చిరు- విజయ్​-బాలయ్య సినిమాలు.. ఈ ఐదు కామన్ పాయింట్లు తెలుసా?

author img

By

Published : Dec 3, 2022, 6:06 PM IST

Varisu veerasimha reddy  valteru veerayya common points

మెగాస్టార్​ చిరంజీవి- దళపతి విజయ్​-నందమూరి నటసింహం బాలయ్య నటించిన కొత్త సినిమాలకు సంబంధించిన ఐదు ఆసక్తికర విషయాలే ఈ కథనం. ఆ సంగతులు..

తెలుగు సినిమాలకి సంక్రాంతి అతి పెద్ద సీజన్‌. సంక్రాంతిని 'సినిమా పండగ'లా భావిస్తుంటాయి పరిశ్రమ వర్గాలు. అందుకే పండగ కోసం తెలుగు సినిమాలు పోటాపోటీగా సిద్ధమవుతుంటాయి. థియేటర్‌లు కొత్త చిత్రాలతో కళకళలాడుతుంటాయి. అందులో అగ్ర తారల చిత్రాలే ఎక్కువ. అలా ఈ సారి ఎప్పట్లాగే 2023 సంక్రాంతి కోసం దర్శకనిర్మాతలు ముందు నుంచే కట్చీఫ్‌ వేశారు. వాటిలో అగ్ర కథానాయకులు చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విజయ్‌ల చిత్రాలు ఉండగా, తాజాగా రెండు చిత్రాలకు బెర్తు అదేనండీ.. డేట్‌ ఫిక్స్‌ అయింది. మరొక చిత్రం ఇంకా వెయింటింగ్‌ లిస్ట్‌లోనే ఉంది. మరో విశేషమేమిటంటే ఆ చిత్రాల్లో కొన్ని కామన్ పాయింట్స్ కూడా ఉన్నాయి. వాటి గురించే ఈ కథనం..

ఫస్ట్ కట్చీఫ్​.. తమిళ స్టార్​ హీరో విజయ్‌ నటిస్తున్న కొత్త చిత్రం 'వారిసు'. రష్మిక కథానాయిక. వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో 'వారసుడు' పేరుతో విడుదల చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజ్‌ ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. తమన్ సంగీత దర్శకుడు.

బాలయ్య కూడా.. సంక్రాంతి పండగ కలిసొచ్చిన తెలుగు హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఆయన కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని తెరకెక్కిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'వీరసింహారెడ్డి' . శ్రుతిహాసన్‌కథానాయిక. వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు కూడా దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. 'వీరసింహారెడ్డి'ని జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు శనివారం చిత్ర బృందం ప్రకటించింది. దీంతో బాక్సాఫీస్‌ ఒకే రోజున అటు విజయ్‌, ఇటు బాలకృష్ణ ఢీకొనబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కూడా తమన్‌ స్వరకర్త.

'వాల్తేరు వీరయ్య'.. వెయింటింగ్‌..!.. 'వారసుడు', 'వీర సింహారెడ్డి' చిత్రాల తేదీల ప్రకటనలు రావడంతో ఇప్పుడు అందరూ చిరంజీవి ఎప్పుడు వస్తారా? అని ఎదురు చూస్తున్నారు. కె.ఎస్‌.రవీంద్ర(బాబీ)దర్శకత్వంలో చిరు నటిస్తున్న మాస్‌ యాక్షన్‌, ఎంటర్‌టైనర్‌ 'వాల్తేరు వీరయ్య'. శ్రుతిహాసన్‌ కథానాయిక. రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కూడా దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. మరొక విషయం ఏంటంటే, అటు బాలకృష్ణ చిత్రాన్ని, ఇటు చిరు చిత్రాన్ని నిర్మిస్తున్నది మైత్రీ మూవీ మేకర్స్‌. ఇప్పటికే బాలయ్య సినిమా ప్రకటన వచ్చేసింది కాబట్టి, ఇక చిరు చిత్రంపైనే నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రాల్లో కొన్ని కామన్‌ పాయింట్స్‌..

  • మూడు చిత్రాలు తెలుగు వర్ణమాలలో 'వ' అక్షరంతో మొదలవుతాయి. 'వారసుడు', 'వీర సింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య'. మొదటి రెండు చిత్రాలు ఇంగ్లీష్ లెటర్‌ 'V' కాగా, మూడో చిత్రం 'W'తో మొదలవుతుంది.
  • 'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య' ఈ రెండు భారీ చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్‌నిర్మిస్తుండటం విశేషం.
  • అటు బాలయ్య చిత్రంలోనూ, ఇటు చిరంజీవి చిత్రంలోనూ శ్రుతిహాసన్‌ కథానాయిక కావడంతో మరో ఆసక్తికర అంశం.
  • విజయ్‌, బాలకృష్ణ చిత్రాలకు తమన్‌ సంగీత దర్శకుడు.
  • 'వారసుడు', 'వీరసింహారెడ్డి' రెండూ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

ఇదీ చూడండి: 'ఆమె ఒక మహా'నటి".. సమంతపై నాగచైతన్య మేనమామ కీలక కామెంట్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.