'కోరిక తీరిస్తే కానిస్టేబుల్‌ ఉద్యోగం ఇప్పిస్తా..'

author img

By

Published : Jul 13, 2022, 7:44 AM IST

భవానీసేన్‌

SI Sexual Harassment : ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో రెబ్బెన ఎస్సై భవాని సేన్‌పై వేటు పడింది. ఎస్సైని ఎస్పీ కార్యాలయానికి పోలీసులు అటాచ్ చేశారు. మరోవైపు లైంగిక వార్తల నేపథ్యంలో మనస్తాపం చెందిన ఎస్సై భవానీసేన్‌ భార్య ఆత్మహత్యకు యత్నించారు.

SI Sexual Harassment : కుమురం భీం జిల్లా రెబ్బెన ఎస్సై భవానీసేన్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదు రావడంతో మంగళవారం చర్యలు తీసుకున్నట్లు ఆసిఫాబాద్‌ డీఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు. ఎస్సై విధుల నుంచి తొలగించి ఎస్పీ కార్యాలయానికి అటాచ్‌ చేసినట్లు చెప్పారు. పేద కుటుంబానికి చెందిన బాధిత యువతి కష్టపడి ఇంటర్‌ వరకు చదివింది. ఆమె చిన్నతనంలోనే తండ్రి ఇల్లు వదిలి వెళ్లగా.. కుటుంబ పోషణ కోసం ప్రైవేటుగా చిన్నపాటి ఉద్యోగాలు చేస్తోంది. పోలీసు నియామకాలకు నోటిఫికేషన్లు వెలువడటంతో ఇటీవల కానిస్టేబుల్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది.

స్థానిక ఎస్సై ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణీ చేస్తున్నారని తెలిసి.. సాయం చేస్తారనే ఆశతో స్టేషన్‌కి వెళ్లి అవసరమైన పుస్తకాలు ఇప్పించాలని కోరింది. దీన్ని అవకాశంగా తీసుకున్న ఎస్సై ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై బాధిత యువతి మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో బంధువులతో కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. యువతి ఫిర్యాదు మేరకు ఎస్సై భవానీసేన్‌ గౌడ్‌పై ఐపీసీ 354 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ నరేందర్‌ తెలిపారు. అంతకుముందు ఆసిఫాబాద్‌ డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని రాజీ చర్చలు జరిగాయి.

‘‘పోటీ పరీక్షల పుస్తకాల కోసం వారం క్రితం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లా. ఎస్సై మరుసటి రోజు రమ్మన్నారు. మళ్లీ వెళ్లగా.. నీ ఎత్తు చూస్తానని నా పక్కన నిలబడ్డారు. నడుముపై చేయి వేసి, శరీర భాగాలను తాకాడు. కోరిక తీర్చితే పరీక్ష రాయకుండానే కానిస్టేబుల్‌ ఉద్యోగం వచ్చేలా చూస్తానన్నారు. వెంటనే స్టేషన్‌లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లకు ఈ విషయం చెప్పి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లా. తర్వాతా ఎస్సై ఫోన్‌ చేసి వేధిస్తున్నారు. వీటిని తాళలేక డీఎస్పీకి ఫిర్యాదు చేశా’’ అని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎస్సై భార్య ఆత్మహత్యాయత్నం: లైంగిక వేధింపుల వార్తల నేపథ్యంలో మనస్తాపం చెందిన ఎస్సై భవానీసేన్‌ భార్య వాసంతి మంగళవారం సాయంత్రం రెబ్బెనలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో శానిటైజర్‌ తాగారు. గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మంచిర్యాలలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎస్సై భవానీసేన్‌-వాసంతి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.