'ప్రమాదం అంచున పాక్‌ పసిప్రాణాలు.. అత్తెసరు సాయం మాత్రమే..'

author img

By

Published : Sep 21, 2022, 8:53 PM IST

pakisthan children

పాకిస్థాన్‌ వరదలు అక్కడి చిన్నారులకు శాపంగా మారాయి. వందలాది మంది పసిపిల్లలు ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. చాలామంది కన్నవారిని కోల్పోయి కనీస వసతులులేక ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు యూనిసెఫ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక సంక్షోభం కారణంగా పాక్‌ ప్రభుత్వం అలాంటి వారిని పూర్తిగా ఆదుకునే పరిస్థితి లేకపోగా.. రేపటి పౌరులను ఆదుకునేందుకు విరాళాలు ఇవ్వాలన్న పిలుపునకు అత్తెసరు సాయం అందటంపై యూనిసెఫ్‌ విచారం వ్యక్తంచేసింది.

Pakisthan Floods : పాకిస్థాన్‌లో వరదబారిన చిన్నారులను ఆదుకునేందుకు విరాళాలు ఇవ్వాలన్న పిలుపునకు ఆశించినస్థాయిలో స్పందన లేదని.. యూనిసెఫ్‌ విచారం వ్యక్తం చేసింది. తాము కోరిన 39 మిలియన్‌ డాలర్లలో మూడోవంతు కంటే కూడా తక్కువగా విరాళాలు వచ్చినట్లు పేర్కొంది. మిత్రదేశాలు కూడా పాకిస్థాన్‌ను బిచ్చగాళ్ల మాదిరిగా చూస్తున్నాయని ఇటీవల పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ పేర్కొన్న నేపథ్యంలో యూనిసెఫ్‌ ప్రతినిధి వ్యాఖ్యలు అందుకు అద్దం పడుతున్నాయి.

దాయాది దేశం వరదలకు ముందు నుంచే తీవ్రమైన ఆర్థిక సంక్షోభం సహా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోంది. అది చాలదన్నట్లు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లుగా.. 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా భారీ వరదలు పాకిస్థాన్‌ ముంచెత్తాయి. పాకిస్థాన్‌ వరదల్లో 550మంది చిన్నారులు చనిపోయినట్లు యూనిసెఫ్‌ ప్రతినిధి తెలిపారు. ఆపన్నహస్తం అందకుంటే మరికొంతమంది చిన్నారుల ప్రాణంపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పాకిస్థాన్‌లోని చిన్నారులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తప్పనిసరి అవసరం ఉన్నవారికి వైద్యం, పోషకాహారం, విద్య అందించటం ద్వారా ఎంతో మంది చిన్నారులను కాపాడొచ్చని యూనిసెఫ్‌ ప్రతినిధి తెలిపారు.

పాకిస్థాన్‌ వరదల్లో 30 లక్షల మందికిపైగా చిన్నారులు నిరాశ్రయులయ్యారు. మూడు కోట్ల మందిపై వరద ప్రభావం పడింది. భారీ వరదలకు ఊళ్లకుఊర్లు, రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. పాకిస్థాన్‌ భూభాగంలో మూడో వంతు ప్రాంతాలు వరద గుప్పిటచిక్కాయి. వరదలొచ్చి దాదాపు నెలరోజులు కావస్తున్నా.. ఇంకా చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోగా, మరికొన్నిచోట్ల దెబ్బతిన్నాయి. వరద బారినపడిన 81 జిల్లాల్లోని వేలాది కుటుంబాలు.. బాహ్యాప్రపంచంతో సంబంధాలు కోల్పోయి దయనీయమైన స్థితిలో ఉన్నాయి. వారికిసాయం అందించాల్సిన అవసరం ఉందని యూనిసెఫ్‌ ప్రతినిధి ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఆహారం, తాగునీరు, మందులు లేక ఆయా కుటుంబాలు సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. ఆహారకొరత వల్ల చాలా మంది తల్లులు రక్తహీనత, పోషకాహార లోపంతో బాధపడుతున్నారని వారికి తక్కువ బరువు కలిగిన చిన్నారులు ఉన్నారని యూనిసెఫ్‌ ప్రతినిధి తెలిపారు.

పాక్‌ను వరదలు ముంచెత్తిన వెంటనే సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు యూనిసెఫ్‌ ప్రతినిధి తెలిపారు. తక్షణమే పది లక్షల డాలర్ల సాయం, అదనంగా మరో 30లక్షల డాలర్ల సాయం వరద ప్రభావిత ప్రాంతాల్లో పంపిణీ చేసినట్లు చెప్పారు. 71 మొబైల్‌ వైద్య శిబిరాలతోపాటు తీవ్రమైన వేదనతో ఉన్న చిన్నారులకోసం అభ్యాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వందల కిలోమీటర్లకుపైగా నిలిచిపోయిన వరదనీటి వల్ల అంటువ్యాధులు ప్రబలుతున్నట్లు చెప్పారు. నిరాశ్రయులైన లక్షలాది కుటుంబాలు రోడ్ల వెంట బహిరంగ ప్రదేశాల్లో నివసిస్తున్నారు. పాకిస్థాన్‌లోని వరద ప్రాంతాల్లో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని యూనిసెఫ్‌ ప్రతినిధి తెలిపారు. కలుషితనీరు తాగటం తప్ప మరో మార్గంలేదన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రపంచదేశాలన్నీ పాకిస్థాన్‌లోని చిన్నారులను ఆదుకోవాల్సి అవసరం ఉందని యూనిసెఫ్‌ ప్రతినిధి మరోసారి పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి: 'మానవులు విశ్వవ్యాప్తం'.. అంతరిక్ష నివాసానికి నాసా ఏర్పాట్లు.. కీలక ప్రకటన.

గేర్ మార్చిన పుతిన్.. ఉక్రెయిన్​పై పోరుకు మరో 3 లక్షల మంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.