'ఆర్ఆర్ఆర్​'కు నిరాశ.. భారత్ తరఫున 'ఆస్కార్'కు ఎంపికైన చిత్రం ఇదే

author img

By

Published : Sep 20, 2022, 6:09 PM IST

Updated : Sep 20, 2022, 9:06 PM IST

RRR oscar

18:07 September 20

'ఆర్ఆర్ఆర్​'కు నిరాశ.. భారత్ తరఫున 'ఆస్కార్'కు ఎంపికైన చిత్రం ఇదే

తెలుగుసినిమా సత్తాను ప్రపంచానికి తెలియజేసిన సినిమాల్లో 'ఆర్ఆర్ఆర్' ఒకటి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్​గా తెరకెక్కిన ఈ భారీ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకుంది. మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా ఆస్కార్ రేసులో ఉందని జోరుగా ప్రచారం సాగింది. ఉత్తమ నటుడు కేటగిరిలో రామరాజు పాత్రకు చరణ్, కొమరం భీమ్ పాత్రకు తారక్​ను నామినేట్ చేసే అవకాశాలు ఉన్నట్లు అమెరికా మూవీ పబ్లిషర్ వెరైటీ చెప్పుకొచ్చింది. దీంతో కచ్చితంగా ఈ సినిమా ఆస్కార్​ రేసులో నిలుస్తుందని ఆశించారు. అయితే వారందరి ఆశలు నీరుగారిపోయాయి. ఆస్కార్​ విషయంలో ఆర్​ఆర్​ఆర్​కు నిరాశ ఎదురైంది.

తాజాగా ప్రకటించిన భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా గుజరాతీ సినిమా 'ఛెల్లో షో' ఎంపికైంది. ఈ మేరకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 95వ ఆస్కార్ అవార్డుల పోటీలకు ఛెల్లో షోను ఎంపిక చేసినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రెటరీ జనరల్ సుప్రాన్ సేన్ వెల్లడించారు. ఇంగ్లిష్​లో 'లాస్ట్ ఫిల్మ్ షో'గా పిలుస్తున్న ఈ చిత్రానికి పాన్ నలిన్ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది అక్టోబర్ 14వ తేదీన దేశవ్యాప్తంగా విడుదల కానుంది. రాయ్ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్​పై సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మించారు. జుగాడ్ మోషన్ పిక్చర్స్, మాన్​సూన్ ఫిల్మ్స్, ఛెల్లో షో ఎల్ఎల్​పీ, మార్క్ దువాలే సైతం నిర్మాణంలో భాగమయ్యారు.

ఇదీ కథ.. 'బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌' కేటగిరీలో ఆస్కార్‌కు ఎంపికైన ఈ సినిమా దర్శకుడు నలిన్‌ బాల్య జ్ఞాపకాల ఆధారంగా తెరకెక్కింది. చిన్న తనంలో ఆయన సినిమాలకు ఎలా ఆకర్షితులయ్యారు? వెండితెర, సినిమా పై ఎంత మమకారం పెంచుకున్నారు? తదితర హృదయాలను హత్తుకునే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. గుజరాత్‌ రాష్ట్రంలోని గ్రామీణ వాతావరణం అప్పట్లో ఎలా ఉండేదో ఈ సినిమా ద్వారా నలిన్‌ కళ్లకు కట్టినట్టు చూపించారు. తొమ్మిదేళ్ల బాలుడి కథగా తెరకెక్కిన ఈ చిత్రంలో భవిన్‌ రాబరి, భవేశ్‌ శ్రీమాలి, రిచా మీనా, దిపెన్‌ రావల్‌, పరేశ్‌ మెహతా ప్రధాన పాత్రలు పోషించారు. 'లాస్ట్‌ ఫిల్మ్‌ షో' (ఆంగ్లంలో) పేరుతో ఈ సినిమా గతేడాది జూన్‌లో 'ట్రిబెకా ఫిల్మ్‌ ఫెస్టివల్‌'లో ప్రదర్శితమై, వీక్షకుల హృదయాల్ని బరువెక్కించింది. పలు అంతర్జాతీయ వేడుకల్లోనూ సత్తా చాటింది. అక్టోబరు 14న భారత్‌లో విడుదలకాబోతుంది.

ఆస్కార్‌ పోటీలో నిలిచిన మన చిత్రాలు..

  • మదర్‌ ఇండియా (1958)
  • సలామ్‌ బాంబే (1989)
  • లగాన్‌ (2001)

ఇప్పటి వరకూ ఈ మూడు భారతీయ సినిమాలు ఆయా ఏడాదిలో ఆస్కార్‌ అవార్డుల్లో గట్టి పోటీనిచ్చి, తుది జాబితాలో నిలిచాయి. తమిళ చిత్రం 'కూలంగళ్‌' (పెబెల్స్‌) గతేడాది ఆస్కార్‌కు నామినేట్‌ అయినా షార్ట్‌లిస్ట్‌లో నిలవలేకపోయింది. 95వ ఆస్కార్‌ అవార్డుల వేడుక లాస్‌ ఏంజెల్స్‌లో మార్చి 12న వచ్చే ఏడాది జరగనుంది.

జనరల్‌ కేటగిరీలో... ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేట్‌ కాని, చిత్రాలు జనరల్‌ కేటగిరిలో పోటీ చేయొచ్చు. దాని కోసం ఆయా చిత్ర బృందాలు తమ సినిమా నామినేషన్‌ కోసం అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ అక్టోబరు 3 వరకూ అవకాశం ఉంది. 2022లో విడుదలైన ((జనవరి 1 నుంచి నవంబరు 30 వరకు) చిత్రాలకు వెసులుబాటు ఉంది. ఆయా సినిమాలు థియేటర్లలో కనీసం ఏడు రోజులు ప్రదర్శితమై ఉండాలి.

ఇదీ చూడండి: బన్నీకి ఛాలెంజ్​ విసిరిన కూతురు అర్హ.. ఓడిపోయిన ఐకాన్ స్టార్​

Last Updated :Sep 20, 2022, 9:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.