ప్రపంచ శ్రేయస్సు కోసం పనిచేసే శక్తిగా క్వాడ్​: మోదీ

author img

By

Published : Sep 25, 2021, 12:31 AM IST

Updated : Sep 25, 2021, 8:30 AM IST

quad summit 2021

ఇతర దేశాలకు వ్యాక్సిన్​ అందించాలని క్వాడ్​ దేశాలు తీసుకున్న చొరవ.. ఇండో పసిఫిక్​ దేశాలకు సాయంగా ఉంటుందని ప్రధాని మోదీ.. క్వాడ్​ సదస్సులో పేర్కొన్నారు. ఇండో పసిఫిక్​ సహా ప్రపంచానికి మేలు చేసే శక్తిగా క్వాడ్ అవతరిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు.. క్వాడ్ దేశాల్లోని 'స్టెమ్' విద్యార్థుల కోసం క్వాడ్​ ఫెలోషిప్​ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ సదస్సులో ప్రకటించారు.

ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి సుస్థిరత ఏర్పాటు సహా ప్రపంచ శ్రేయస్సు కోసం క్వాడ్ ఓ శక్తిగా పనిచేస్తుందని క్వాడ్ కూటమి దేశాధినేతలు స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలో శ్వేతసౌదంలో తొలిసారి నేరుగా జరిగిన క్వాడ్ దేశాధినేతల శిఖరాగ్ర సమావేశంలో భారత్. ఆస్ట్రేలియా, జపాన్ దేశాల ప్రధానులు పాల్గొన్నారు. అంతరిక్షం, 5జీ సాంకేతికత, ఇండోపసిఫిక్ ప్రాంతంలో సవాళ్లు, వాతావరణ మార్పులు అంశాలపై వర్కింగ్ గ్రూపులను ప్రకటించారు.

2004లో సునామీ తర్వాత ఇండో పసిఫిక్ ప్రాంతంలో ప్రాంతీయ సహకారం కోసం తొలిసారిగా క్వాడ్ దేశాలు కలిసి పనిచేశాయన్న ప్రధాని మోదీ యావత్ ప్రపంచాన్ని కొవిడ్ మహమ్మారి వేధిస్తున్న ప్రస్తుత తరుణంలో మానవత్వం కోసం మరోసారి కలిసికట్టుగా పోరు సాగించాల్సిన అవసరముందన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతం సహా ప్రపంచవ్యాప్తంగా శాంతి సుస్థిరతల ఏర్పాటుకు క్వాడ్ దేశాల భాగస్వామ్యం ఉపకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

" క్వాడ్ టీకాల కార్యక్రమం ఇండో పసిఫిక్ ప్రాంతంలోని దేశాలకు చాలా ఉపకరిస్తుంది. ప్రజాస్వామ్య విలువల ఆధారంగా క్వాడ్ కూటమి సానుకూల ఆలోచనలు, ధోరణితో ముందుకు వెళ్తోంది. సరఫరా గొలుసు, భద్రత, వాతావరణ మార్పులపై చర్యలు, కొవిడ్‌పై పోరు సాంకేతిక సహకారం వంటి అంశాల గురించి సమావేశంలో చర్చించడం సంతోషంగా ఉంది. మన క్వాడ్ కూటమి ఒకరకంగా ప్రపంచ శ్రేయస్సు కోసం పనిచేసే శక్తి పాత్ర పోషిస్తోంది. క్వాడ్ దేశాల సహకారంతో ఇండో పసిఫిక్ సహా ప్రపంచవ్యాప్తంగా శాంతి సౌభాగ్యాల స్థాపన సాధ్యమవుతుందనే నమ్మకం నాకుంది. "

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

quad summit 2021
క్వాడ్​ కూటమి నేతలతో మోదీ

విద్యార్థుల కోసం జో బైడెన్ కీలక ప్రకటన..

కొవిడ్ నుంచి వాతావరణ మార్పులు వరకూ అనేక సవాళ్లను కూటమి దేశాలు కలసికట్టుగా ఎదుర్కొంటున్నాయన్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సవాళ్లను ఉమ్మడిగా ఎలా పరిష్కరించుకోవాలో కూటమి దేశాలకు అవగాహన ఉందన్నారు. క్వాడ్​ దేశాల్లోని విద్యార్థులు.. అమెరికాలో 'స్టెమ్'​ కార్యక్రమాల్లో అడ్వాన్స్​డ్​ డిగ్రీ విద్యను అభ్యసించేందుకుగాను క్వాడ్ ఫెలోషిప్​ను ప్రకటించారు. ప్రతి దేశం నుంచి ప్రతిఏటా 25 మంది, మొత్తం 100 మంది విద్యార్థులు ఈ డిగ్రీలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంపై ఒకే తరహా దృక్కోణాలు, భవిష్యత్తుపై ఒకే విధమైన ఆలోచనలు కలిగిన భాగస్వామ్య దేశాల కలయిక ఈ సదస్సు అని బైడెన్ అభివర్ణించారు.

"ఆరునెలల క్రితం మనం సమావేశమైనప్పుడు స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ నిర్మాణం కోసం పరస్పరం కొన్ని ఒప్పందాలు, కట్టుబాట్లు నిర్దేశించుకున్నాం. ఆ దిశగా అద్భుతమైన పురోగతి సాధిస్తున్నామని చెప్పడానికి నేను గర్వపడుతున్నా. ప్రపంచ అవసరాలకు అనుగుణంగా కొవిడ్ టీకాల సరఫరాను పెంచడానికి భారత్‌లో ఒక బిలియన్ టీకాల ఉత్పత్తి ప్రక్రియ కొనసాగుతోంది. అమెరికాలోని స్టెమ్‌ ప్రోగామ్స్‌లో అడ్వాన్స్‌డ్డి గ్రీలను అభ్యసించాలనుకునే క్వాడ్ దేశాల విద్యార్థుల కోసం కొత్త క్వాడ్ ఫెలోషిప్‌ను ప్రారంభిస్తున్నాం. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా పరస్పర సహకారంతో సవాళ్లను ఎలా ఎదుర్కొవాలో మనకు తెలుసు. "

-జో బైడెన్​, అమెరికా అధ్యక్షుడు

ప్రపంచ అవసరాల కోసం భారత్​లో 100 కోట్ల కొవిడ్ టీకా డోసులు ఉత్పత్తి చేసేందుకు క్వాడ్ దేశాలు కృషి చేస్తున్నాయని బైడెన్ తెలిపారు.

బైడెన్​కు సుగా కృతజ్ఞతలు..

2011 ఫుకుషిమా అణు విస్ఫోటనం కారణంగా జపాన్​ ఆహార పదార్థాల దిగుమతిపై విధించిన నిషేధాన్ని అమెరికా ఎత్తివేయడంపై జపాన్ ప్రధాని యొషిహిదే సుగా హర్షం వ్యక్తం చేశారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​కు కృతజ్ఞతలు తెలిపారు. నాలుగు దేశాల మధ్య ఉన్న దృఢమైన బంధానికి క్వాడ్​ సదస్సు ప్రతీకగా నిలుస్తుందని సుగా పేర్కొన్నారు.

"ప్రాథమిక హక్కులను గౌరవించే నాలుగు దేశాలు తీసుకున్న అత్యంత ప్రధానమైన చొరవ.. ఈ క్వాడ్ కూటమి. ఈ దేశాలన్నీ స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని ఆకాంక్షిస్తున్నాయి. ప్రాంతీయ సవాళ్లైనా.. కరోనా విషయంలోనైనా.. ఇప్పటివరకు క్వాడ్ దేశాలు అనేక విషయాల్లో పూర్తి సహకారంతో పని చేశాయి."

-యొషిహిదే సుగా, జపాన్ ప్రధాని.

అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి నెలకొనాలని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మోరిసన్​ క్వాడ్​ సదస్సులో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో సార్వభౌమ హక్కలకు భంగం వాటిల్లకూడదని చెప్పారు.

"ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఎన్నో అపూర్వ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో ఎన్నో సవాళ్లు కూడా ఉన్నాయి. ఈ సవాళ్లు పరిష్కృతమవ్వాలి.

-స్కాట్​ మోరిసన్​, ఆస్ట్రేలియా​ ప్రధాని.

క్వాడ్​ సదస్సుకు ముందు.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో ప్రధాని మోదీ మొట్ట మొదటిసారి ప్రత్యక్షంగా సమావేశం అయ్యారు. కొవిడ్-19పై పోరాటం సహా విస్తృత ప్రాధాన్యతా అంశాలపై శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీస్​లో సుమారు గంటపాటు చర్చించారు. అంతకుముందు.. ఆస్ట్రేలియా, జపాన్​ ప్రధానులతోనూ మోదీ విడివిడిగా సమావేశమయ్యారు.

ఇదీ చూడండి: Modi Gift: కమలా హారిస్​కు మోదీ అపూర్వ కానుక

Last Updated :Sep 25, 2021, 8:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.