MURDER: రియల్టర్ దారుణ హత్య... కారు డిక్కీలో వేసి కాల్చేశారు!

author img

By

Published : Aug 10, 2021, 12:55 PM IST

Updated : Aug 10, 2021, 6:39 PM IST

MURDER

మెదక్ జిల్లాలో కారుతో పాటు కారులో వ్యక్తి దహనం ఘటనలో ఉత్కంఠ వీడటం లేదు. మృతుడు కారు యజమానే అని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చిన పోలీసులు.. హత్య ఎవరు చేశారు.. ఎందుకు చేశారన్న కోణంలో దర్యప్తు ప్రారంభించారు. ఈ కేసను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మెదక్ పోలీసులు.. శాస్త్రీయ ఆధారాలతో హంతకులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన కారుతో పాటు వ్యక్తి దహనం ఘటనలో గంటలు గడుస్తున్నా.. పూర్తి వివరాలు మాత్రం తేలడం లేదు. మెదక్​ వెల్దుర్తి మండల్ మంగళపర్తి గ్రామ శివారులో సోమవారం రాత్రి రోడ్డు పక్కన కారు కాలిపోవడాన్ని గమనించిన గ్రామస్థులు స్థానిక సర్పంచ్ రామకృష్ణరావుకు సమాచారం అందించారు. ఉదయం కారును పరిశీలించిన గ్రామస్థులు అందులో మృతదేహం ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు రిజిస్ట్రేషన్ నంబర్ అధారంగా మెదక్ పట్టణానికి చెందిన శ్రీనివాస్​దిగా గుర్తించారు. అందులోని మృతదేహం అతనిదే అని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చి విచారణ ప్రారంభించారు.

నాలుగు ప్రత్యేక బృందాలతో...

ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు శాస్త్రీయ ఆధారాలతో హంతకులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు. ఇందుకోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మెదక్ పట్టణంలోని శ్రీనివాస్ ఇంటికి వెళ్లి ఆయన భార్య హైందావతి నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. శ్రీనివాస్ నిన్న మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వచ్చినట్లు.. సాయంత్రం ఐదు గంటల వరకు ఫోన్ పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. మెదక్ జిల్లా జప్తి శివనూర్ వద్దకు వచ్చిన తర్వాత ఫోన్ సిగ్నల్స్ పోయినట్లు గుర్తించారు.

కారు డిక్కీలో పెట్టుకొని వచ్చారా?

ఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా సోమవారం రాత్రి 10:45 నిమిషాలకు మంటలు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీనితోపాటు ప్రధాన రహదారుల వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు డ్రైవింగ్ సీటులో వేరే వ్యక్తి ఉన్నట్లు నిర్ధరించుకున్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పదిగంటల మధ్య హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మరో చోట హత్య చేసి కారు డిక్కీలో పెట్టుకుని ఇక్కడకు తీసుకువచ్చి దహనం చేశారని వారు అనుమానిస్తున్నారు. కారులోని మృతదేహం పూర్తిగా దగ్ధం అవడంతో.. అది ఎవరిదో గుర్తించడానికి డీఎన్ఏ పరీక్ష తప్పనిసరైంది. ఇందుకోసం మెదక్ జిల్లా ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో శవపరీక్ష నిర్వహించడంతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు.

అప్పటి వరకు ఏం జరిగింది..

సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఏం జరిగింది.. కారులో ఉన్న మరో వ్యక్తి ఎవరు.. శ్రీనివాస్ ఎవరెవరిని కలిశారన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇందుకోసం సీసీ కెమెరాల విజువల్స్​తో పాటు సెల్ ఫోన్ సిగ్నల్స్, కాల్ డాటాను పరిశీలిస్తున్నారు. శ్రీనివాస్​కు రియల్ ఎస్టేట్ వ్యాపారలావాదేవీలు ఉండటంతో హత్యకు ఇదే కారణమా లేక ఇంకేమైన సంబంధాలా అన్న కోణంలో విచారణ ప్రారంభించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ స్పష్టం చేశారు. శాస్త్రీయ ఆధారలతో హంతకులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కీలక ఆధారాలు గుర్తించినట్లు సమాచారం.

వ్యక్తి హత్య

ఇదీ చూడండి: జాతీయ రహదారిపై భారీగా విరిగిపడిన కొండచరియలు

Last Updated :Aug 10, 2021, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.