'అతిలోక సుందరి శ్రీదేవిలా పేరు తెచ్చుకోవాలి'

author img

By

Published : Sep 19, 2022, 7:00 AM IST

kriti shetty

'ఉప్పెన' చిత్రంతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది కృతి శెట్టి. తాజాగా ఆమె సుధీర్​బాబుతో నటించిన చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో పలు విషయాలపై ముచ్చటించారు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.

"ఒకప్పుడు నేను డాక్టర్‌ కావాలనుకున్నా. కానీ, ఓ యాడ్‌ ఫిల్మ్‌ షూట్‌ కోసం హైదరాబాద్‌ రావడం.. తొలి సినిమా 'ఉప్పెన'లో అవకాశం దొరకడం నా కెరీర్‌ను మలుపు తిప్పింది. కెరీర్‌ ఆరంభంలోనే వరుసగా మంచి పాత్రలు దక్కుతుండటం అదృష్టంగా భావిస్తున్నా. మరింత కష్టపడి.. మరిన్ని మంచి పాత్రలు, సినిమాలు చేయాలని కోరుకుంటున్నా" అంది నటి కృతి శెట్టి. ఈ ఏడాది ఇప్పటికే 'బంగార్రాజు’, 'ది వారియర్‌', 'మాచర్ల నియోజకవర్గం' చిత్రాలతో సందడి చేసిన కృతి.. ఇప్పుడు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. సుధీర్‌బాబు హీరోగా నటించిన చిత్రమిది. మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది కృతిశెట్టి.

"ఈ విజయం నాకు చాలా ప్రత్యేకం. ఈ సినిమాలో నేను నా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉన్న పాత్ర చేశా. అందుకే ప్రేక్షకులు చాలా బాగా కనెక్ట్‌ అవుతున్నారు. చాలా మంది ఫోన్‌ చేసి 'నన్ను నేను స్క్రీన్‌పై చూసుకున్నట్లుంది' అని చెబుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఓ నటిగా ఇంతకంటే నాకు కావాల్సింది ఏముంది. సినిమా చూసి మా అమ్మ చాలా ఎమోషనల్‌ అయ్యింది. నాన్నకి కూడా చాలా నచ్చింది. నేనీ చిత్రం చేయడం వారికి చాలా గర్వంగా అనిపించింది. ఇంత మంచి పాత్రని నాకిచ్చినందుకు దర్శకుడు ఇంద్రగంటికి కృతజ్ఞతలు".

నా జీవితంలో జరిగిందనుకుంటా!
"నేను వైవిధ్యభరితమైన పాత్రలు పోషించగలిగినప్పుడే ప్రేక్షకులు నటిగా నాలోని ప్రతిభను గుర్తించగలుగుతారు. అప్పుడే నన్ను నమ్మి.. నా పాత్రలతో ప్రేమలో పడతారని విశ్వసిస్తా. నేనిప్పటి వరకు చేసిన సినిమాలన్నీ ఇలా వేటికవే విభిన్నంగా ఉన్నవే. కెరీర్‌ ఆరంభంలోనే ఇలా భిన్న కోణాలున్న పాత్రలు పోషించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. నేను ఏ సినిమా చేసినా.. అందులోని నా పాత్ర గురించి ముందే ఓ నోట్స్‌ సిద్ధం చేసి పెట్టుకుంటాను. దాని వల్ల ఆ పాత్రని అభినయించడం నాకు చాలా సులువుగా అనిపిస్తుంది. అలాగే సెట్‌లో ఓ సీన్‌ చేస్తున్నప్పుడు నిజంగానే అది నా జీవితంలో జరుగుతోందనుకొని చేస్తాను. ఇలా చేయడం వల్ల చాలా సహజమైన హవభావాలు పలుకుతాయని నమ్ముతాను".

సినిమాల కోసం సైకాలజీ చదువుతున్నా
"ఓవైపు కమర్షియల్‌ నాయికగా అలరిస్తూనే.. మరోవైపు నటనా ప్రాధాన్యమున్న పాత్రలతోనూ సత్తా చాటాలనుంది. ఈ విషయంలో నాకు నటి శ్రీదేవి స్ఫూర్తి. ఆమె కమర్షియల్‌ హీరోయిన్‌ పాత్రలకు ఎంత బాగా సెట్‌ అయ్యేవారో.. బలమైన నటనా ప్రాధాన్యమున్న పాత్రల్లోనూ అంతే చక్కగా ఒదిగిపోయేవారు. ఏ పాత్ర ఇచ్చినా 'తగ్గేదే లే' అన్నట్లు చేసేవారు. నాకూ ఆమెలా పేరు తెచ్చుకోవాలనుంది. సాధ్యమైనంత వరకు నేను నెగిటివిటీకి చాలా దూరంగా ఉంటాను. సద్విమర్శల్ని మనస్ఫూర్తిగా తీసుకుంటాను. ప్రస్తుతం నేను సైకాలజీ చదువుతున్నా. సినిమాలో పాత్రల్ని ఎలా అర్థం చేసుకోవాలన్నది తెలుస్తుందని.. నటనలో నాకు హెల్ప్‌ అవుతుందని ఈ కోర్స్‌ చేస్తున్నా (నవ్వుతూ)".

"నేను ప్రస్తుతం నాగచైతన్యతో వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. అలాగే సూర్యతో ఓ చిత్రం చేస్తున్నా. మరికొన్ని ప్రాజెక్ట్‌లు లైనప్‌లో ఉన్నాయి. వాటి వివరాలు త్వరలో తెలుస్తాయి".

ఇవీ చదవండి: 'నా పిల్లల కన్నా మోదీనే ఇష్టం'.. స్టార్ నటుడి తల్లి పోస్ట్.. కంగన రియాక్షన్ ఇదే!

'కశ్మీర్​లో 3 దశాబ్దాల తర్వాత సినిమా హాల్స్.. ఇకపై జిల్లాకో మాల్ పక్కా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.