'భారత్‌- ఆస్ట్రేలియా బంధం@3C'.. 'మోదీ ఈజ్​ ది బాస్​.. ఇంత రెస్పాన్స్​ ఎవరికీ రాలేదు!'

author img

By

Published : May 23, 2023, 4:35 PM IST

Modi Australia Visit 2023

భారత్‌, ఆస్ట్రేలియా సంబంధాలు.. పరస్పరం నమ్మకం, విశ్వాసాల ఆధారంగా బలపడ్డాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సిడ్నీలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. ఆస్ట్రేలియా తరహాలో భారత్‌ కూడా అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గత తొమ్మిదేళ్లలో అనేక రంగాల్లో ఇప్పటికే స్పష్టమైన పురోగతి సాధించిందని వివరించారు. ప్రపంచమంతా బాగుండాలి, అందులో మేమూ ఉండాలన్నదే భారత్‌ అభిమతమన్న మోదీ.. ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు అనే నినాదంతో ముందుకెళుతున్నట్లు స్పష్టం చేశారు.

Modi Australia Visit 2023 : ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ.. సిడ్నీలోని కుదోస్‌ బ్యాంక్ ఎరెనాలో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్, మాజీ ప్రధానితోపాటు పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ఈ సమావేశంలో పాల్గొన్నారు. సుమారు 21వేల మంది ప్రవాస భారతీయులు హాజరైన... ఈ సమావేశానికి మోదీని ఆహ్వానించిన ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్.. మోదీని బాస్‌తో పోల్చారు.

'ఆస్ట్రేలియాతో కష్టసుఖాలను భారత్​ పంచుకుంది'
ఈ సందర్భంగా భారత్‌-ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సంబంధాలను ప్రస్తావించిన ప్రధాని మోదీ.. అనేక సారూప్యతలను గుర్తుచేశారు. భారత్‌- ఆస్ట్రేలియా మధ్య క్రికెట్‌ నుంచి మాస్టర్‌ చెఫ్‌ వరకూ అనేక అంశాలను ప్రస్తావించారు. ఆస్ట్రేలియాతో అనేక కష్టసుఖాలను భారత్‌ పంచుకుందని తెలిపిన మోదీ.. దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ చనిపోయినప్పుడు కోట్లాది మంది భారతీయులు ఎంతో బాధపడ్డారని పేర్కొన్నారు.

Modi Australia Visit 2023
ప్రధాని మోదీ

"కామన్వెల్త్‌, క్రికెట్‌, కర్రీ.. ఈ 3Cలు మన బంధాన్ని ప్రభావితం చేస్తాయి. భారత్‌, ఆస్ట్రేలియాను కలిపే మరో బంధం యోగా. ఆస్ట్రేలియా వాసులు సహృదయులు, విశాలహృదయులు. భారతీయులను అక్కున చేర్చుకున్నారు. భారతీయ భాషలన్నీ ఆస్ట్రేలియాలో ప్రముఖంగా వినిపిస్తాయి. నేను మళ్లీ వస్తానని 2014లోనే మీకు వాగ్దానం చేశాను. మళ్లీ వచ్చి నా వాగ్దానం నెరవేర్చుకున్నా"

-- నరేంద్ర మోదీ, భారత ప్రధాని

'ఇంటర్​నెట్​ వినియోగంలో భారత్​ టాప్​-2'
ఇదే సమయంలో గత తొమ్మిదేళ్లలో భారత్‌ సాధించిన ప్రగతిని గుర్తు చేసిన ప్రధాని మోదీ.. మొబైల్‌ వినియోగం, ఫిన్‌టెక్‌ నుంచి పాల ఉత్పత్తి రంగం వరకూ అనేక అంశాల్లో భారత్‌ మొదటి స్థానంలో నిలిచిందని వివరించారు. ఇంటర్‌నెట్‌ వినియోగంలో ప్రపంచంలో భారత్‌ రెండో స్థానంలో ఉందని మోదీ తెలిపారు. అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న 140 మంది కోట్ల ప్రజల కల సాకారమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Modi Australia Visit 2023
సిడ్నీలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ

'ఆర్థిక సంక్షోభంలో అనేక దేశాలు.. కానీ భారత్​ మాత్రం..'
ప్రపంచంలో అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయని పేర్కొన్నారు ప్రధాని మోదీ. కానీ భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం స్థిరంగా వృద్ధి సాధిస్తోందని గుర్తుచేశారు. భారత్‌ అన్ని దేశాలకు ఆశాదీపమని ప్రపంచ బ్యాంకు చెప్పిందన్నారు. ఇదే సమయంలో వసుదైక కుటుంబం అనేది భారత నినాదమని మరోసారి గుర్తు చేశారు.

Modi Australia Visit 2023
ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌, భారత ప్రధాని మోదీ

మోదీ ఈజ్‌ ది బాస్‌: అల్బనీస్‌
భారత ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్లినా అనూహ్య స్పందన వస్తోందని, రాక్‌స్టార్ రిసెప్షన్ ఉంటుందని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ అన్నారు. మోదీని డియర్‌ ఫ్రెండ్ అని సంబోధించిన ఆయన.. మన ప్రధానిని అమెరికన్ సింగర్‌ బ్రూస్‌ స్ప్రింగ్‌స్టీన్‌తో పోల్చారు. "చివరిసారిగా నేను ఈ వేదికపై బ్రూస్‌ స్ప్రింగ్‌స్టీన్‌ను చూశాను. ఆయనకు కూడా ఇంత స్పందన రాలేదు. మోదీ ఈజీ ది బాస్‌" అని ఆయనకు లభిస్తోన్న ఆదరణను చూసి అల్బనీస్‌ ఆశ్చర్యపోయారు. అలాగే బ్రిస్బేన్‌లో త్వరలో కొత్త భారత కాన్సులేట్ ప్రారంభమవుతుందని ఇద్దరు నేతలు ప్రకటించారు. మోదీ పర్యటన ద్వారా భారత్, ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరతాయని అల్బనీస్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.