వెలుగులోకి మరో దారుణం.. బాలికపై ఇద్దరు యువకులు వేర్వేరుగా అఘాయిత్యం

author img

By

Published : Jun 7, 2022, 7:13 PM IST

Updated : Jun 8, 2022, 7:18 AM IST

Two young men sexually assault a girl in Nizamabad

19:08 June 07

వెలుగులోకి మరో దారుణం.. బాలికపై ఇద్దరు యువకుల లైంగికదాడి..

దాగుడుమూతల పేరుతో బాలికకు దగ్గరైన యువకుడు ఆమె నగ్న చిత్రాలు సేకరించి, తర్వాత వాటిని చూపి బెదిరిస్తూ లైంగిక దాడిని కొనసాగించాడు. ఇన్‌స్టాగ్రాంలో ఇటీవల పరిచయమైన ఇంకొకడు అదే బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ దృశ్యాలను ఫోన్‌లో బంధించి ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. వేధింపులు తాళలేని బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో నిజామాబాద్‌ జిల్లాలో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది.

ఏసీపీ వెంకటేశ్వర్‌ కథనం ప్రకారం.. నిజామాబాద్‌ నాలుగో ఠాణా పరిధిలోని ఓ అపార్టుమెంట్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న బాలిక ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. అదే అపార్టుమెంట్‌లో ఉంటున్న యువకుడు రోహిత్‌ 2017 నుంచి బాలికతో చనువు పెంచుకుంటూ వస్తున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు దాగుడుమూతల ఆట పేరుతో అపార్టుమెంట్‌ పైఅంతస్తుకు తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం బాలిక నగ్నచిత్రాలను ఫోన్‌లో బంధించాడు. వాటిని చూపించి బెదిరిస్తూ లైంగిక దాడిచేశాడు. రెండేళ్ల క్రితం కూడా అవే చిత్రాలను చూపించి ఇంట్లోకి బలవంతంగా తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని గుర్తించి మరోసారి అత్యాచారం చేశాడు.

ప్రేమ పేరుతో వల విసిరి

బాధిత బాలికకు ఇటీవల భానుప్రసాద్‌గౌడ్‌ అనే యువకుడు ఇన్‌స్టాలో పరిచయమై ప్రేమపేరిట లొంగదీసుకున్నాడు. మాయమాటలు చెప్పి ఓ కల్యాణ మండపం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. సంబంధిత నగ్నచిత్రాలు, వీడియోలు తీశాడు. వాటిని ఆమెకే పంపి బెదిరింపులకు పాల్పడ్డాడు. తనతోపాటు బయటకు రావాలంటూ భయపెట్టడం ఆరంభించాడు. తన సోదరి వివాహం నిశ్చయమైన నేపథ్యంలో.. విషయం బయటికి పొక్కితే పరువుపోతుందనే భయంతో కొంతకాలంగా ఇద్దరి వేధింపులను భరిస్తూ వచ్చిన బాలిక చివరకు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. సోమవారం వారిచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులిద్దరిపై అత్యాచారం, పోక్సో, అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదుచేసి అరెస్టు చేశామని, వారి ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ మంగళవారం వెల్లడించారు. నిందితుల్లో ఒకడైన రోహిత్‌ ప్రభుత్వ శాఖలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడని, భానుప్రసాద్‌ గల్ఫ్‌కు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడని తెలిపారు.

ఇవీ చూడండి:

Last Updated :Jun 8, 2022, 7:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.