'మంచి ట్రెండ్​లో ఉన్నాం.. 'తగ్గేదే లే'!

author img

By

Published : Sep 19, 2022, 10:04 AM IST

alluri movie pre release event

శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రం 'అల్లూరి'. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం జరిగింది. దీనికి ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరోనా తర్వాత సినిమాకు ఆదరణ పెరిగిందని.. మంచి కంటెంట్​ ఉంటే భయపడే అవసరం లేదన్నారు. ఇంకా ఏమన్నారంటే..

"కరోనా తర్వాత అందరూ సినిమాల గురించి మాట్లాడుతున్నారు. ఆదరణ విషయంలో చిన్న, పెద్ద అనే తేడానే లేదు. మంచి సినిమా అయితే చాలు.. ఆదరణ దక్కుతోంది. ప్రేక్షకులు థియేటర్‌కి వచ్చి చూస్తున్నారు. ఆ రకంగా ఓ మంచి ట్రెండ్‌లో ఉన్నాం. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు" అన్నారు ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్‌. ఆయన ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన 'అల్లూరి' విడుదలకి ముందస్తు వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రమిది. కయాదు లోహార్‌ కథానాయిక. ప్రదీప్‌వర్మ దర్శకత్వం వహించారు. బెక్కం వేణుగోపాల్‌ నిర్మాత. ఈ చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకొస్తోంది. అల్లు అర్జున్‌ మాట్లాడుతూ "నాకు ఇష్టమైన వ్యక్తి శ్రీవిష్ణు. 'ప్రేమ ఇష్క్‌ కాదల్‌'లో ముగ్గురు హీరోలు ఉంటారు. అందులో తనది ఒక పాత్ర. చాలా బాగా చేశాడు. అప్పట్నుంచి తనపై ప్రత్యేకమైన ఇష్టం ఏర్పడింది. ఆ తర్వాత నుంచి ప్రతి సినిమానీ గమనిస్తున్నా. ఆయనకొక మంచి అభిరుచి ఉంటుంది"

"సినిమా గురించి చాలా తపన పడుతుంటారు. ఒక నటుడు అలా పనిచేస్తే ఎవరికైనా గౌరవం పెరుగుతుంది. 'పుష్ప2'తో బిజీగా ఉన్నా. ఇక వేడుకలకి వెళ్లొద్దనుకున్నా. శ్రీవిష్ణు ఇప్పటిదాకా నన్నెప్పుడూ సాయం అడగలేదు. 'నా సినిమాల్ని నేను సరిగ్గా ప్రచారం చేసుకోవడం లేదంటున్నారు. మీరు వస్తే నాకు చాలా మేలవుతుంది' అన్నారు. అప్పుడే వేడుకకి రావాలనుకున్నా. ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందాలని కోరుకుంటున్నా" అన్నారు.

చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. "పోలీస్‌ కథల్లో ఎంత కిక్‌ ఉంటుందో, నా సినిమాతో కూడా అంతే కిక్‌ వస్తుంది" అన్నారు. అనంతరం శ్రీవిష్ణు మాట్లాడుతూ.. "పోలీస్‌ వ్యవస్థ మనకు చాలా చేసింది. వాళ్లందరి కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నా. అల్లు అర్జున్‌ ఓ రోజు పిలిచి 'మీ కామెడీ టైమింగ్‌ బాగుంటుంది. చాలా సినిమాలు వస్తుంటాయి కదా. తొందరపడి ఏదీ చేయొద్దు' అన్నారు. ఆయన మాటల్ని ఇప్పటికి ఆచరిస్తుంటాను. నా ప్రతి పాత్ర పేరులోనూ అల్లు అర్జున్‌ పేరు గుర్తుకొచ్చేలా ఏఏ అనే అక్షరాలు ఉంటాయి. అదీ నాకు ఆయనపై ఉన్న గౌరవం. ఈ సినిమా చూశాక పోలీస్‌ కనిపిస్తే చెయ్యెత్తి సెల్యూట్‌ చేస్తారు" అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్‌ వర్మ, కయాదు లోహార్‌, హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, రాంబాబు గోసాల, చదలవాడ శ్రీనివాసరావు, టి.ప్రసన్నకుమార్‌, తనికెళ్ల భరణి, రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: 'అతిలోక సుందరి శ్రీదేవిలా పేరు తెచ్చుకోవాలి'

'నా పిల్లల కన్నా మోదీనే ఇష్టం'.. స్టార్ నటుడి తల్లి పోస్ట్.. కంగన రియాక్షన్ ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.