ఘనంగా నడ్డా చిన్నకుమారుడి వివాహం.. హాజరైన ప్రముఖులు.. 28న హిమాచల్‌లో రిసెప్షన్..
Updated on: Jan 26, 2023, 8:09 AM IST

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చిన్న కుమారుడు హరీశ్ నడ్డా వివాహ వేడుక ఘనంగా జరిగింది. బుధవారం సాయంత్రం రాజస్థాన్ జైపూర్‌లోని రాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్లో నడ్డా కుమారుడి పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బంధుమిత్రుల సమక్షంలో వధువు రిద్ధి శర్మ మెడలో మూడు ముళ్లు వేశారు నడ్డా కుమారుడు హరీశ్. ఈ వేడుకలకు భాజపా జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఓం ప్రకాశ్ మాథుర్, రాజేంద్ర రాథోడ్, ఘనశ్యామ్ తివారీతో పాటు పలువురు భాజపా నాయకులు హాజరయ్యారు. అంతకుముందు బుధవారం మధ్యాహ్నం జేపీ నడ్డా.. తన కుటుంబంతో కలిసి మోతీ దుంగ్రీ గణేష్ ఆలయానికి వెళ్లారు. మోతీ డుంగ్రీ గణేష్ ఆలయంలో పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు. కాగా, హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పుర్‌లో జనవరి 28న నడ్డా.. రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. పలువురు పార్టీ అగ్ర నేతలు.. ఆ రిసెప్షన్‌కు హాజరు కానున్నారని తెలిసింది.
