స్కూల్​పై సైన్యం దాడి.. 13 మంది బలి.. మృతుల్లో ఏడుగురు పిల్లలు

author img

By

Published : Sep 20, 2022, 1:28 PM IST

Myanmar army helicopters target school

మయన్మార్‌లో అధికారంలో ఉన్న సైన్యం దారుణానికి పాల్పడింది. ఓ పాఠశాల, గ్రామంపై సైనిక హెలికాప్టర్లు జరిపిన కాల్పుల్లో ఏడుగురు చిన్నారులు సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. సాగింగ్‌ ప్రాంతంలో శుక్రవారం చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Myanmar army helicopters target school : సైనిక పాలనలో ఉన్న మయన్మార్‌లో దారుణం జరిగింది. నార్త్‌-సెంట్రల్‌ మయన్మార్‌లోని ఓ పాఠశాల, గ్రామంపై సైనిక హెలికాప్టర్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా అందులో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ పాఠశాలలో తిరుగుబాటుదారులు నక్కి దాడులు చేస్తున్నారని సమాచారం అందుకున్నందున తాము ఇలా కాల్పులు జరపాల్సి వచ్చిందని మయన్మార్‌ సైన్యం చెబుతోంది. మధ్య సాగింగ్‌ ప్రాంతంలోని తబయిన్ టౌన్‌షిప్‌ వద్ద శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటన గురించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బౌద్ధమఠాన్ని ఆధారంగా చేసుకొని పీపుల్స్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ గ్రూపుకు చెందిన రెబల్స్ ఆయుధ రవాణా చేస్తున్నారని మయన్మార్‌ సైన్యం ఆరోపించింది. ఇక్కడ తనిఖీలకు వచ్చిన సైనిక హెలికాప్టర్లపై దాడి చేయడం వల్ల సైన్యం ప్రతిదాడి చేసిందని తెలిపింది. తిరుగుబాటుదారులు, ప్రజలను వారు మానవ కవచాలుగా వాడుకొంటున్నారని సైన్యం ఆరోపించింది. ఈ దాడిలో గాయపడ్డ వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నామని వెల్లడించింది.లెట్‌యట్‌కోనే అనే గ్రామంలోని ఓ బౌద్ధమఠంలో ఈ పాఠశాలను నిర్వహిస్తున్నారు.

సైనిక దాడిలో కొందరు పిల్లలు అక్కడికక్కడే మృతిచెందారు. వీరి మృతదేహాలను సైన్యం అక్కడి నుంచి 11 కిలోమీటర్ల దూరంలోని ఓ టౌన్‌షిప్‌నకు తీసుకెళ్లి ఖననం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. కాల్పుల కారణంగా తూట్లు పడిన పాఠశాల భవనం చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. మయన్మార్‌ సైన్యం ఉద్దేశ పూర్వకంగానే పాఠశాలలను లక్ష్యంగా చేసుకుంటోందని నేషనల్‌ యూనిటీ గవర్నమెంట్‌ అనే సంస్థ ఆరోపించింది.

మయన్మార్‌లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ఆంగ్‌సాన్‌ సూచీ ప్రభుత్వాన్ని గత ఏడాది ఫిబ్రవరిలో సైన్యం కూల్చింది. అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అప్పటి నుంచి ప్రజాస్వామ్య అనుకూల వర్గాలు ఆ దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. వారిని అణచి వేయడానికి సైన్యం దాడులకు తెగబడుతోంది. ముఖ్యంగా సాగింగ్‌ ప్రాంతంలో సైన్యం దాడులు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్నిసార్లు గ్రామాలను సైన్యం తగలబెడుతోంది. సైనిక దాడుల వల్ల 5 లక్షల మందికిపైగా ప్రజలు స్థానభ్రంశం చెందాల్సి వచ్చిందని ఈ నెలలో వెలువడ్డ యూనిసెఫ్‌ నివేదిక తెలిపింది

ఇదీ చదవండి: మూడోసారీ 'పిల్ల' ప్రభావం.. వందేళ్లలో ఇదే తొలిసారి

తైవాన్​లో మరోసారి భారీ భూకంపం- కుప్పకూలిన మూడంతస్తుల భవనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.