:30 AM IST

latest jewelry designs, chandbali latest designs

చీరలే కాదు నగల్లోనూ కొత్త తరహా డిజైన్లను కోరుకుంటోందీ తరం. ఆభరణాల పెట్టెలో ధగధగ మెరిసే చాంద్​బాలీ నగలు యువతుల మనసు దోచుకుంటున్నాయి. మగువ మనసు దోచే ఆ అందాల చందమామల సరికొత్త డిజైన్లను ఓ సారి చూద్దామా...!

మొన్న కాసుల పేరు... నిన్న బొట్టు మాల... నేడు చందమామ... వేటి అందం వాటిదే... అవునండీ... కంచి, బెనారస్‌, ఉప్పాడ... ఇలా రకరకాల చీరలు కట్టుకున్నట్లే నగల్లోనూ విభిన్న డిజైన్లు కోరుకుంటుందీ తరం. అందులో భాగంగానే ఆభరణాల పెట్టెలో సరికొత్తగా మెరుస్తున్నవే చాంద్‌బాలీ నగలు.. యువతుల మనసు దోచుకున్న అందాల చందమామలు!

మనసు దోచే హారం
ధగధగ మెరిసే చందమామలు

ఆకాశంలో విరిసిన నిండు జాబిలినీ చంద్రవంకనీ ఎంతసేపు చూసినా తనివితీరదు. ఆ అందం నగల డిజైనర్లకు మరీ మరీ నచ్చేసినట్లుంది... తల తిప్పినా నవ్వినా మాట్లాడినా ఉయ్యాలజంపాలలూగే జుంకీల్లోకి ఆ చందమామను తెచ్చేశారు. అది మగువల మనసునీ దోచేసుకుంది. ఎందుకంటే సంప్రదాయ చుడీదార్‌, లంగావోణీ, గాగ్రా, చీర... ఇలా దేనిమీదకైనా చెవులకి చాంద్‌బాలీ లోలాకులు పెడితే చాలు, మెడలో నగలు లేకున్నా అమ్మాయి ముఖం చందమామను మించిన అందంతో వెలిగిపోతుంటుంది. దాంతో కుందన్లూ వజ్రాలూ అన్‌కట్‌ వజ్రాలూ కెంపులూ పచ్చలూ తెల్లరాళ్లూ నీలం రాళ్లూ... ఇలా ఒకటేమిటీ అన్ని రకాల రత్నాలనీ చొప్పించి మరీ ఆ చెవి జుంకీలను వేలకొద్దీ డిజైన్లలో రూపొందించేస్తున్నారు నగల డిజైనర్లు. కేవలం ముఖానికేనా ఆ జాబిలి సోయగం... మెడలోకి వస్తే మరెంత అందంగా ఉంటుందో అనిపించిందేమో, నెక్లెస్సులూ హారాల్లోకి కూడా చంద్రవంకల్ని చొప్పించడం మొదలెట్టారు. దీనికితోడు నిన్నమొన్నటి కాసులపేరూ బొట్టుమాల డిజైన్లు కూడా అమ్మాయిలకు బోరుకొట్టేసినట్లున్నాయి. ఎంచక్కగా చాంద్‌బాలీ నగల్నే మెడలోనూ చెవులకీ అలంకరించుకుని పెళ్లివేడుకలకీ శ్రావణమాస నోములకీ హాజరవుతున్నారు. పైగా ఈ డిజైన్‌ మెడ నిండుగా ఉంటుంది కాబట్టి ఒక్క నగ పెట్టుకున్నా చాలు, అందరి దృష్టీ అటే ఉంటుంది. ఇక, అందులో వజ్రాలో కెంపులో పచ్చల్లో చొప్పిస్తే ఎవరు మాత్రం కళ్లు తిప్పుకోగలరు చెప్పండి!

కళ్లు తిప్పుకోలేని సొగసులు
మగువ మనసు దోచే లోలాకులు

ఆనాటి ఫ్యాషనేగానీ...
అలాగని చాంద్‌బాలీ డిజైన్‌ ఈమధ్య కాలంలో వచ్చిందనుకుంటే పొరబాటే. మొఘలుల కాలం నుంచీ వాడుకలో ఉంది. ఆనాటి ఆభరణాలన్నింటిలోనూ డిజైన్‌లో భాగంగా నెలవంకా ఎంతో అందంగా ఇమిడిపోయేది. మొఘల్‌ డిజైన్లను పోలి ఉండే నాటి నిజాం నగల్లోనూ ఇది ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దాంతో చాంద్‌బాలీ హైదరాబాదీ సంప్రదాయ ఫ్యాషన్‌గానూ మారింది. మిగిలిన నగల్లోకన్నా చెవిలోలాకుల్లో ఈ డిజైన్‌ కొట్టొచ్చినట్లు కనిపించడంతో చాంద్‌బాలీ అన్న పేరు జుంకీలకు మారుపేరుగా స్థిరపడిపోయింది. కాలక్రమంలో చెవులకు పెట్టుకునే నగల్లో ఇదీ ఓ డిజైన్‌గా మాత్రమే అన్నట్లు ఉండేది. అయితే రామ్‌లీలాలో దీపికా పదుకొనే చాంద్‌బాలీలతో ముస్తాబవ్వడంతో దేశవ్యాప్తంగా ఈ ఫ్యాషన్‌ మరోసారి ఊపందుకుంది. అప్పటినుంచీ దీనిపట్ల క్రేజ్‌ రోజురోజుకీ పెరిగిందే తప్ప కాస్త కూడా తగ్గలేదు. రింగులాంటి ఆకారం వాటికి మధ్యవరకూ అర్ధచంద్రాకృతిలో తెల్లని కుందన్లూ రింగు కింద భాగంలో వేలాడే సౌత్‌ సీ లేదా బస్రా ముత్యాలూ... ఇదీ సంప్రదాయ చాంద్‌బాలీ. అయితే ఇప్పుడు రంగురంగుల కుందన్లూ అన్‌కట్‌ వజ్రాలూ ముత్యాలూ ఇతర విలువైన రత్నాలూ పొదుగుతూ మరెన్నో డిజైన్లలో వీటిని రూపొందిస్తున్నారు. ఇలాంటి డిజైనర్‌ చాంద్‌బాలీల్లో రాళ్లను మొత్తంగా పొదిగి కిందభాగంలో ఒకటే ముత్యం గానీ రత్నంగానీ లేదా గుత్తులుగుత్తులుగా ముత్యాల్నీ రత్నాల్నీ వేలాడదీయడం లేదా అవేమీ లేకుండానూ డిజైన్‌ చేస్తున్నారు. కుందన్‌కారి, మీనాకారి, పోల్కీ, పాచి వర్క్‌నీ చొప్పిస్తూ చాంద్‌బాలీలకు మరిన్ని మెరుగులద్దుతున్నారు. అచ్చంగా వజ్రాల్ని పొదిగినవీ బంగారంతో చేసినవీ కూడా వస్తున్నాయి.

ఆనాటి ఫ్యాషనేగానీ...

సంప్రదాయ చాంద్‌బాలీలూ లేదా డిజైనర్‌ చాంద్‌బాలీలకు పైభాగంలో రాళ్లకు బదులుగా లక్ష్మీదేవి, వినాయకుడి బొమ్మల్ని పెట్టి చేసినదే రామ్‌లీలా చాంద్‌బాలీ. దక్షిణాది బుట్ట డిజైన్‌ని చాంద్‌బాలీకి కింది భాగంలో పొదిగి చేసిన మరో డిజైనే... జుంకీబాలీ. వీటిల్లో ఒకటి నుంచి ఐదారు బుట్టలు కూడా పెట్టి వెడల్పుగా చేసేవీ ఉంటున్నాయి. కిందిభాగంలో వేలాడేలా కాకుండా దిద్దుల్లా పెట్టుకునేవాటిల్లోనూ చాంద్‌బాలీ డిజైన్లు వస్తున్నాయి. ఈ జుంకీ డిజైన్లనే ఒకదానిపక్కన ఒకటి పేర్చుకుంటూ నెక్లెస్‌లూ హారాలూ తయారుచేసేస్తున్నారు. వేరే డిజైన్లతో ఉన్న పొడవాటి హారాలకీ చాంద్‌బాలీ పెండెంట్‌ని అమరుస్తున్నారు. కెంపులూ తెల్లరాళ్లూ ముత్యాలూ పొదిగి చేస్తోన్న ఈ డిజైన్లు చూసేకొద్దీ చూడాలనిపించేలా ఉంటున్నాయి. మొత్తమ్మీద అటు ఉత్తరాది కుందన్‌కారీకి ఇటు దక్షిణాది టెంపుల్‌ డిజైన్లనీ జోడించి చేస్తోన్న చాంద్‌బాలీ, చెవి జుంకీగానే కాదు, మెడలో హారంగానూ వెలిగిపోతూ అమ్మాయిల అందంతో పోటీపడుతోంది.

అమ్మాయిల అందంతో పోటీపడే చాంద్​బాలీ

ఇదీ చదవండి: Shruthi Hassan: నేనూ సగటు ఆడపిల్లలాగనే కదా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.