'పంచాయితీ కోసం పోయాం.. ఆ మాట చెబితే దూరంగా వెళ్లేవాళ్లం'

author img

By

Published : Jan 7, 2022, 12:10 PM IST

Updated : Jan 7, 2022, 12:35 PM IST

Demands Vanama Raghava Arrest,  vanama raghava news

Demands Vanama Raghava Arrest : పాల్వంచలో వ్యాపారి రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవేంద్రను అరెస్ట్ చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు సత్వరం నిందితుల్ని అరెస్టు చూపాలని వివిధ పార్టీల నాయకులు, మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడానికి కారణమైన వారిని ఉపేక్షిస్తే ప్రజలకు చట్టాలపై నమ్మకం పోతుందని తక్షణమే శిక్షించాలని కోరుతున్నారు.

Demands Vanama Raghava Arrest : పాత పాల్వంచలో మండిగ సూర్యవతి, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నివాసాలు ఒకే ప్రాంతంలో ఉన్నాయి. ఇరు కుటుంబాలదీ ఒకే సామాజిక వర్గం. ఆమె కుమారుడు నాగ రామకృష్ణ, కుమార్తె మాధవితో వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేంద్రరావుకు 30 ఏళ్ల క్రితం నుంచి పరిచయాలున్నాయి. ఈ చొరవతో తమ కుటుంబ ఆస్తి వివాదంపై సూర్యవతి ఆయన్ను నెల క్రితం ఆశ్రయించింది. ఏడాదిగా నలుగుతున్న వివాదానికి పరిష్కారం చూపాలని కోరింది. దీంతో ఉమ్మడి ఆస్తి అమ్మగా వచ్చిన సొమ్ము ముగ్గురు (సూర్యవతి, రామకృష్ణ, మాధవి) సమానంగా తీసుకోవాలని పంచాయతీ తేల్చాడు. పైగా తల్లి బాధ్యత కొడుకుగా నువ్వే తీసుకోవాలని రామకృష్ణకు సూచించాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అతడు తానేం చెప్పినా చేస్తాడన్న ధీమాతో బెదిరింపులకూ వెరవలేదు. తాను చెప్పినట్లు (భార్య శ్రీలక్ష్మిని హైదరాబాద్‌లో తన వద్దకు ఏకాంతంగా పంపడం) చేస్తే పరిష్కారం చూపుతానని ఎమ్మెల్యే తనయుడు హూంకరించాడు. ఈ బాధ ఎవరితో చెప్పుకోలేకే కుటుంబ ఆత్మహత్యోదంతానికి బాధితుడు పాల్పడ్డాడు.

ఇంత జరిగినా బెదిరింపులు

ఈ నెల 3న వేకువజామున జరిగిన దుర్ఘటనలో రామకృష్ణ, భార్య శ్రీలక్ష్మి, పెద్ద కుమార్తె సాహిత్య (12) సజీవ దహనమయ్యారు. 80 శాతానికి పైగా కాలిన గాయాలతో బయటపడి కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్న కుమార్తె సాహితి బుధవారం ఉదయం మృతిచెందింది. పట్టణంలోని శ్మశానవాటికలో మధ్యాహ్నం అంత్యక్రియలకు బంధువులు ఏర్పాటు చేస్తున్న సమయంలో మృతురాలి మేనమామ జనార్దన్‌రావు(శ్రీలక్ష్మి అన్న)కు ఎమ్మ్లెల్యే తనయుడి అనుచరులు ఫోన్‌చేశారు. ‘నీది ఈ ఊరు కాదు.. ఈ రాష్ట్రం కాదు.. పెట్టిన కేసు వాపసు తీసుకుని వెళ్లకపోతే నీ చెల్లె, బావకు పట్టిన గతే నీకూ పడుతుందని’ బెదిరించారు. అంత్యక్రియల అనంతరం ఈ విషయమై బాధితుడు పాల్వంచ ఏఎస్పీ రోహిత్‌రాజ్‌కు ఫిర్యాదు చేశాడు.

కఠినంగా శిక్షించాలి..

వనమా రాఘవేంద్రరావును కఠినంగా శిక్షించాలని కోరుతూ ‘ఐద్వా’ ఆధ్వర్యాన నిరసన చేపట్టారు. జిల్లా నాయకురాళ్లు జ్యోతి, లక్ష్మి, ఇందిర, రజిత, సునీత, ప్రియాంక పాల్గొన్నారు. పోలీసులు సత్వరం నిందితుల్ని అరెస్టు చూపాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కాసాని అయిలయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, ఎన్డీ రాష్ట్ర నాయకురాలు చండ్ర అరుణ తదితరులు వేర్వేరు కార్యక్రమాల్లో డిమాండ్‌ చేశారు.

‘ఆ మాట చెబితే దూరంగా వెళ్లేవాళ్లం..’

నాగ రామకృష్ణ ఆత్మహత్యకు ముందు తీసిన సెల్ఫీ వీడియోపై తల్లి సూర్యవతి స్పందించారు. తన కుమారుడు ఇంత ఒత్తిడికి లోనయ్యాడన్న సంగతి తెలీదని రోదించారు. ‘ఆస్తి పంపకాల్లో న్యాయం చేయాలని నెల క్రితం రాఘవేంద్రరావు వద్దకు ఇద్దరినీ తీసుకెళ్లా. ఆ సమయంలో అందరితో ఆప్యాయంగానే మాట్లాడాడు. కానీ చాటుగా అంత హీనంగా మాట్లాడిన సంగతి నాతో చెప్పిఉంటే ఆ రోజే అంతా కలిసి రాజమహేంద్రవరం వెళ్లిపోయేవాళ్లం. పరిస్థితులు నెమ్మదించాక ఉన్న ఆస్తులను ఎంతో కొంతకు విక్రయించి కష్టాలు తీర్చుకునే వాళ్లం. అలా చేస్తే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని’ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.

వనమా రాఘవను శిక్షించాలి: ఎన్డీ

భద్రాద్రి జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబాన్ని బలి తీసుకున్న వనమా రాఘవను కఠినంగా శిక్షించాలని ఎన్డీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్‌ చేశారు. నగరంలోని బైపాస్‌రోడ్డులో రాఘవేంద్ర దిష్టిబొమ్మను గురువారం దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెంను అరాచకాలకు కేంద్రంగా మార్చారని, ఇలాంటి వారిపై హత్య, పోక్సో కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకుడు రాయల చంద్రశేఖర్‌రావు, జిల్లా నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, శిరోమణి, శ్రీనివాస్‌ ఆజాద్‌, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ కొవ్వొత్తుల ప్రదర్శన

సంజీవరెడ్డి భవనంపై కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టిన కాంగ్రెస్‌ నాయకులు

పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో బాధ్యుడైన వనమా రాఘవపై కఠిన చర్యలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ఖమ్మంలోని జిల్లా పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవనంపై నాయకులు, కార్యకర్తలు గురువారం సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పువ్వాళ్ల మాట్లాడుతూ రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన సాగుతోందని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తూ నిర్బంధాలకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఈ ఘటనలో ప్రభుత్వం నోరుమెదపకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, నాయకులు రాయల నాగేశ్వరరావు, ఎండీ జావీద్‌, దొబ్బల సౌజన్య, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

రెండు ఆధారాలు.. మూడు సెక్షన్ల కింద కేసులు

నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవేంద్రరావు(ఏ2)పై ఐపీసీ సెక్షన్లు 302 (హత్యానేరం), 306 (వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం), 307 (హత్యాయత్నం) కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ కార్యాలయం గురువారం రాత్రి ఓ ప్రకటనలో పేర్కొంది. సంఘటన జరిగిన రోజు నుంచి పరారీలో ఉన్న ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు అందులో తెలిపింది. కారులో రామకృష్ణ వదిలేసిన ఆత్మహత్య లేఖ, గురువారం వెలుగు చూసిన సెల్ఫీ వీడియోలోని వివరాల ఆధారంగా పాల్వంచ పట్టణంలోని పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయని, వీలైనంత త్వరలో ఆయన్ను పట్టుకుని కోర్టులో హాజరుపరుస్తామని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

రాఘవను కఠినంగా శిక్షించాల్సిందే..: డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పోదెం వీరయ్య

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు దాష్టికాలను అరికట్టాలని, కఠినంగా శిక్షించాలని డీసీసీ అధ్యక్షుడు, భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడానికి కారణమైన వారిని ఉపేక్షిస్తే ప్రజలకు చట్టాలపై నమ్మకం పోతుందని తక్షణమే శిక్షించాలని పేర్కొన్నారు.

బంద్‌ విజయవంతానికి పిలుపు

పాతపాల్వంచలో రామకృష్ణ ఆత్మహత్య సంఘటనలో బాధ్యుడైన ఎమ్మెల్యే వనమా కుమారుడు రాఘవపై కఠినచర్యలు తీసుకోవాలని శుక్రవారం నియోజకవర్గ బంద్‌ నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా, సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, కాంగ్రెస్‌ నాయకులు నాగసీతారాములు, లక్కినేని సురేందర్‌, న్యూడెమోక్రసీ నాయకులు పి.సతీష్‌, ఎల్‌.విశ్వనాథం, కె.సురేందర్‌ వెల్లడించారు. గురువారం శేషగిరిభవన్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. అధికార దురహంకారంతో అరాచకాలు సృష్టిస్తున్న రాఘవపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుని శాంతిభద్రతలు కాపాడాలన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సెటిల్‌మెంట్లకు అడ్డాగా మారిందన్నారు. ఈ నేపథ్యమే నాగ రామకృష్ణ కుటుంబం చావుకు కారణమని.. దీనికి నైతిక బాధ్యతగా ఎమ్మెల్యే వనమా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం జరగనున్న బంద్‌లో వ్యాపార, వాణిజ్యసంస్థలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, రవాణా రంగం స్వచ్ఛందంగా పాల్గొనాల్సిందిగా కోరారు. సమావేశంలో సీపీఐ నాయకులు వై.శ్రీనివాసరెడ్డి, వాసిరెడ్డి మురళి, మున్నా లక్ష్మికుమారి, పద్మజ, సంపూర్ణ, ధనలక్ష్మి, రత్నకుమారి, సీపీఎం నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, జాటోతు కృష్ణ, మహిళా కాంగ్రెస్‌ నాయకురాలు తోట లక్ష్మిప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

మీసేవా కేంద్రాలు...

అశ్వాపురం, న్యూస్‌టుడే: కొత్తగూడెంలో నాగరామకృష్ణ మృతికి నిరసనగా ఈ నెల 7న జిల్లాలోని మీసేవా కేంద్రాలను బంద్‌ చేయనున్నట్లు తెలంగాణ మీసేవా ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కొండా శ్రీనివాస్‌ తెలిపారు. అశ్వాపురంలో ఆయన గురువారం మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పాల్వంచ పట్టణం నవభారత్‌లో మీసేవా కేంద్రాన్ని నిర్వహిస్తున్న నాగరామకృష్ణ కుటుంబం బలవన్మరణానికి పాల్పడటం దురదృష్టకరమన్నారు.

ఇదీ చదవండి: 'వనమా రాఘవను కఠినంగా శిక్షించాలి.. ఆయన తండ్రి రాజీనామా చేయాలి'

Last Updated :Jan 7, 2022, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.