రెచ్చిపోయిన దొంగలు.. ఒకే ఊర్లో ఒకే రోజు ఆరు ఇళ్లలో చోరీలు..

author img

By

Published : Jul 30, 2022, 8:24 PM IST

దొంగలు బీభత్సం

Theft in 6 Houses in One Night: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చోరీకి తెగబడ్డారు. ఒకే రోజు ఆరు ఇళ్లను దోచుకుని.. ఊరంతా ఉలిక్కిపడేలా చేశారు. ఈ చోరీల ఘటనతో..స్థానికులు భయంతో వణికిపోతున్నారు.

Theft in 6 Houses in One Night: తాళాలు వేసున్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకటే ఊరిలో.. ఒక్క రోజులోనే.. ఏకంగా ఆరు ఇళ్లను దోచుకుని.. అందరినీ ఉలిక్కిపడేలా చేశారు. ఈ చోరీల ఘటన.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణంలోని వేరువేరు ప్రాంతాల్లోని ఆరు ఇళ్లలో చోరీకి తెగబడ్డ దొంగలు.. అందినకాడికి దోచుకెళ్లారు.

తాళాలు పగలగొట్టి.. వస్తువులన్ని చిందరవందరగా పడేశారు. ఇండ్లలోని బీరువాల తాళాలు తెరిచి.. కనిపించినకాడికి దోచేశారు. నగలకు సంబంధించిన బాక్సులను దొంగలు వీధుల్లో పడేసి వెళ్లారు. పొద్దున్నే వచ్చి ఇళ్లను చూసుకున్న బాధితులు.. ఒక్కసారిగా షాకయ్యారు. ఒకరి తర్వాత ఒకరు పోలీస్​స్టేషన్​ దారి పట్టటంతో.. మొత్తం ఆరు ఇళ్లలో చోరీ జరిగిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. కేసులు నమోదు చేసుకుని రంగంలోకి దిగారు.

ఘటనాస్థలాలకు వెళ్లి పోలీసులు విచారణ చేపట్టారు. క్లూస్​ టీం, డాగ్​స్క్వాడ్స్​ సాయంతో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు.. వీధుల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు.. ఇద్దరు దుండగులు వీధుల్లు సంచరిస్తోన్న దృశ్యాలు లభ్యమయ్యాయి. అయితే.. ఈ వరుస దొంగతనాలన్ని ఈ ఇద్దరే చేసి ఉంటారా..? లేక వేరే వాళ్లు కూడా ఉన్నారా..? లేదా ఒకటే గ్యాంగ్​.. ఏకకాలంలో విడివిడిగా దొంగతనానికి పాల్పడ్డారా..? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ దోపిడి ఘటనలో.. అన్ని ఇళ్లల్లో కలిసి సుమారు రూ.2లక్షల నగదు, మూడు తులాల బంగారం, 80 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. ఒక్కరోజులోనే ఆరు ఇళ్లలో చోరీలు జరగటంతో.. ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎప్పుడు ఎవరింట్లో దొంగతనం జరుగుతుందోనని ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

ఇవీ చదవండి: మినీ జూపార్క్‌ను తలపిస్తున్న క్యాసినో ఏజెంట్‌ చీకోటి ప్రవీణ్​ ఫాంహౌస్‌..

కుమార్తెపై తల్లి కర్కశం.. చెప్పుతో చితకబాది.. నేలకేసి కొట్టి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.