FAKE BABA: బాబాగా మారిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌... వేషం మార్చి మోసం నేర్చాడు

author img

By

Published : Aug 2, 2021, 12:14 PM IST

FAKE BABA

అతనో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఆర్థిక పరిస్థితులు దిగజారడం, అప్పులవాళ్లు తరచూ వేధించడంతో కట్టూబొట్టూ మార్చి బాబాగా అవతారమెత్తాడు. ఓ మహిళ ఫిర్యాదుతో నల్గొండ జిల్లా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులో తీసుకుని విచారణ జరుపుతుండటంతో అతడి మోసాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడలో కృష్ణలంకకు చెందిన వ్యక్తి హైదరాబాద్‌లో విద్యాభ్యాసం చేశాడు. అనంతరం సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నెలకొల్పాడు. అది సరిగా నడవక.. ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముట్టాయి. దీంతో కంపెనీని మూసివేశాడు. అనంతరం (నాలుగేళ్ల క్రితం) నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలంలోని అజ్మాపురంలో సాయి మాన్సి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేశాడు. తన పేరు విశ్యచైతన్యబాబాగా చెప్పుకొన్నాడు.

ఏడాది క్రితం పీఏపల్లి మండలంలోని సాగర్‌ వెనుక జలాల సమీపంలో 10 ఎకరాల స్థలంలో ఆశ్రమం నిర్మించాడు. ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించి.. శారీరక, మానసిక రోగాలను ఆధ్యాత్మిక చింతన ద్వారా నయం చేస్తానని ప్రకటించాడు. ఇతడి నిజస్వరూపం గురించి తెలియని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన పలువురు ఆన్‌లైన్‌, చరవాణి ద్వారా సంప్రదించారు. మొదట్లో తక్కువ ఫీజు తీసుకొని, మాయమాటలు చెప్పి నమ్మించేవాడు. తనను పూర్తిగా నమ్మిన భక్తుల బలహీనతలను ఆసరాగా చేసుకుని.. వారితో అసభ్యంగా చాటింగ్‌ చేయడం, ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నవారి నుంచి డబ్బులు, ఆస్తులు విరాళాలుగా తీసుకోవడం చేసేవాడు.

.

ఏపీలోని విజయవాడకు చెందిన ఓ మహిళ నుంచి... గుడి నిర్మిస్తానంటూ రూ.కోటి విరాళం తీసుకున్నాడు. ఇప్పటికీ నిర్మాణం చేపట్టకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చి ఇటీవల నల్గొండ ఎస్పీ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. ఆశ్రమంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో రూ.26 లక్షల నగదు, ఇతర దేశాల కరెన్సీ, రూ.20 లక్షలకు పైగా విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.1.55 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ దస్త్రాలు బయటపడ్డాయి. ఒకట్రెండు రోజుల్లో నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. ఇతడి బాధితుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు వీఐపీలతో పాటు ఇద్దరు టీవీ ఆర్టిస్టులు ఉన్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: CHEATER ARREST: అతని ఫోన్​లో అన్నీ మహిళలు, అమ్మాయిల చిత్రాలే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.