భారత్​, అమెరికా సహా 12 దేశాల మధ్య 'ఇండో- పసిఫిక్​ ట్రేడ్​ డీల్'

author img

By

Published : May 23, 2022, 2:48 PM IST

BIDEN

జపాన్​ పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇండో పసిఫిక్​ ట్రేడ్​ డీల్​ను ప్రవేశపెట్టారు. ఇందులో అమెరికా, ఇతర క్వాడ్​ దేశాలు సహా 12 దేశాలు భాగమయ్యాయి. ఇండో-పసిఫిక్​ ప్రాంతం ఆర్థికంగా బలోపేతం అవడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

ఆర్థిక, వ్యాపార రంగంలో కలిసి పనిచేసే దిశగా భారత్‌, అమెరికా సహా 12 దేశాల మధ్య ఇండో-పసిఫిక్‌ ఒప్పందం కార్యరూపం దాల్చింది. జపాన్‌లోని టోక్యోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ ఒప్పందాన్ని ప్రారంభించారు. ఇండో-పసిఫిక్​ ప్రాంతం ఆర్థికంగా బలోపేతం అవడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ ఒప్పందంలో క్వాడ్​ దేశాలతో పాటు బ్రూనయ్​, దక్షిణ కొరియా, ఇండోనేసియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్​, సింగపూర్​, వియత్నాం, థాయ్​లాండ్, మలేసియా దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు ప్రపంచంలోని 40 శాతం జీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్​, ఉక్రెయిన్​-రష్యా యుద్ధ పరిస్థితులు ప్రభావం చూపించిన నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేందుకు వీలుగా ఆర్థిక వ్యవస్థలను తీర్చిదిద్దడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుందని సభ్య దేశాలు పేర్కొన్నాయి.

"సరఫరా గొలుసుల విస్తరణ, డిజిటల్‌ వర్తకం, శుద్ధ ఇందనం, అవినీతి రహిత ప్రయత్నాలు సహా ఆసియా ఆర్థిక వ్యవస్థలతో అమెరికా మరింత సన్నిహితంగా పని చేసేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుంది. అమెరికాలో ద్రవ్యోల్బణం ఉందన్న మాట నిజం. కానీ ఇతర దేశాలతో పోలిస్తే అంత తీవ్రంగా లేదు. ఈ ఏడాది అమెరికా ఆర్థిక వ్యవస్థ చైనా కంటే వేగంగా పుంజుకుంటుంది. "

-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు

అయితే తమ మార్కెట్లలోకి ప్రవేశించడానికి భాగస్వామ్య దేశాలకు అమెరికా పన్నుల తగ్గింపు సహా ఒప్పందంలో ప్రోత్సాహకాలను ఇవ్వలేదన్న విమర్శలు వస్తున్నాయి. 2017లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. ట్రాన్స్​-పసిఫిక్​ భాగస్వామ్యం నుంచి అమెరికా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో అమెరికాకు సంబంధించిన పలు వ్యాపార ఒప్పందాలకు నష్టం కలిగింది. ఈ నేపథ్యంలో అందుకు ప్రత్యామ్నాయంగా ఈ ఇండో పసిఫిక్​ ఎకనామిక్​ ఫ్రేమ్​వర్క్​ను ప్రవేశపెట్టారు జో బైడెన్.

తైవాన్‌ ఆక్రమణకు చైనా యత్నిస్తే.. తైవాన్‌కు తాము అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భరోసా ఇచ్చారు. తైవాన్‌కు మద్దతుగా సైనికపరంగా అమెరికా జోక్యం చేసుకుంటుందని ప్రకటించారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య తర్వాత స్వయంపాలిత ద్వీపమైన తైవాన్‌ భద్రతకు మరింత ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. టోక్యోలో ఓ విలేకర్ల సమావేశంలో మాట్లాడిన బైడెన్.. తైవాన్‌కు వ్యతిరేకంగా చైనా బలగాలను ఉపయోగించే ప్రయత్నం మంచిది కాదని అన్నారు.

ఇదీ చూడండి : Cannes 2022: రెడ్​ కార్పెట్​పై మహిళా నిరసనకారుల రచ్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.