పుతిన్‌పై హత్యాయత్నం.. కారుపై బాంబు దాడి.. త్రుటిలో తప్పిన ప్రమాదం

author img

By

Published : Sep 15, 2022, 4:01 PM IST

putin assassination attempt a car bomb

Putin Assassination Attempt: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​పై హత్యాయత్నం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ప్రయాణిస్తున్న కారుపై బాంబు దాడి జరిగినట్లు జనరల్ జీవీఆర్ టెలిగ్రామ్ ఛానల్ వెల్లడించింది. ఈ ప్రమాదం నుంచి పుతిన్​కు సురక్షితంగా బయటపడ్డారని తెలిపింది.

Putin Assassination Attempt: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌పై మరోసారి 'హత్యాయత్నం' జరిగినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఆయన ప్రయాణిస్తున్న కారుపై 'బాంబు దాడి' జరిగినట్లు జనరల్‌ జీవీఆర్‌ టెలిగ్రామ్‌ ఛానల్‌ వెల్లడించింది. అయితే, ఈ ప్రమాదం నుంచి పుతిన్‌ సురక్షితంగా బయటపడ్డారని పేర్కొంది.

పుతిన్‌ తన నివాసానికి తిరిగొస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న లిమోసిన్‌ కారు ముందువైపు ఎడమ చక్రం భారీ శబ్దంతో పేలిందని ఆ టెలిగ్రామ్‌ ఛానల్ తెలిపింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది కారు నుంచి పొగలు వస్తున్నప్పటికీ.. అధ్యక్షుడి వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారని పేర్కొంది. ఈ ఘటనలో పుతిన్‌కు ఎలాంటి హానీ జరగలేదని, ఆ తర్వాత మరో బ్యాక్‌అప్‌ కాన్వాయ్‌లో పుతిన్‌ను అధ్యక్ష నివాసానికి తరలించారని క్రెమ్లిన్‌ అంతర్గత వర్గాలు చెప్పినట్లు టెలిగ్రామ్‌ ఛానల్‌ వెల్లడించింది. ఘటన సమయంలో పుతిన్‌ కాన్వాయ్‌లోని తొలి ఎస్కార్ట్‌ కారుకు అంబులెన్స్‌ అడ్డుగా వచ్చిందట. రెండో ఎస్కార్ట్‌ కారు ఆగకుండా వెళ్లిపోయినట్లు పేర్కొంది.

ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు గానీ.. ప్రమాదం తర్వాత పెద్ద ఎత్తున అరెస్టులు జరిగినట్లు సమాచారం. అధ్యక్షుడి పర్యటనకు సంబంధించిన భద్రతలో రాజీ పడినందుకు పుతిన్ సెక్యురిటీ సర్వీస్‌కు చెందిన పలువురు అధికారులను అరెస్టు చేసినట్లు ఆ ఛానల్ తెలిపింది. అధ్యక్షుడి బాడీగార్డ్‌ సర్వీస్‌ హెడ్‌ సహా పలువురు ఉన్నత అధికారులను సస్పెండ్‌ చేసి కస్టడీలోకి తీసుకున్నట్లు పేర్కొంది.

గతంలోనూ పలుమార్లు హత్యాయత్నం..
ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభించినప్పటి నుంచి రష్యాలో కొన్ని వర్గాల నుంచి పుతిన్‌కు వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ క్రమంలోనే ఆయనపై ఈ దాడికి యత్నించి ఉంటారని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే, కొద్ది నెలల క్రితం కూడా పుతిన్‌పై హత్యాయత్నం జరిగినట్లు ఉక్రెయిన్‌ తెలిపింది. కాకసస్‌ పర్యటనలో ఉన్న సమయంలో అక్కడి ప్రతినిధులు పుతిన్‌పై దాడి చేసినట్లు ఉక్రెయిన్‌ రక్షణశాఖ వర్గాలు గతంలో వెల్లడించాయి. ఆ విషయాన్ని రష్యా రహస్యంగా ఉంచినట్లు తెలిపాయి. అయితే, తనపై హత్యాయత్నాలు గురించి 2017లో పుతిన్‌ ఓసారి స్వయంగా ప్రకటించారు. అప్పటి వరకు తనను చంపేందుకు ఐదుసార్లు యత్నాలు జరిగాయని, అయితే వాటి గురించి తాను ఆందోళన చెందబోనని అప్పట్లో పేర్కొన్నారు.

ఇవీ చదవండి: కెనడాలో హిందూ ఆలయం అపవిత్రం.. ఖలిస్థానీ వర్గాల దుశ్చర్య.. భారత్ ఫైర్

కారు ప్రమాదానికి గురైన జెలెన్​స్కీ.. కాన్వాయ్​ను ఢీకొట్టిన వాహనం.. ఆ తర్వాత..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.