జనసైనికులు వెంటరాగా.. కొండగట్టుకు జనసేనాని పవన్ కల్యాణ్
Published on: Jan 24, 2023, 11:43 AM IST |
Updated on: Jan 24, 2023, 11:54 AM IST
Updated on: Jan 24, 2023, 11:54 AM IST

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లా పర్యటన ప్రారంభమైంది. భారీ జనసైన్యం వెంట వెళ్తుండగా పవన్ కొండకట్టుకు బయల్దేరారు. కొండగట్టు, ధర్మపురి ఆలయాలను సందర్శించనున్న ఆయన... రాజకీయ క్షేత్ర పర్యటన కోసం తయారు చేసిన 'వారాహి' వాహనానికి అంజన్న చెంతన పూజలు చేసి, ప్రారంభించనున్నారు. పర్యటనలో భాగంగా రాష్ట్ర జనసేన నేతలతో భేటీ కానున్న పవన్.... పార్టీ అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు.
చాలాకాలం తర్వాత జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్‌కల్యాణ్ రాష్ట్రంలో పర్యటిస్తుండటం రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన 'వారాహి' రాజకీయ ప్రచార రథాన్ని జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో ప్రారంభించనున్నారు. కొండగట్టు అంజన్నతో ప్రత్యేక అనుబంధం ఉన్న పవన్.. గతంలో పలుమార్లు ఇక్కడికి వచ్చారు.
ఏపీ రాజకీయాలపై ప్రధాన దృష్టి సారించిన ఆయన.. క్షేత్రస్థాయిలో పర్యటన కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన వారాహి వాహనాన్ని ప్రత్యేక పూజలతో ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నుంచి బయలు దేరిన జనసేనాని.. కొండగట్టు అంజన్న సన్నిధికి చేరుకున్నారు. అనంతరం అక్కడి ఆంజనేయస్వామి స్వామి ఆలయాన్ని దర్శించి, ప్రచార రథం వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. పవన్ రాక సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు... ప్రతి మంగళ, శనివారాల్లో కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. పవన్ కల్యాణ్ రాక సందర్భంగా కొండపైకి చేరేందుకు పోలీసుల ఆంక్షల నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు. కాగా... రాష్ట్రంలో చాలాకాలం తర్వాత పవన్‌కల్యాణ్ పర్యటన దృష్ట్యా జనసేన శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు..
1/ 11
Pawan kalyan kondagattu updates

Loading...