'అఫ్గాన్ నుంచి ఏం కోరుకుంటున్నామో అప్పుడే చెప్పాం'

author img

By

Published : Oct 13, 2021, 11:09 AM IST

india at unsc

అఫ్గానిస్థాన్​లో విస్తృతమైన సమ్మిళిత విధానం ఉండాలని ఐరాస భద్రతా మండలిలో భారత్ (India at UNSC) పేర్కొంది. ఆ దేశంలో అధికార మార్పిడి చర్చల ద్వారా జరగలేదని గుర్తు చేసింది. అఫ్గాన్ నుంచి అంతర్జాతీయ సమాజం ఏం కోరుకుంటోందో ఇప్పటికే స్పష్టంగా చెప్పినట్లు పేర్కొంది. మరోవైపు, సమష్టి కృషితోనే సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుందని ఐరాసలో భారత ఫస్ట్ సెక్రెటరీ స్నేహా దుబే అన్నారు. భారత్ ఈ దిశగా పనిచేస్తూనే ఉంటుందని తెలిపారు. పారిస్ ఒప్పంద లక్ష్యాలను సాధించిన ఏకైక జీ20 దేశం భారతేనని గుర్తు చేశారు.

అఫ్గానిస్థాన్​లో అధికార మార్పిడి చర్చల ద్వారానో, సమ్మిళితంగానో జరగలేదని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో (India at United Nations Security Council) భారత్ వ్యాఖ్యానించింది. విస్తృతమైన సమ్మిళిత విధానం అఫ్గాన్​లో ఉండాలని భారత్​ (India Afghanistan relations) కోరుకుంటోందని తెలిపింది. అఫ్గాన్​లోని అన్ని వర్గాల ప్రజలకు ఇందులో ప్రాతినిథ్యం లభించాలని పేర్కొంది. (India at UNSC)

భద్రతా మండలిలో 'శాంతి స్థాపన' అంశంపై జరిగిన అత్యున్నత స్థాయి బహిరంగ చర్చలో (UNSC discussion on Afghanistan) భారత్​ తరపున మాట్లాడిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్.. అఫ్గాన్ నుంచి అంతర్జాతీయ సమాజం ఏం కోరుకుంటోందన్న విషయం ఆగస్టులో రూపొందించిన తీర్మానంలో స్పష్టంగా ఉందని గుర్తు చేశారు. భద్రతా మండలికి భారత్ అధ్యక్షత (India UNSC Presidency) వహించిన నెలలోనే దీన్ని తీర్మానించినట్లు తెలిపారు. వీటిని గౌరవించి, కట్టుబడి ఉండాలని అఫ్గాన్ ప్రభుత్వానికి సూచించారు.

సంఘర్షణలు చెలరేగిన దేశంలో శాంతిస్థాపన కోసం అనేక సవాళ్లు ఎదురవుతాయని మురళీధరన్ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాయని గుర్తు చేశారు. అయితే, సమీకృత విధానాల ద్వారా శాంతి స్థాపన చేసిన దేశాలు సైతం ఉన్నాయని చెప్పారు.

'ఉగ్రవాదం చట్టబద్ధంగా చూడొద్దు'

ఆఫ్రికాలో పెరిగిపోతున్న ఉగ్రవాదంపైనా (Terrorism in Africa) ఆందోళన వ్యక్తం చేశారు మురళీధరన్. ఉగ్రవాదులకు పొరుగు దేశాల నుంచి ప్రోత్సాహం లభిస్తోందని అన్నారు. ఉగ్ర కార్యకలాపాలకు వత్తాసు పలికి సమాజాలను విభజించాలని చూస్తున్నారని పలు దేశాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఏ కారణాలతోనూ, ఏ పరిస్థితుల్లోనైనా ఉగ్రవాదాన్ని చట్టబద్ధ కార్యకలాపాలుగా చూడకూడదని స్పష్టం చేశారు.

సమష్టి కృషితోనే సుస్థిరాభివృద్ధి..

సమష్టి కృషితోనే సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుందని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో (India UN news) భారతదేశ ఫస్ట్ సెక్రెటరీ స్నేహా దుబే పేర్కొన్నారు. భారత్ ఈ దిశగా పనిచేస్తూనే ఉంటుందని చెప్పారు. ప్రపంచ హితం కోసం చేసే ప్రయత్నాలకు మానవతా విధానాలుతో తోడైతే వేగవంతమైన ఫలితాలు వస్తాయని అన్నారు. సుస్థిరాభివృద్ధి, వాతావరణ సమస్యల అంశాలపై ఐరాస అసెంబ్లీలో జరిగిన చర్చలో ఈ మేరకు మాట్లాడారు. పారిస్ ఒప్పంద లక్ష్యాలను సాధించిన ఏకైక జీ20 దేశం భారతేనని గుర్తు చేశారు.

"పర్యావరణ పరిరక్షణ కోసం అభివృద్ధి చెందిన దేశాలు చేయాల్సింది చాలా ఉంది. 'గ్లోబల్ నెట్ జీరో' (కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి చేర్చడం) లక్ష్యాన్ని సాధారణ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుకున్నాం. 2050 నాటికి కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గించాలంటే.. అభివృద్ధి చెందిన దేశాలు 'నెట్ మైనస్' విధానాన్ని అవలంబించాలి. పర్యావరణ పరిరక్షణలో భారత్ చాలా ముందుంది. గత పదేళ్లలో అటవీ విస్తీర్ణం పెరిగిన టాప్ 3 దేశాల్లో భారత్ ఒకటి. 30 లక్షల హెక్టార్ల అటవీ విస్తీర్ణం పెరిగింది. సింహాలు, పులులు, చిరుతలు, నదీ డాల్ఫిన్ల సంఖ్య ఏడేళ్లలో గణనీయంగా పెరిగింది."

-స్నేహా దుబే, ఐరాసలో భారత ఫస్ట్ సెక్రెటరీ

భూసార క్షీణత ప్రమాద ఘంటికలు మోగిస్తోందని అన్నారు దుబే. భూసార క్షీణతను తగ్గించడమే కాకుండా.. పరిరక్షణ కోసం కూడా భారత్ చర్యలు తీసుకుంటోందని వివరించారు.

ఇదీ చదవండి: సౌర వ్యవస్థ అవతలి నుంచి రేడియో సిగ్నల్స్.. ఏలియన్స్​వేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.