ముష్కరుల కాల్పుల్లో 29 మంది మృతి.. అమెరికా రాయబారులను చంపి.. శవాలకు నిప్పు

author img

By

Published : May 17, 2023, 10:58 AM IST

gunmen attack nigeria

Nigeria Gunmen Attack : నైజీరియాలో అమాయక ప్రజలపై ముష్కరులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 29 మంది మరణించారు. మరో ఘటనలో అమెరికా కాన్సులేట్ సిబ్బంది లక్ష్యంగా ముష్కరులు దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

Nigeria Gunmen Attack : ఉత్తర మధ్య నైజీరియాలో ముష్కరులు రెచ్చిపోయారు. సమీపంలోని గ్రామాలపై తుపాకులతో భీకర కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 29 మంది మరణించారు. ఘటనలో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ మేరకు నైజీరియా అధికారులు వెల్లడించారు. ముష్కరుల దాడి తర్వాత అనేక మంది స్థానికుల ఆచూకీ తెలియరాలేదని పేర్కొన్నారు.

సోమవారం అర్ధరాత్రి మాంగు ప్రాంతంలోని మూడు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు కాల్పులు జరిపారని స్థానికుడు తెలిపాడు. ముష్కరులు అనేక ఇళ్లకు నిప్పంటించారని పేర్కొన్నాడు. మరోవైపు.. అమాయకులపై ముష్కరులు జరిపిన దాడులను ఉత్తర మధ్య నైజీరియా గవర్నర్ సైమన్ లలాంగ్ ఖండించారు. అమాయక ప్రజలపై దాడితో తాను కలవరపడ్డానని ఆయన తెలిపారు. నిందితులను తక్షణమే గుర్తించి.. తగిన చర్యలు తీసుకోవాలని ఆయన భద్రతా బలగాలను ఆదేశించారు.

యూఎస్ ఎంబసీ వాహనంపై..
ఆగ్నేయ నైజీరియాలో అమెరికా ఎంబసీ సిబ్బందితో వెళ్తున్న కాన్వాయ్​ను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు, ఇద్దరు అమెరికా కాన్సులేట్ సిబ్బంది మరణించారు. అనంతరం వారి మృతదేహాలకు నిప్పంటించి దగ్ధం చేశారు. కాన్వాయ్​లోని వాహనాలకూ నిప్పంటించారు. అనంబ్రా రాష్ట్రంలోని ఓగ్బారు ప్రధాన రహదారిపై జరిగిందీ ఘటన.

పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేసరికి సాయుధులు పారిపోయారని అధికారులు వెల్లడించారు. కాన్వాయ్​లో సాధారణ అమెరికా పౌరులు లేరని తెలిపారు. రాయబారులు ఆ దారిలో వెళ్లడానికి కారణాలు ఇంకా తెలియలేదని వివరించారు. 'అంత పెద్ద కాన్వాయ్.. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, పటిష్ఠ భద్రత లేకుండా ఆ ప్రాంతంలోకి వెళ్లడం విచారకరం' అని అనంబ్రా పోలీసు శాఖ ప్రతినిధి టోచుక్వూ ఇకెంగా పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన అమెరికా విదేశాంగ శాఖ.. నైజీరియా భద్రతా ఏజెన్సీతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. అమెరికా సిబ్బంది రక్షణ తమకు అత్యంత ముఖ్యమని, అందుకోసం కావాల్సిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

స్కూల్​ బస్సును ఢీకొట్టిన ట్రక్కు..
ఆస్ట్రేలియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. మెల్​బోర్న్​లో మంగళవారం మధ్యాహ్నం జరిగిందీ ప్రమాదం. ఘటన సమయంలో బస్సులో 45 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. బస్సులో ఉన్న పిల్లల వయసు 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉంటుందని పేర్కొన్నారు.

బోటు బోల్తా.. 23 మంది గల్లంతు..
మలావిలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. షైర్​ నదిలో చెక్క పడవ బోల్తా కొట్టడం వల్ల ఒక చిన్నారి మృతి చెందగా.. మరో 23 మంది నీటిలో మునిగిపోయారు. ఈ ఘటన మంగళవారం జరిగింది. ఇప్పటికే నీటిలో మునిగిన వారి కోసం మలావి రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించి 13 మందిని రక్షించాయి. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. మరోవైపు ఘటనాస్థలికి మలావి నీటి పారుదల శాఖ మంత్రి అబిదా మియా చేరుకున్నారు. ఆయన దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

చైనా మత్స్యకార నౌక బోల్తా..
Chinese Ship Capsized : హిందూ మహాసముద్రంలో చైనా మత్స్యకార నౌక బోల్తా పడింది. ఈ ఘటనలో 39 మంది గల్లంతైనట్లు చైనా మీడియా బుధవారం పేర్కొంది. నౌక బోల్తా కొట్టిన సమయంలో చైనా, ఇండోనేసియాకు చెందిన వారు 17 మంది చొప్పున ఉన్నారు. మరో ఐదుగురు ఫిలిప్పీన్స్​ దేశానికి చెందిన వారు ఉన్నారు. మంగళవారం జరిగిందీ ప్రమాదం. ఇప్పటి వరకు గల్లంతైన వారి ఆచూకీ లభ్యం కాలేదు. మరోవైపు ఈ ప్రమాదంపై స్పందించిన చైనా అధ్యక్షుడు జిన్​పింగ్.. గల్లంతైన వారిని రక్షించేందుకు కృషి చేయాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.