UK PM race: సునాక్​కు కొత్త ఉత్సాహం.. టీవీ చర్చలో 'ఆమె'పై గెలుపు

author img

By

Published : Aug 6, 2022, 8:55 AM IST

Updated : Aug 6, 2022, 9:27 AM IST

RISHI SUNAK

UK PM race: బ్రిటన్ ప్రధాని పదవికి పోటీలో ఉన్న రిషి సునాక్.. తాజాగా ఓ టీవీ చర్చలో విజయం సాధించారు. గురువారం రాత్రి ఓ టీవీ ఛానెల్​లో చర్చ జరిగింది. ఇందులో ఎవరు విజయం సాధించారనే విషయంపై నిర్వహించిన ఎన్నికలో సునాక్‌కే పార్టీ సభ్యులు ఆధిక్యం కట్టబెట్టారు.

Rishi Sunak TV debate win: బ్రిటన్‌ ప్రధాని అభ్యర్థి రిషి సునాక్‌ తన ప్రత్యర్థి లిజ్‌ ట్రస్‌పై తాజాగా నిర్వహించిన ఓ ముఖాముఖి టీవీ చర్చలో విజయం సాధించారు. వీరిద్దరూ పార్టీ అధ్యక్ష పదవికి, ప్రధానమంత్రి స్థానానికి పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. 'బ్యాటిల్‌ ఫర్‌ నంబరు 10' పేరిట స్కై న్యూస్‌ ఛానల్‌ గురువారం రాత్రి కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల నడుమ తుది అభ్యర్థులిద్దరి మధ్య చర్చ నిర్వహించింది. ఈ సందర్భంగా సునాక్‌, ట్రస్‌లు తామెందుకు ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ స్థానంలోకి రావల్సిన ఆవశ్యకత ఉందో వివరించారు. చర్చలో ఎవరు విజయం సాధించారనే విషయంపై నిర్వహించిన ఎన్నికలో సునాక్‌కే పార్టీ సభ్యులు ఆధిక్యం కట్టబెట్టారు.

ఇటీవల చేపట్టిన పలు ఒపీనియన్‌ పోల్స్‌లో ట్రస్‌ కంటే బాగా వెనుకబడిన సునాక్‌కు తాజా విజయం ఉత్సాహాన్నిస్తుందని చెప్పొచ్చు. చివరగా పార్టీ సభ్యుల మధ్య నిర్వహించిన సర్వేలో సునాక్‌ కంటే ట్రస్‌ 32 శాతం ఆధిక్యంలో ఉన్నారు. ఈ క్రమంలో ఏ క్షణంలోనైనా ప్రధానమంత్రి పదవి రేసు నుంచి మీరు వైదొలుగుతారా? అని సునాక్‌ను ప్రేక్షకులు ప్రశ్నించారు. దీనికి ఆయన వెంటనే.. అలా జరగదు అని సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా తాను విశ్వసిస్తున్న అంశం కోసం పోరాడుతున్నానని, తన ఆలోచనలను దేశవ్యాప్తం చేస్తున్నానని బదులిచ్చారు. అధిక పన్నుల వల్లే మాంద్యం ముంచుకొస్తోందన్న వాదనను తోసిపుచ్చుతూ.. ద్రవ్యోల్బణం కారణంగానే మాంద్యం పరిస్థితులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న భారత సంతతి నేత రిషి సునాక్‌.. తన సమీప ప్రత్యర్థి లిజ్‌ట్రస్‌ కంటే వెనుకంజలో ఉన్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. అయితే ఈ పదవి కోసం జరుగుతున్న పోరులో ప్రారంభ దశలోనే ఉన్నామన్న ఆయన.. గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. పలు వివాదాల్లో కూరుకుపోయిన బోరిస్‌ జాన్సన్‌ గత నెల 7వ తేదీన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో తదుపరి ప్రధానిని ఎన్నుకునేందుకు అధికార కన్జర్వేటివ్‌ పార్టీ ప్రక్రియ చేపట్టింది. పార్టీ అధ్యక్ష పదవికి, తద్వారా ప్రధాని పదవికి ఎన్నిక మొదలవగా.. ఇందుకోసం తొలుత 11 మంది పోటీ పడ్డారు. అనేక రౌండ్ల అనంతరం తుది రేసులో మాజీ ఆర్థిక మంత్రి సునాక్‌, మాజీ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ నిలిచారు. కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీలతోపాటు సభ్యుల మద్దతునూ చూరగొన్నవారే పార్టీ అధ్యక్షులుగా, ప్రధానిగా బాధ్యతలు చేపడుతారు. ఈ క్రమంలోనే టోరీ సభ్యుల మద్దతు కూడగట్టేందుకు వీరిద్దరు ఆరువారాల దేశ పర్యటన ప్రారంభించారు. ఇప్పటికే పలు ఓటర్లతో మాట్లాడుతూ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో వెలువడుతున్న సర్వేలు రిషి కంటే ట్రస్ ముందు వరుసలో ఉన్నట్లు నివేదిస్తున్నాయి.

Last Updated :Aug 6, 2022, 9:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.