tiger skin: ప్రపంచ పులుల దినోత్సవం రోజునే.. పులిచర్మం లభ్యం

author img

By

Published : Jul 29, 2021, 8:03 PM IST

Updated : Jul 29, 2021, 9:34 PM IST

tiger hunting

ములుగు జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు పులి చర్మం లభ్యమైంది. ఏటూరునాగారం మండలం రాంపూర్‌ ముళ్లకట్ట వద్ద తనిఖీలు చేస్తుండగా... ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిని వెంబడించి పట్టుకోగా.. వారివద్ద పులిచర్మం దొరికింది.

ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా ప్రపంచమంతా పులుల సంరక్షణపై అవగాహన కల్పిస్తుంటే.. ఓ వైపు వేటగాళ్ల చేతిలో పులులు హతమవుతూనే ఉన్నాయి. అందుకు నిదర్శనమే ఈ ఘటన. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రాంపూర్​ ముళ్లకట్ట వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా... ద్విచక్రవాహనంపై ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పరారయ్యారు.

వారిని వెంబడించి పట్టుకున్న పోలీసులు సోదాలు చేయగా.. వారివద్ద పెద్దపులి చర్మం లభ్యమైంది. వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు వాజేడుకు చెందిన తిరుమలేశ్‌, ఛత్తీస్‌గఢ్​కు చెందిన సత్యంగా గుర్తించారు. పులి చర్మాన్ని ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెచ్చినట్లు విచారణలో తేలింది.

ఇదీ జరిగింది..

ఛత్తీస్​గఢ్ రాష్ట్రంలోని తాళ్లగూడెం మండలం చుండూరుకు చెందిన సాగర్ అనే వ్యక్తి వద్ద పులి చర్మం ఉందని... దాన్ని అమ్మడానికి సాయం చేయాలని తిరుమలేశ్​కు చెప్పాడు. తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి.. పులిచర్మాన్ని రూ.30 లక్షలకు కొనేందుకు సిద్ధంగా ఉన్నాడని చెప్పి.. సాగర్​ నుంచి పులిచర్మం తీసుకుని వస్తుండగా.. దారిలో పోలీసులకు పట్టుబడ్డారు. అటవీశాఖ ఇన్​ఛార్జి డీఎఫ్​వో గోపాలరావు, అటవీశాఖ సిబ్బందికి పులిచర్మాన్ని పరిశీలించి.. నిజమైన పులిదిగా నిర్ధారించారు. అటవీ సంరక్షణ చట్టం 1972 ప్రకారం పంచనామా నిర్వహించారు. త్వరలోనే మిగిలిన నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. నిందితులపై అటవీ సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి... అటవీ అధికారులకు అప్పగిస్తామని వెల్లడించారు.

ఇదీ చూడండి: వన్యమృగ సంరక్షణ బాధ్యత మనిషిదే

Last Updated :Jul 29, 2021, 9:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.