Bitcoin Frauds news: లాభం చూపిస్తారు.. రూ.లక్షలు లాగేస్తారు.. బీ అలర్ట్​!!

author img

By

Published : Sep 22, 2021, 11:07 AM IST

Bitcoin Frauds news: లాభం చూపిస్తారు.. రూ.లక్షలు లాగేస్తారు.. బీ అలర్ట్​!!

సామాజిక మాధ్యమాలు.. వాట్సాప్‌ ద్వారా బిట్‌కాయిన్ల వల (Bitcoin Frauds) విసురుతున్నారు సైబర్​ నేరగాళ్లు. బిట్‌కాయిన్‌ మైనింగ్‌ ద్వారా కొనుగోలు చేస్తే... పదిహేను రోజుల్లనే రూ.లక్షల్లో లాభాలొస్తాయని చెప్పి... మోసం చేస్తున్నారు. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

‘‘బిట్‌ కాయిన్‌ కొనండి.. మూడురెట్లు లాభాలు పొందండి..’’ అంటూ సైబర్‌ నేరస్థులు విద్యార్థులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు.. వ్యాపారుల చరవాణుల నంబర్లు తెలుసుకుని వాటి ద్వారా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ ఖాతాలకు పదుల సంఖ్యలో ప్రకటనలు పంపుతున్నారు. వారితో రోజూ స్నేహితుల్లా మాట్లాడుతూ బిట్‌కాయిన్‌ (Bitcoin Frauds) మైనింగ్‌ ద్వారా కొనుగోలు చేస్తే... పదిహేను రోజుల్లనే రూ.లక్షల్లో లాభాలొస్తాయని చెబుతున్నారు. బిట్‌కాయిన్‌ (Bitcoin)క్రయవిక్రయాలకు తమకు అధికారం ఉందంటూ నకిలీ వెబ్‌సైట్లను పంపి బాధితులను ఆకర్షిస్తున్నారు. స్పందించిన వారి నుంచి రూ.లక్షలు కొల్లగొట్టి ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేస్తున్నారు. బిట్‌కాయిన్‌ క్రయ విక్రయాలంటేనే మోసమని, నగదు బదిలీచేయవద్దని సైబర్‌క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు. కొద్దిరోజుల నుంచి నైజీరియన్లు బిట్‌కాయిన్ల పేరుతో మోసాలు మొదలు పెట్టారని వివరించారు.

హైదరాబాద్​ పాతబస్తీలో ఉంటున్న వ్యాపారి నజీబుద్దీన్‌ చరవాణి నంబర్‌ను బిట్‌కాయిన్‌ గ్రూప్‌ ఎం8 యాప్‌లో గుర్తుతెలియని వ్యక్తులు ఈనెల తొలివారంలో చేర్చారు. నికోల్‌ అనే యువతి నజీబుద్దీన్‌కు ఫోన్‌ చేసి.. బిట్‌ కాయిన్‌ ద్వారా లావాదేవీలు నిర్వహించండి.. రూ.లక్షల్లో లాభాలు పొందండి అంటూ చెప్పింది. ఆన్‌లైన్‌ పద్ధతిలో మూడురోజులు నజీబుద్దీన్‌కు శిక్షణ ఇచ్చింది. బిట్‌కాయిన్స్‌ను వేర్వేరు కరెన్సీల్లో మార్పిడి చేసే బినాన్స్‌ డాట్‌కామ్‌, జాబ్‌పే ఎక్చ్సేంజిల ద్వారా నగదు బదిలీ చేయవచ్చంటూ వివరించింది. దీంతో నజీబుద్దీన్‌ రూ. లక్ష మదుపు చేయగా.. నాలుగైదురోజుల్లోనే రూ.15వేలు లాభం వచ్చింది. దీంతో ఈసారి అతడు రూ.4లక్షలు బిట్‌కాయిన్‌లో మదుపు చేశాడు. లాభం రాలేదంటూ నికోల్‌ను సంప్రదించగా.. మరింత మదుపు చేయండి అంటూ పదిహేను రోజుల్లో రూ.14లక్షలు నగదు బదిలీ చేయించుకుంది. తర్వాత ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసింది.

ఇప్పుడే పొదుపు... భవిష్యత్‌లో లాభాలు..

క్రిప్టోకరెన్సీగా చలామణి అవుతున్న బిట్‌కాయిన్‌ను కొనేస్తే అది పొదుపేనని చెబుతున్నారు. ఇరవై రోజుల నుంచి బిట్‌కాయిన్‌ విలువ తగ్గుతోంది... 14రోజుల క్రితం ఒక బిట్‌యిన్‌ విలువ రూ.38.49లక్షలుండగా.. ప్రస్తుతం రూ.31.65లక్షలుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బిట్‌కాయిన్‌కు డిమాండ్‌ తగ్గుతున్నా.. వచ్చే నెల నుంచి రాకెట్‌ వేగంతో పెరుగుతుందని సైబర్‌ నేరస్థులు చెబుతున్నారు. అమెరికా, ఐరోపా దేశాల్లో చట్టబద్ధమైన లావాదేవీలు బిట్‌కాయిన్‌ ద్వారానే కొనసాగుతున్నాయని బాధితులకు వివరిస్తున్నారు. అంతర్జాతీయంగా ఆదరణ పెరుగుతుండడంతో వీటి విలువ కచ్చితంగా పెరిగే అవకాశాలున్నాయని నమ్మబలుకుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.