రష్యా సైనికుల అకృత్యాలు.. వెలుగులోకి 10 చిత్రహింస కేంద్రాలు.. సామూహికంగా..

author img

By

Published : Oct 2, 2022, 10:43 PM IST

russia ukraine war

ఉక్రెయిన్‌లో రష్యా సైనికుల అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు మాస్కో సైన్యం నియంత్రణలో ఉన్న ఇజియం నగరంలో పది చిత్రహింస కేంద్రాలు, పెద్దపెద్ద సామూహిక ఖననాలు జరిపిన ప్రదేశాలు వెలుగులోకి వచ్చాయి. సమాధులను తవ్వగా మృతదేహాలపై చిత్రహింసలకు గురిచేసిన గుర్తులు కనిపించినట్లు ఉక్రెయిన్‌ ఆరోపించింది.

ఉక్రెయిన్‌పై సైనిక చర్య కొనసాగిస్తున్న రష్యా పట్టుబడిన వైరిపక్షం సైనికులను తీవ్ర చిత్రహింసలకు గురిచేసినట్లు బాధితులు తెలిపారు. ఇజియం నగరంలో ఉక్రెయిన్‌ సైనికులు, పౌరులను రష్యా సేనలు చిత్రహింసలకు గురిచేసిన పదిప్రాంతాలు వెలుగులోకి వచ్చాయి. ఏడు నెలలుగా యుద్ధం చేస్తున్న మాస్కో సైన్యం ఇజియం నగరాన్ని చిత్రహింసలకు కేంద్రంగా మార్చుకుంది. బాధితులు, పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇజియం నగరంలో ఉన్న పది చిత్రహింసా కేంద్రాలను గుర్తించిన అంతర్జాతీయ మీడియా ఏజెన్సీ వాటిలో ఐదింటిని సందర్శించింది. సూర్యకిరణాలు కూడా ప్రసరించని గృహ సముదాయంలో రష్యా సైన్యం చిత్రహింస కేంద్రాలను ఏర్పాటు చేసుకుంది.

russia ukraine war
ఉక్రెయిన్​లో సమాధులు

రష్యా సైనికుల చెర నుంచి బయటపడిన 15 మంది ఉక్రెయిన్‌ సైనికులు తాము అనుభవించిన నరకాన్ని మీడియాతో వెల్లబోసుకున్నారు. చిత్రహింసలకు తాళలేక ఎనిమిది మంది అక్కడే చనిపోయినట్లు చెప్పారు. అందులో ఒకరు పౌరుడని బాధిత కుటుంబాలు తెలిపారు. ఇజియం అటవీ ప్రాంతంలోని శ్మశానవాటికలో 447 సమాధులను తవ్వగా అందులో 30 మృతదేహాలపై చిత్రహింసలకు గురి చేసిన గుర్తులు ఉన్నాయి. చేతులు కట్టేసినట్లు, అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చిన గాయాలు, కత్తిగాట్లు, విరిగిపోయిన అవయవాలు కనిపించినట్లు ఖార్కివ్‌లో ప్రాసిక్యూషన్‌ కార్యాలయం తెలిపింది. సామూహిక ఖననాలు చేసిన చోట మృతదేహాల చేతులు కట్టేసి ఉన్నట్లు పేర్కొంది. ఇదే నగరంలో మరో రెండు భారీ సామూహిక శ్మశానవాటికలు బయటపడినట్లు ఉక్రెయిన్ అధికారవర్గాలు తెలిపాయి.

russia ukraine war
.

రష్యా ఆక్రమించిన ఇజియం నగరాన్ని కొద్ది రోజుల క్రితమే తిరిగి ఉక్రెయిన్‌ స్వాధీనం చేసుకుంది. ఇక్కడ గాయపడిన వందలాది మందికి చికిత్స చేసిన వైద్యుడు కూడా మాస్కో సైనికుల చిత్రహింసలను ధ్రువీకరించారు. తన వద్దకు చేతులు, కాళ్లపై తుపాకీ గాయాలు, విరిగిన ఎముకలు, తీవ్రమైన కాలిన గాయాలతో వచ్చేవారని తెలిపారు. ఈ గాయాలు ఎలా అయ్యాయో చెప్పేవారు కాదన్నారు. గాయాలతో వచ్చిన సైనికులు కూడా అవి ఎలా అయ్యాయో చెప్పేందుకు ఇష్టపడలేదని వైద్యుడు తెలిపారు.

russia ukraine war
చిత్రహింస కేంద్రంలోని గది

యుద్ధ సమయాల్లో మూడు కారణాలతో చిత్రహింసలకు గురిచేస్తారని మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఒకటి తమకు అవసరమైన సమాచారం కోసం, రెండు శిక్షించటంతోపాటు భయపెట్టేందుకు, మూడు ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలియాలన్నదే చిత్రహింసల ముఖ్య ఉద్దేశమన్నారు. ఉక్రెయిన్‌ సైనికులను లేదా పౌరులను చిత్రహింసలకు గురిచేసిన తర్వాత వదిలిపెట్టినప్పటికీ ఆ విషయం ఎవరికి చెప్పొద్దని రష్యా సైనికులు బెదిరించేవారని కొందరు బాధితులు తెలిపారు. జెనీవా చట్టాల ప్రకారం పోరాట సమయంలో యుద్ధ ఖైదీలను లేదా పౌరులను చిత్రహింసలకు గురిచేస్తే అది యుద్ధ నేరంగా పరిగణిస్తారు.

russia ukraine war
.

ఇవీ చదవండి: 'ఇయన్'​ బీభత్సానికి 47 మంది బలి.. మోదీ సంతాపం

స్టేడియంలో ఫ్యాన్స్ గొడవ.. 125 మంది దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.