ప్రపంచాన్నే ఆకర్షించే అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలి: కేసీఆర్
Published: Feb 15, 2023, 4:58 PM

CM KCR Kondagattu Tour: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న క్షేత్ర అభివృద్ధికి అదనంగా మరో రూ.500కోట్లు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కొండగట్టు పర్యటనలో భాగంగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధిపై అధికారులతో సీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు ప్రకటించామని.. మరో రూ.500కోట్లు (మొత్తం రూ.600కోట్లు) కూడా కేటాయించనున్నట్లు వెల్లడించారు. దేశంలోనే ప్రముఖ ఆంజనేయ క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలని అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. దేశంలోనే అతిపెద్ద హనుమాన్ క్షేత్రం అంటే కొండగట్టే అనేలా మహిమాన్విత ఆంజనేయ ఆలయంగా తీర్చిదిద్దాలని సూచించారు. భక్తులకు అన్ని వసతులు, సకల హంగులతో ప్రపంచాన్నే ఆకర్షించే అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలని నిర్దేశించారు. పెద్ద వాల్, పుష్కరిణి, అన్నదాన సత్రం, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. తొలుత ప్రకటించిన 100 కోట్లకు అదనంగా మరో 500 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తామన్న సీఎం …850 ఎకరాల్లో ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టాలని సూచించారు.
ఉదయం కొండగట్టు క్షేత్రానికి చేరుకున్న సీఎం.. అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విహంగ వీక్షణం ద్వారా ఆలయ పరిసరాలను ఆయన పరిశీలించారు. ఆ తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించి అంజన్న క్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వం తరఫున చేపట్టాల్సిన అభివృద్ధి చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఆగమశాస్త్రం ప్రకారం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.
