మృతదేహంతో పరుగు తీసిన యువకుడు.. పోలీసుల ఛేజ్​.. చివరకు

author img

By

Published : Jan 14, 2023, 11:45 AM IST

die

Young Man Carrying Deceased On His Shoulder: మృతదేహాన్ని భుజాన వేసుకొని యువకుడు పరుగు తీశాడు. ఆ యువకుడిని వెంబడిస్తూ పోలీసులు కూడా పరుగులు తీశారు. ఇది ఏదో సినిమా సీన్​ అనుకుంటే పొరపాటే.. నిజంగానే జరిగింది.. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఎందుకు ఇలా పరిగెత్తాడు అనుకుంటున్నారా.! మీరే చూసేయండి.

Young Man Carrying Deceased On His Shoulder: ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తిని శ్మశానికి తీసుకువెళ్లడానికి ఏం చేస్తాం. నలుగురు వ్యక్తులు ఆ చనిపోయిన వ్యక్తిని కాటికి మోసుకొని వెళతారు.. లేకపోతే అంతిమయాత్ర వాహనంలో తీసుకువెళతాము. ఇంకా చెప్పాలంటే అటవీ ప్రాంతాల్లో అయితే మోసుకొని వెళతారు. ఇదే కదా మనం ఎక్కడైనా చూసేది.. అందుకు భిన్నంగా జరిగితే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి.. చనిపోయిన వ్యక్తిని ఇంకో వ్యక్తి భుజాలపై మోసుకొని పరిగెత్తుకుంటూ వెళితే.. వెనుక పోలీసులు వెంబడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపింది.

జిల్లాలోని తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన జడల మల్లయ్య (65) అనే వ్యక్తి శుక్రవారం తెల్లవారుజామున తన ఇంట్లో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఉదయం అంత్యక్రియలు చేయడానికి సిద్ధమయ్యారు. అంతలోనే.. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. మల్లయ్య మృతిపై అనుమానాలున్నాయని... మృతదేహాన్ని శవపరీక్ష కోసం సిరిసిల్లకు తరలించాలని సూచించారు. అందుకు మల్లయ్య కుటుంబసభ్యులు నిరాకరించారు.

తమకు మృతిపై అనుమానాలు లేవని గుండెపోటుతోనే చనిపోయాడని వాదించారు. అంత్యక్రియలు నిర్వహించుకుంటామని తెలిపారు. అయితే పోలీసులు అందుకు అంగీకరించలేదు. ఓవైపు ఈ తంతంగం జరుగుతున్న సమయంలోనే మల్లయ్య సోదరుడి కుమారుడు రాజు మృతదేహాన్ని భుజంపై వేసుకుని శ్మశానవాటిక వైపు పరుగులు తీశాడు.

దీంతో అక్కడున్న వారంత అవాక్కయ్యారు. వెంటనే తేరుకున్న పోలీసులు అతని వెంట పరుగులు తీశారు. శ్మశానవాటిక వైపు వెళ్తున్న రాజును చివరకు అడ్డుకొన్నారు. మల్లయ్య కుటుంబసభ్యులతో మాట్లాడి ఎట్టకేలకు మృతదేహాన్ని సిరిసిల్లకు తరలించారు. అక్కడ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించి మృతదేహాన్ని అప్పగించారు. చివరకు సాయంత్రం మల్లయ్యకు అంత్యక్రియలు నిర్వహించారు.

ప్రస్తుతానికి మల్లయ్య మరణాన్ని అనుమానాస్పద మృతి కేసుగా.. నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ సాంబశివరావు తెలిపారు. గురువారం రాత్రి కుటుంబ సభ్యులమంతా కలిసి భోజనం చేసి నిద్రపోయామని, శుక్రవారం తెల్లవారుజామున చూసేసరికి తన భర్త మరణించి ఉన్నాడని మల్లయ్య భార్య చంద్రవ్వ పోలీసులకు తెలిపారు. తనకు ఎవరిపైనా అనుమానం లేదని, విచారణ చేపట్టి చర్య తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోస్ట్​మార్టమ్ నివేదిక రావాల్సి ఉందని అందులో ఉన్న దానిని పరిశీలించిన తరువాతే తాము ఆ దిశగా దర్యాప్తు చేపడతామని పోలీసులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.