కాసేపట్లో మోదీ-బైడెన్ భేటీ.. 'అఫ్గాన్​'పై కీలక చర్చ!

author img

By

Published : Sep 24, 2021, 6:11 PM IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్-భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య తొలి ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. కరోనా సంక్షోభం, వాతావరణ మార్పులు, వాణిజ్య సహకారం, అఫ్గాన్ పరిస్థితులు ఇరుదేశాధినేల మధ్య చర్చకు రానున్నట్లు శ్వేతసౌధ వర్గాలు ప్రకటించాయి.

భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ మధ్య తొలి భేటీ శుక్రవారం రాత్రి జరగనుంది. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు చేపట్టిన తరువాత మోదీతో భేటీ కానుడటం ఇదే తొలిసారి. అంతకుముందు ఇరువురు నేతలూ పలుసార్లు ఫోన్‌ కాల్​లో మాట్లాడుకున్నారు. 'క్వాడ్‌' సహా కొన్ని సదస్సులకు వర్చువల్​గా హాజరయ్యారు.

సమావేశం అజెండా..

వాణిజ్యం, పెట్టుబడి సంబంధాల బలోపేతం, రక్షణ సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై ఇరుదేశాల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు శ్వేతసౌధ అధికారులు ప్రకటించారు. తీవ్రవాదం, సీమాంతర ఉగ్రవాదం, అంతర్జాతీయ ఉగ్ర నెట్‌వర్క్‌ల ధ్వంసంపై ప్రధానంగా చర్చలు ఉంటాయని భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా పేర్కొన్నారు. ఈ భేటీకి మోదీతోపాటు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబల్, అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధుతో పాటు సీనియర్ అధికారులు హాజరవనున్నారు.

క్వాడ్ భేటీ..

మరోవైపు... ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికాల కూటమి 'క్వాడ్' దేశాధినేతల మధ్య శ్వేతసౌధంలో శుక్రవారం చారిత్రక సమావేశం జరగనుంది. ఈ భేటీలో అంతరిక్ష రంగంలో మార్పులు, సప్లయ్ చైన్​ విధివిధానాలతో పాటు.. 5జీ టెక్నాలజీ విస్తరణపై కీలక చర్చలు జరగనున్నట్లు శ్వేతసౌధ వర్గాలు ప్రకటించాయి. టీకాల సరఫరా, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాల రంగంలోనూ కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.

'ఇండో-పసిఫిక్ ప్రాంతం ఎదుర్కొంటున్న సవాళ్లు, క్లిష్టమైన సమస్యలపై క్వాడ్ దేశాధినేతలు చర్చలు జరుపుతారని, పరస్పర ఆందోళనలను గుర్తిస్తారని' సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అలాగే వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారిపై పోరు వంటి అంశాలూ చర్చకు రానున్నట్లు వివరించారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగా వైట్​హౌస్‌లో తొలిసారి జరగనున్న 'క్వాడ్ శిఖరాగ్ర సదస్సు'లో పాల్గొంటున్నారు.

ప్రాధాన్య అంశాలు..

  • స్టెమ్(STEM) సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమెటిక్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రకటించనున్నారు. దీని కింద భారత్, జపాన్, ఆస్ట్రేలియాకు చెందిన 100 మంది విద్యార్థులకు అమెరికాలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత చదువులు అందించనున్నారు.
  • సైబర్ నేరాలకు వ్యతిరేకంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు.
  • గ్రీన్ షిప్పింగ్ నెట్‌వర్క్‌లో భాగంగా డీకార్బొనైజింగ్​లో ఉత్తమ పద్ధతుల అన్వేషణపై చర్చలు.
  • సెమీకండక్టర్‌లు, వాటి కీలక భాగాల సరఫరా గొలుసుపై చర్చించనుంది క్వాడ్.

క్వాడ్​తో కమల చర్చలు..

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ క్వాడ్ దేశాధినేలతో సమావేశం నిర్వహించనున్నట్లు వైట్​హౌస్​ ప్రకటించింది. శ్వేతసౌధంలోని ఈస్ట్ రూమ్‌లో జరగనున్న తొలి సమావేశానికి కమలా హారిస్ ఆతిథ్యం ఇవ్వనున్నారు. 'కమలా హారిస్ మూడు క్వాడ్ దేశాల ప్రధానులతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. దీనిలో కరోనా మహమ్మారిపై పోరు, వాతావరణ మార్పులు, వాణిజ్య సహకారం, అఫ్గాన్ సమస్య వంటి అంశాలు చర్చకు రానున్నాయి.' అని శ్వేతసౌధ అధికారి ఒకరు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.