సీతారామం.. ఈ చిక్కు ప్రశ్న అర్థం తెలుసా?

author img

By

Published : Sep 19, 2022, 8:43 PM IST

sitaramam

సీతారామం చిత్రంలో కథానాయిక సీతామహాలక్ష్మి‌(మృణాల్‌), తన లేఖ ద్వారా హీరో రామ్‌‌(దుల్కర్‌‌)కు సంధించిన ప్రశ్న 'కురుక్షేత్రంలో రావణ సంహారం! యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం'. అయితే ఆ ప్రశ్నకు సినిమాలో హీరో రామ్‌ సమాధానం కనుగొన్నా, కొంతమంది ప్రేక్షకులకు ఓ ప్రశ్నలా మిగిలిపోయింది. దాని గురించి తెలుసుకుందాం..

దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్ ‌ ప్రధాన పాత్రలు పోషించిన 'సీతారామం'... ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని సంభాషణలు ప్రేక్షకులను ఆలోచింపజేశాయి. ఈ చిత్రంలో కథానాయిక సీతామహాలక్ష్మి‌(మృణాల్‌), తన లేఖ ద్వారా హీరో రామ్‌‌(దుల్కర్‌‌)కు సంధించిన ప్రశ్న 'కురుక్షేత్రంలో రావణ సంహారం! యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం'. ఈ ప్రశ్నతో మొదలైన వారి(హీరోహీరోయిన్ల) ప్రయాణం(సినిమా), కథ(సినిమా) పూర్తయ్యే సమయానికి ప్రేక్షకుల హృదయాలు బరువెక్కేలా చేస్తుంది. అయితే ఆ ప్రశ్నకు సినిమాలో హీరో రామ్‌ సమాధానం కనుగొన్నా, కొంతమంది ప్రేక్షకులకు 'కుంజర యూదంబు' ప్రశ్నలా మిగిలిపోయింది.

అయితే పరిశీలించి చూస్తే.. హనురాఘవపూడి 'సీతారామం' కథలోని వైవిధ్యాన్ని ఈ ప్రశ్న ద్వారా అక్షరీకరించారు. హీరోహీరోయిన్ల పరిచయ సన్నివేశాన్ని ఈ ప్రశ్నలో అర్థవంతంగా, అందంగా ఇమిడించారని ప్రేక్షకులు అంటున్నారు.

కురుక్షేత్రంలో రావణ సంహారం! యుద్ధపు వెలుగులో సీతాస్వయంవరం?.. సీతారామం సినిమాలో హీరో-హీరోయిన్‌ మొదటిసారి రెండు వర్గాల ఘర్షణలో కలుసుకుంటారు. ఆ సన్నివేశంలో వారి ఘర్షణను 'కురుక్షేత్రం'(అన్నదమ్ముల గొడవ)గా ఈ ప్రశ్న ద్వారా హీరోయిన్‌ సీత అభివర్ణించింది. ఇక రావణసంహారం అంటే హీరో రామ్‌ ఆ గొడవలో అసలు కుట్రదారును బయటపెట్టి ఆ ఘర్షణను శాంతింపచేస్తాడు. ఆ సందర్భంలో చెడుపై రామ్‌ సాధించిన విజయం కాబట్టి దాన్ని 'రావణసంహారం' గా మార్చి 'కురుక్షేత్రంలో రావణసంహారం' అనే వాక్యాన్ని హీరోయిన్‌ సృష్టించింది. ఇక 'యుద్ధపు వెలుగులో సీతాస్వయంవరం' అంటే.. ఆ సన్నివేశంలోనే కాగడాల వెలుగులో మొదటిసారి రామ్‌ని చూసిన సీతామహాలక్ష్మి అతడే తన భర్తగా నిశ్చయించుకుంటుంది. అదే 'యుద్ధపు వెలుగులో సీతాస్వయంవరం' అనే వాక్యం పుట్టడానికి కారణమయ్యింది. అప్పటినుంచే హీరో రామ్‌కు 'ఇట్లు నీ భార్య సీతామహాలక్ష్మి' అని హీరోయిన్ ఉత్తరాలు రాస్తుంది. ఇలా హీరోహీరోయిన్ల పరిచయ సన్నివేశాన్ని తార్కికమైన ప్రశ్నలో సంక్షిప్తీకరించి, అద్భుతమైన ప్రేమ కథకు బీజం వేసిన దర్శకుడు హను రాఘవపూడిని ప్రేక్షకులు 'వహ్వా' అంటూ ప్రశంసిస్తున్నారు.

ఇదీ చూడండి: ఈ బుడ్డోడు ఇప్పుడు బిగ్​బాస్​ 6 కంటెస్టెంట్​.. ఎవరో గుర్తుపట్టగలరా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.