ETV Bharat / international

చైనా దుర్నీతి: చర్చలు జరుపుతూనే సైన్యం మోహరింపు

author img

By

Published : May 31, 2020, 3:24 PM IST

సరిహద్దు విషయంలో చైనాతో భారత్ సంప్రదింపులు, చర్చలు జరుపుతున్నా.. ఆ దేశ వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు కన్పించడం లేదు. వాస్తవాధీన రేఖ వెంబడి మరిన్ని బలగాలను మోహరిస్తోంది. భారీ సంఖ్యలో వాహనాలు, పోరాట ఆయుధాలు సమకూర్చుతోంది.

china-continues-military-build-along-lac-as-both-sides-holding-talks
చర్చలు జరుగుతున్నా సరిహద్దులో బలగాలు మోహరిస్తున్న చైనా

సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు చైనాతో సైనిక, దౌత్య స్థాయిలో చర్చలు జరుపుతోంది భారత్​. అయినా పొరుగు దేశం మాత్రం దుందుడుకు వైఖరిని ప్రదర్శిస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి భారీగా బలగాలను మోహరిస్తోంది. పెద్ద సంఖ్యలో వాహనాలు, పోరాట ఆయుధాలను సమకూర్చుతోంది.

సైనిక, దౌత్యాధికారులు ఇప్పటి వరకు జరిపిన చర్చల్లో ఎలాంటి పురోగతి సాధించలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. చైనా బలగాలు ఒక్క అంగుళం కూడా వెనక్కి కదల్లేదని, పలు చోట్ల ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నట్లు స్పష్టం చేశాయి.

"తూర్ఫు లద్దాఖ్​ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ సమీపంలో ఉన్న చైనా బలగాల వద్దకు భారీ సంఖ్యలో వాహనాలు చేరుకున్నాయి. భారత భూభాగానికి ఇవి 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. కొన్ని గంటల్లోనే చైనా వీటిని ముందుకు తీసుకురావచ్చు"

-అధికారిక వర్గాలు

చర్చల పేరుతో వృథా చేసే సమయాన్ని వాస్తవాధీన రేఖ వెంబడి సైనిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు చైనా ఉపయోగిస్తోందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. సైనిక, దౌత్య స్థాయిలో ప్రతిరోజు చర్చలు జరుగుతూనే ఉన్నాయని స్పష్టం చేశాయి. త్వరలో మేజర్ జనరల్​ ర్యాంక్​ స్థాయి అధికారులు చర్చలు జరిపి సరిహుద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితును తగ్గించేందుకు కృషి చేస్తారని పేర్కొన్నాయి.

సరిహద్దు విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని భారత్​ ఇప్పటికే స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖ వెంబడి చైనాకు దీటుగా బలగాలను మోహరిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఇదీ వివాదం..

కొద్దిరోజుల కిందట తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌, సిక్కింలో భారత్‌, చైనా సైనికులు రాళ్లు, ఇనపకడ్డీలతో పరస్పరం తీవ్రంగా దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణల్లో ఇరు దేశాలకు చెందిన అనేక మంది జవాన్లు గాయపడ్డారు. అప్పట్నుంచి లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారింది. గాల్వాన్‌ లోయ, దెమ్‌చోక్‌, దౌలత్‌ బేగ్‌ ఓల్డీ వంటి సున్నిత ప్రాంతాలకూ ఉద్రిక్తతలు పాకాయి. రెండు దేశాలు భారీగా బలగాలను మోహరించాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.