'ఇప్పటికి గుణపాఠం నేర్చుకున్నాం.. కూర్చుని మాట్లాడుకుందాం'.. మోదీకి పాక్ ప్రధాని రిక్వెస్ట్

author img

By

Published : Jan 17, 2023, 2:26 PM IST

Pakistan PM Shehbaz Sharif On India

Pakistan PM Shehbaz Sharif On India : మూడు యుద్ధాలు జరిగిన తర్వాత.. పాకిస్థాన్​ గుణపాఠాన్ని నేర్చుకుందని చెప్పారు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్​. కశ్మీర్​ లాంటి అంశాలంపై కూర్చుని చర్చిద్దామని భారత ప్రధాని నరేంద్ర మోదీకి పిలుపునిచ్చారు.

Pakistan PM Shehbaz Sharif On India : దాయాది దేశం పాకిస్థాన్​ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఒక అణ్వస్త్ర దేశం.. అడుక్కోవాల్సిన పరిస్థితి సిగ్గుచేటని ఇటీవల వ్యాఖ్యానించిన ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్​ షరీఫ్​ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు యుద్ధాలు జరిగిన తర్వాత.. పాకిస్థాన్​ గుణపాఠాన్ని నేర్చుకుందని చెప్పారు. కశ్మీర్​ లాంటి అంశాలపై కూర్చుని చర్చిద్దామని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పిలుపునిచ్చారు. కశ్మీర్​లో శాంతిని కోరుకుంటున్నట్లు పునరుద్ఘాటించారు. దుబాయ్​కు చెందిన ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత నాయకత్వానికి, మోదీకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే.. కశ్మీర్​ లాంటి అంశాలపై ఇప్పటికైనా కూర్చుని మాట్లాకుందాం. ఒకరితో ఒకరు గొడవపడి.. బాంబులు, మందుగుండు సామగ్రి వంటివాటిపై వనరులను, సమయాన్ని వృథా చేసుకుంటున్నాం. ఈ సమస్యలను పరిష్కరించుకుని శాంతియుతంగా జీవించాలనుకుంటున్నాం. భారత్​తో మూడు సార్లు యుద్ధం చేసి మరిన్ని కష్టాలు, పేదరికం, నిరుద్యోగాన్ని తెచ్చుకున్నాం. రెండు దేశాల్లో ఇంజినీర్లు, డాక్టర్లు, నైపుణ్యం కలిగిన కార్మికులు ఉన్నారు. వారి సేవలను ఉపయోగించుకుని ఇరుదేశాలు బలోపేతం కావొచ్చు.

-- షెహబాజ్ షరీఫ్​, పాకిస్థాన్​ ప్రధానమంత్రి

పాకిస్థాన్​ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. ఘోరమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్.. నిత్యవస సరకులు సైతం సరఫరా చేయలేని పరిస్థితిలో ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో గోధుమల కొరత ఏర్పడి పిండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఘోరమైన పిండి సంక్షోభం ఏర్పడి అనేక చోట్ల తొక్కిసలాటలు జరిగాయి. పిండిని దక్కించుకునేందుకు ప్రజలు రోజు అనేక గంటల పాటు రోడ్లపైనే వేచిచూస్తున్నారు. సాయుధ దళాలు పంపిణీ చేస్తున్న పిండి వాహనల చుట్టూ ప్రజలు ఎగబడుతున్నారు.

వీటితోపాటు ఉగ్రవాద సంస్థ తెహ్రీక్‌-ఎ-తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) నుంచి కూడా ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు.. విదేశీ మారక ద్రవ్య నిల్వలు 4.3 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. వాణిజ్య బ్యాంకులతో కలిపి సుమారు 10.18 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. గత తొమ్మిదేళ్లలో ఇదే అత్యల్పం. ఇదిలా ఉండగా.. రుణాల విషయంలో మిత్రదేశాలు కూడా మమ్మల్ని బిచ్చగాళ్లలా చూస్తున్నాయని షెహబాజ్‌ షరీఫ్‌ గతంలోనూ ఓసారి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి: 'భారత్​ దౌత్య విజయం'.. మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన ఐరాస

అమెరికాలో కాల్పుల్లో ఆర్నెళ్ల చిన్నారి సహా ఆరుగురి మృతి.. రోడ్డు ప్రమాదంలో 19 మంది..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.