'రాజరికం మాకొద్దు'.. సోషల్ మీడియాలో 'నాట్ మై కింగ్' ​ట్రెండ్

author img

By

Published : Sep 17, 2022, 7:27 AM IST

anti monarchy protests

Anti Monarchy Protests: బ్రిటన్​లో ఓ వైపు మహారాణి మరణానికి వేలమంది సంతాపం తెలుపుతుంటే.. మరోవైపు రాజరికాన్ని రద్దు చేయాలని డిమాండ్లు మొదలయ్యాయి. రాచరికాన్ని వ్యతిరేకిస్తూ.. రాజకుటుంబాన్ని వెక్కిరిస్తూ.. నినాదాలు, పోస్టర్లు, ప్లకార్డులు పట్టుకొని వీధుల్లో నినాదాలు చేస్తున్నారు.

Anti Monarchy Protests: "రాజరికం అగౌరవప్రదమైంది. ఎవరైనా పుట్టుకతోనే పాలకులై పోయే పద్ధతిని నేను అంగీకరించను" అంటూ ప్రస్తుత ప్రధాని ట్రస్‌ 30 సంవత్సరాల కిందట మాట్లాడిన వీడియో ఇప్పుడు బయటపడటం గమనార్హం.
ఎలిజబెత్‌ రాణి మరణంతో.. బ్రిటిష్‌ రాజరికంపై దాడి మొదలైంది. ఒకవైపు తమ మహారాణి మరణానికి వేలమంది సంతాపం తెలుపుతుంటే.. మరోవైపు రాజరికాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్లు మొదలయ్యాయి. రాజ్యాధిపతిగా పదవి చేపట్టిన ప్రిన్స్‌ ఛార్లెస్‌ను రాజుగా గుర్తించటానికి నిరాకరిస్తూ వీధుల్లో.. సామాజిక మాధ్యమాల్లో 'నాట్‌ మై కింగ్‌' అనే హ్యాష్‌ట్యాగ్‌ వీరవిహారం చేస్తోంది!

బ్రిటన్‌లో రోజూ అనేక చోట్ల రాణి ఎలిజబెత్‌కు సంతాప కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వీటిలో సంతాపాలతో పాటు.. నిరసనలూ చోటు చేసుకోవటం ఆశ్చర్యకర పరిణామం. ట్విట్టర్​ తదితర సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే 'నాట్‌ మై కింగ్‌' అనే హ్యాష్‌ట్యాగ్‌ విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. ఈ నిరసన గళాలు కేవలం సామాజిక మాధ్యమాలకే పరిమితం కాకుండా.. సంతాప సభలకూ విస్తరించటం గమనార్హం. రాచరికాన్ని వ్యతిరేకిస్తూ.. రాజకుటుంబాన్ని వెక్కిరిస్తూ.. నినాదాలు, పోస్టర్లు, ప్లకార్డులు పట్టుకొని వీధుల్లో నినాదాలు చేస్తున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ వీరిని అరెస్టు చేస్తూ, ఆంక్షలు విధిస్తున్నారు. రెండ్రోజుల కిందట ఆక్స్‌ఫర్డ్‌లో సైమన్‌ హిల్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కారణం రాజుగా ప్రిన్స్‌ ఛార్లెస్‌ను ఎవరు ఎంచుకున్నారని ఆయన ప్రశ్నించటమే!

ఎడింబరోలో 22 ఏళ్ల యువకుడిని కూడా ఇలా ప్రశ్నించినందుకు పోలీసులు లాగిపారేశారు. 'రాజరికం.. సామ్రాజ్యవాదం నశించాలి' అంటూ రాసిన పోస్టర్‌ పట్టుకుని నిలబడ్డందుకు ఎడింబరోలోనే ఓ మహిళను అరెస్టు చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛకు పెద్దపీట వేస్తామనే బ్రిటన్‌లో ఇలా ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపేవారి నోరు నొక్కడంపై విమర్శలు తలెత్తుతున్నాయి. అయితే.. బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌ అంటూ అమెరికా తదితర దేశాల్లో తలెత్తిన ఆందోళనల నేపథ్యంలో ఇటీవలే బ్రిటన్‌ నిరసనలపై తమ చట్టాలను కఠినతరం చేసింది. కొత్త చట్టం ప్రకారం.. ఇతరులపై ప్రభావం చూపుతాయని భావించిన సందర్భాల్లో అలాంటి నిరసనలను అడ్డుకునే అధికారం పోలీసులకు కట్టబెట్టారు. వాటినే ఇప్పుడు పోలీసులు ఉపయోగిస్తున్నారు.

రిపబ్లిక్‌ గ్రూపుల్లాంటివి బ్రిటన్‌లో రాజరికాన్ని రద్దు చేయాలని చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నాయి. ఆధునిక కాలంలో రాజరికానికి కాలం చెల్లిందని అవి వాదిస్తుంటాయి. కోట్ల రూపాయల ప్రజాధనం రాజ కుటుంబం ఖర్చుల రూపంలో వృథా అవుతుందని ఎత్తి చూపుతుంటాయి. తాజాగా ఎలిజబెత్‌ మరణానంతరం ఆ డిమాండ్‌ ఇప్పుడు ఊపందుకుంటోంది. తమ వాదనకు మద్దతుగా ప్రస్తుత ప్రధానమంత్రి లిజ్‌ ట్రస్‌ గతంలో చేసిన వాదననూ వారు తెరపైకి తెచ్చారు. బ్రిటన్‌లోనే కాకుండా.. జమైకా, న్యూజిలాండ్‌, కెనడాలాంటి కామన్వెల్త్‌ దేశాల్లోనూ బ్రిటన్‌ రాజరికపు ఆధిపత్యం కొనసాగింపుపై ప్రశ్నలు మొదలయ్యాయి!

ఇవీ చదవండి: రాణిపై ప్రేమ.. 14 గంటల పాటు రోడ్లపైనే ప్రజలు!

'70 వేల స్టార్టప్​లు, 100 యూనికార్న్​లు.. త్వరలోనే తయారీ కేంద్రంగా భారత్!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.