నాలుగువేలకే ఐఫోన్.. టెంప్టింగ్​ ఆఫర్​తో ఆర్డర్​.. పార్సిల్​ చూసి అందరూ షాక్​..!

author img

By

Published : Aug 3, 2022, 4:22 PM IST

waste papers delivered Instead of apple phone in Birkoor

iPhone fraud: ఐఫోన్​ వాడాలని ఎవరికుండదు.. అయితే.. అది ఖరీదైన ఫోన్​ కావటం వల్ల చాలా మంది వాడలేక వేరే మొబైల్స్​తో సరిపెట్టుకుంటుంటారు. మరి అలాంటి ఐఫోన్ ఏకంగా​ నాలుగు వేలకే వస్తుందంటే.. ఎవరు మాత్రం తొందరపడకుండా ఉంటారు. అలా.. ఓ ఆఫర్​లో అతితక్కువ ధరకే ఐఫోన్​ వస్తోందని ఆశపడ్డ యువకుడికి.. డెలివరి అయిన పార్సిల్​ చూసి దిమ్మతిరిగిపోయింది. అసలు పార్సిల్​లో ఏమొచ్చింది..? ఆ తర్వాత ఆ యువకుడు ఏం చేశాడు..?

iPhone fraud: ఆన్​లైన్​లో రూ.20 వేలకు పైగా ఉన్న ఐఫోన్ రూ.4 వేలకే ఇస్తామని ఆఫర్ పెట్టి.. ఆర్డర్​ చేసిన వాళ్లకు చిత్తు కాగితాలు వచ్చిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన రాంసాని శ్రీను అనే యువకుడి చరవాణికి జులై 28న గుర్తుతెలియని నెంబరు నుంచి ఓ లింకు వచ్చింది. ఎంటా లింకు..? అని తెరిచిన శ్రీనుకు.. కళ్లు చెదిరే ఆఫర్​ కనిపించింది. 20 వేలకు పైగా ఉన్న యాపిల్​ ఫోన్​.. కేవలం నాలుగు వేలకే లభిస్తోందని ఆ ఆఫర్​ సారాంశం. ఈ ఆఫర్​ను చూసి ఒక్క నిమిషం అవాక్కయిన శ్రీను.. తనకు వచ్చిన ఆఫర్​ నిజమేనా..? ఎదైనా మోసమా..? అని ఆలోచించాడు.

waste papers delivered Instead of apple phone in Birkoor
డెలివరీ అయిన పార్సిల్​

కానీ.. అతని ఆలోచనను ఆశ అనే మబ్బు కమ్మేసింది. తలుపుతట్టిన అదృష్టాన్ని.. అనుమానిస్తూ జారవిడుచుకోవద్దని మనసుకు సర్దిచెప్పుకున్నాడు. వెంటనే అదే లింక్​లో.. ఫోన్ కోసం ఆర్డర్ పెట్టాడు. ఆగస్టు 2న ఫోన్​ డెలివరి అవుతుందని సందేశం వచ్చింది. కాగా.. ఫోన్​ కోసం శ్రీను ఎంతో ఆశగా ఎదురుచూడసాగాడు. మంగళవారం రోజు.. డెలివరిబాయ్ రానే వచ్చాడు. అతి తక్కువ ధరకే.. ఖరీదైన ఫోన్​ వస్తోందన్న సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న మనసుతో.. డెలివరీ బాయ్​ ఇచ్చిన పార్సిల్​ తీసుకున్నాడు.

waste papers delivered Instead of apple phone in Birkoor
waste papers delivered Instead of apple phone in Birkoor

ఎప్పుడెప్పుడు తన మొబైల్​ను చూస్తానో అన్న ఉత్సుకతతో ఉన్న శ్రీను.. ఆలస్యం చేయకుండా పార్సిల్​ చేతికందగానే తెరిచి చూశాడు. పార్సిల్​ విప్పి చూడగా.. విస్తుపోవటం శ్రీను వంతైంది. పార్సిల్​లో మొబైల్​ లేకపోగా.. లోపల మొత్తం చిత్తు కాగితాలే దర్శనమిచ్చాయి. ఎంతో ఆశగా ఎదురుచూసిన శ్రీను.. చిత్తు కాగితాలను చూసి చూసి బిత్తర పోయాడు. ఈ విషయాన్ని తన స్నేహితులకు చెప్పటంతో.. గ్రామస్థులు డెలివరిబాయ్​ను పట్టుకుని గట్టిగా నిలదీశారు. పార్సిల్​లో ఏముంటుందో తనకేం తెలియదని.. ఆయా కంపెనీల నుంచి వచ్చే వస్తువులను తాము సరఫరా మాత్రమే చేస్తామని.. ఏదైనా ఉంటే కంపెనీని సంప్రదించాలని సూచించాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించగా బయటపడిన డెలివరిబాయ్​.. బాధితుడి నుంచి కంపెనీకి లెటర్ రాయించుకున్నాడు. శ్రీనుకు డబ్బులు తిరిగి చెల్లించడంతో డెలివరిబాయ్​ను గ్రామస్థులు వదిలేశారు.

waste papers delivered Instead of apple phone in Birkoor
పార్సిల్​లో ఉన్న చిత్తు కాగితాలు..

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.