నిరాశ్రయుల కనీస అవసరాలు తీర్చే బస్సులివి!

author img

By

Published : Oct 10, 2021, 7:02 AM IST

driving for change

లండన్​కు చెందిన సామాజిక సంస్థ.. నిరాశ్రయుల కష్టాలను తీరుస్తోంది. పాత బస్సులను మెరుగుపర్చి కనీస అవసరాలు తీర్చుకునే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. 'డ్రైవింగ్ ఫర్ ఛేంజ్' పేరుతో ప్రాజెక్టు ప్రారంభించి.. రెండు డబుల్ డెక్కర్ బస్సులను ఇలా సిద్ధం చేసింది.

నిరాశ్రయుల కనీస అవసరాలు తీర్చే బస్సులివి

విశ్వనగరం లండన్​లో నిరాశ్రయుల బాధలను అర్థం చేసుకుంది అక్కడికి చెందిన ఓ సామాజిక సంస్థ. నిరాశ్రయుల కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా.. ఇంకా రోడ్లపైన సామాన్యులు నివసించడం చూసి చలించిపోయింది. దీంతో సమస్యకు పరిష్కారంతో ముందుకొచ్చింది. 'డ్రైవింగ్ ఫర్ ఛేంజ్' పేరుతో ప్రాజెక్టు ప్రారంభించి.. రెండు బస్సులను కనీస అవసరాలు తీర్చుకునేందుకు అనువుగా తీర్చిదిద్దింది.

సాధారణ డబుల్ డెక్కర్ బస్సుల్లా కనిపించే ఇందులో.. స్నానం చేసేందుకు వీలుగా షవర్లు, కాఫీ యంత్రాలు ఏర్పాటు చేశారు. హెయిర్ కటింగ్ సదుపాయంతో పాటు.. బ్యాంకు ఖాతా తెరిచేందుకు సహకారం పొందే వీలుంటుంది. ఉచిత డెంటల్ సేవలూ అందుబాటులో ఉంటాయి. 'ఛేంజ్ ప్లీజ్' అనే సంస్థ ఈ ప్రాజెక్టు చేపట్టింది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు సీమాల్ ఎజెల్ ఈ ఆలోచనకు అంకురార్పణ చేశారు.

"ఈ బస్సులు పెద్దగా ఉంటాయి కాబట్టి.. అవసరమైన అన్ని సేవలందించేందుకు అనువుగా ఉంటాయి. ఈ డబుల్ డెక్కర్​లను.. ఎక్కువగా అవసరం ఉన్నవారికి సేవలను నేరుగా అందించేందుకు సులభంగా తీసుకెళ్లవచ్చు. లండన్​లో సాధారణంగా తిరిగే బస్సుల్లాగే ఉంటాయి కాబట్టి.. వీటిని ఉపయోగించుకునే వ్యక్తులు అసౌకర్యానికి గురి కారు."

-సీమాల్ ఎజెల్, ఛేంజ్ ప్లీజ్ ఫౌండర్

ఈ సేవలను ఉపయోగించుకొని అమెరికాకు చెందిన థామస్ నోబుల్ అనే వ్యక్తి.. తన జీవితంలో స్థిరపడ్డాడు. డ్రగ్ ట్రాఫికింగ్​లో ఇరుక్కొని ఏడాది జైల్లో ఉన్న థామస్.. డ్రైవింగ్ ఫర్ ఛేంజ్ సహకారంతో 'బరిస్టా'గా మారాడు. ఇప్పుడు అద్భుతమైన కాఫీలు తయారు చేసి విక్రయిస్తూ తన కాళ్లపై తాను నిలబడుతున్నాడు.

లండన్​లో చలికాలం వచ్చిందంటే నిరాశ్రయుల సంఖ్య పెరుగుతుంది. కరోనా సమయంలో యూకే ప్రభుత్వం అందించిన తాత్కాలిక సాయం 23 శాతం మంది నిరాశ్రయులకు ప్రస్తుతం అందడం లేదని బ్రిటిష్ ఛారిటీ షెల్టర్ సంస్థ పేర్కొంది. మొత్తం 8 వేల మందికి ఎలాంటి సహాయం అందట్లేదని తెలిపింది. వీరంతా రోడ్డున పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.