శ్రీలంక కొత్త ప్రధాని కోసం చర్చలు.. రంగంలోకి సైన్యం

author img

By

Published : May 11, 2022, 8:05 PM IST

Sri Lanka crisis

శ్రీలంక ప్రధాని రాజీనామా చేసినా పరిస్థితులు ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి. మహింద రాజపక్సను అరెస్టు చేయాలనే డిమాండ్లు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు సైన్యం రంగంలోకి దిగి గస్తీ చేపట్టింది. కొత్త ప్రధాని ఎన్నిక కోసం సొంతపార్టీతో పాటు ప్రతిపక్షాలతో అధ్యక్షుడు గొటబయ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. లంక పరిస్థితి పట్ల ఐరాస మానవహక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.

Sri Lanka crisis: ద్వీపదేశం శ్రీలంకలో ఆందోళనలు చల్లారడం లేదు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన మహింద రాజపక్స ట్రిన్‌కోమలీ నావల్ బేస్‌లో క్షేమంగా ఉన్నారని రక్షణశాఖ కార్యదర్శి కమల్ గుణరత్నె బుధవారం వెల్లడించారు. దీంతో అన్ని ప్రధాన సైనిక కేంద్రాల వద్ద ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని అధికారిక నివాసంపై నిరసనకారులు దాడిచేయడంతో ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు గుణరత్నె తెలిపారు. సంక్షోభం వేళ ప్రస్తుత పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నిరసనకారుల కాల్చివేత ఉత్తర్వులతో.. భద్రతా బలగాలు, ఆయుధ వాహనాలు దేశమంతా గస్తీ కాస్తున్నాయని గుణరత్నె తెలిపారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత మహిందను మరో ప్రాంతానికి తరలిస్తామని గుణరత్నె వెల్లడించారు. ఆయన మాజీ ప్రధాని అయినందున తగిన భద్రతకు అర్హుడని పేర్కొన్నారు. రాజపక్స మద్దతుదారులు, నిరసనకారులకు మధ్య చెలరేగిన హింసతో ఇద్దరు పోలీసులు సహా 9 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. సంక్షోభాన్ని గొటబయ అదుపు చేయలేకపోవడం, శాంతియుతంగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తెలుపుతున్న వారిపై ప్రధాని మద్దతుదారులు హింసకు దిగడంతో మహిందను అరెస్టు చేయాలని ప్రతిపక్షాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Sri Lanka crisis
రంగంలోకి సైన్యం

Sri Lanka News: లంకేయుల భద్రత కోసం సైనిక బలగాలు, వాహనాలు కొలంబోలోని రహదారుల వెంట కవాతు నిర్వహిస్తున్నాయి. ప్రజల ఆస్తులను లూటీ చేయడం, దాడులు చేసే వారిపై కాల్పులు జరపాలన్న రక్షణశాఖ ఆదేశాలతో సైన్యం గస్తీ చేపట్టింది. శ్రీలంకలో ప్రస్తుత సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొనేందుకు భారీగా బలగాలను మోహరించిన వేళ... సైనిక పాలన విధిస్తారన్న ఊహాగానాలకురక్షణశాఖ కార్యదర్శి గుణరత్నె తెరదించారు. లంకలో ఎలాంటి సైనికపాలన ఉండబోదని స్పష్టం చేశారు. ప్రస్తుత సామాజిక, ఆర్థిక, రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు లంకేయులంతా కలిసి రావాలని... విద్రోహ ప్రయత్నాలను తిరస్కరించాలని బుధవారం అధ్యక్షుడు గొటబయ ప్రజలను కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో నియంత్రణ, సహనం ఎంతో అవసరమని ట్వీట్ చేశారు. రాజకీయ సంక్షోభాన్ని తెరదించి, కొత్తప్రధానిని ఎన్నుకునేందుకు అధికార పార్టీ ఎంపీలతోపాటు ప్రధానప్రతిపక్షమైన ఎస్​జేబీతో గొటబయ చర్చలు కొనసాగుతున్నాయి. గత రెండ్రోజులుగా చర్చలు జరుగుతున్నా ఆశించిన ఫలితాలు రాలేదని అధికార వర్గాలు తెలిపాయి. తాజా ఘర్షణల్లో 250 మందికిపైగా గాయపడగా... అధికార పార్టీకి చెందిన చాలా మంది నేతల నివాసాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు.

Sri Lanka crisis
నిరసనకారులు తగలబెట్టిన బస్సులు
Sri Lanka crisis
రాజపక్స నివాసం వద్ద నిరసనకారులు చెరువులోకి తోసిన బస్సులు

Sri Lanka Violence: శ్రీలంకలో చెలరేగిన హింసతో తీవ్ర ఆందోళనకు గురైనట్లు ఐక్యరాజ్య సమితి మానవహక్కుల సంస్థ చీఫ్‌ మిషెల్లీ బ్యాచ్‌లెట్‌ పేర్కొన్నారు. జరిగిన హింసపై సమగ్ర పారదర్శకమైన దర్యాప్తునకు ఆమె పిలుపునిచ్చారు. లంక పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామన్న బ్యాచెలెట్‌.. సమస్య పరిష్కారానికి సంయమనం, అర్ధవంతమైన చర్చలు జరగాలని కోరారు. గాలేలోని మహింద నివాసం వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులపై జరిగిన దాడి విషయంలో ప్రధాని ముఖ్య భద్రతా అధికారికి... శ్రీలంక పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ దాడిపై నేరవిచారణను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఘటనపై విచారణను వేగవంతం చేయాలని అటార్నీ జనరల్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌కు సూచించారు. రుణాల ఊబిలో కూరుకుపోయిన లంకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సాంకేతిక చర్చలు కొనసాగిస్తామని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)​ తెలిపింది. శ్రీలంక విధానాలకు అనుగుణంగా సహాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. శ్రీలంకకు 2,300 కోట్లనుంచి 4,600 కోట్ల ఆర్థిక సహాయం అందిస్తామని గత సమావేశంలో ఐఎంఎఫ్​ హామీ ఇచ్చింది.

ఇదీ చదవండి: రష్యాకు ఉక్రెయిన్ షాక్.. గ్యాస్ సరఫరాకు బ్రేక్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.