అయిదు సార్లు చంపడానికి ట్రై చేసి, ఆరోసారి అంతమొందించారు

author img

By

Published : Aug 23, 2022, 8:31 AM IST

Singareni worker murder case

Singareni worker murder case వివాహమై ఆరెళ్లయింది. ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఆమె తన చిన్ననాటి స్నేహితునితో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఈ క్రమంలో తన భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. ఆరుసార్లు చంపేందుకు ప్రయత్నించారు. మొత్తానికి ఈ నెల 19న మట్టుబెట్టారు.

చిన్ననాటి మిత్రుడితో ఎఫైర్​కు అడ్డొస్తున్నాడని భర్తను చంపించిన భార్య

Singareni worker murder case: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా అయిదు సార్లు హత్యాయత్నం చేశారు. చిన్ననాటి ప్రియురాలిని పెళ్లి చేసుకోవడానికి ఆమె భర్తను చంపేందుకు పథకం పన్నిన ప్రధాన నిందితుడు బందం రాజు(26) ఘాతుకమిది.. చివరగా ఆరోసారి ప్రియురాలి సహకారంతో తుపాకీతో కాల్చి కొరుకొప్పుల రాజేందర్‌(28)ని హత్య చేశాడు. గోదావరిఖని గంగానగర్‌లో ఈ నెల 20న తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగిన హత్య కేసులో నిందితులు బందం రాజు(26), గులాం సయ్యద్‌(21), రవళి(26)లను పోలీసులు అరెస్టు చేశారు. సహకరించిన మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు పెద్దపల్లి జిల్లా ఇన్‌ఛార్జీ డీసీపీ రూపేశ్​ వెల్లడించారు.

Police reveled facts in  Singareni worker murder case
కొరుకొప్పుల రాజేందర్‌(28)

పాఠశాల స్థాయిలోనే ప్రేమ.. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేటకు చెందిన రవళి అక్కడే పదో తరగతి వరకు చదువుకుంది. పాఠశాల స్థాయిలోనే అదే గ్రామానికి చెందిన బందం రాజుతో సాన్నిహిత్యం ఏర్పడి ప్రేమ వ్యవహారం నడిచింది. రాజేందర్‌తో వివాహమైన తర్వాత కొంతకాలం ప్రేమ వ్యవహారం మరిచిపోయారు. కిష్టంపేటలోనే కూల్‌డ్రింక్‌ షాపు, మద్యం బెల్టు దుకాణం నిర్వహిస్తున్న రాజుకు ఏడాది క్రితం సామాజిక మాధ్యమంలో రవళి కలిసింది. దీంతో ఇద్దరి మధ్య పాత ప్రేమ వ్యవహారం మొదలైంది. ఈ క్రమంలోనే రవళిని పెళ్లి చేసుకుంటానని రాజు చెప్పడంతో అడ్డుగా ఉన్న భర్త రాజేందర్‌ను తప్పించాలని ఇద్దరు పథకం వేసుకున్నారు.

అదను చూసి.. శ్రీరాంపూర్‌ సింగరేణి గనిలో పనిచేసే రాజేందర్‌ రాత్రి షిఫ్టు విధులకు ద్విచక్ర వాహనంపై వెళ్లే సమయంలో రాజు బండరాయితో తలపై కొట్టి హత్యచేసే ప్రయత్నం చేశాడు. ఫలించకపోవడంతో కిష్టంపేట గ్రామానికి చెందిన గులాం సయ్యద్‌కు తన ప్రేమ కథ చెప్పుకున్న రాజు సహాయం చేయాలని కోరాడు. రవళి పుట్టింటికి వెళ్లిన సమయంలో రాజేందర్‌ ఇంటికి చేరుకున్న నిందితులు రాజు, గులాం సయ్యద్‌ ఇంటి గేటుకు కరెంటు కనెక్షన్‌ ఇచ్చి వెళ్లారు. అది కూడా విఫలం కావడంతో సయ్యద్‌ మిత్రులు మంచిర్యాలకు చెందిన వాజిద్‌, శ్రీరాంపూర్‌ ప్రాంతానికి చెందిన ఇమ్రాన్‌ సహకారంతో డ్యూటీకి వెళ్లే సమయంలో రాజేందర్‌ను అడ్డగించి కిందపడేసి ఇనుప రాడ్‌తో తలపై కొట్టి హత్య చేయాలనుకున్నారు. రాజేందర్‌ను వెంబడించి ద్విచక్ర వాహనాన్ని కాలితో తన్నారు. రాజేందర్‌ కింద పడకుండా వేగంగా శ్రీరాంపూర్‌కు వెళ్లాడు. ఇక్కడా విఫలం కావడంతో ఏవిధంగానైనా చంపాలని భావించిన రాజు మరో రోజు సయ్యద్‌, వాజిద్‌లు కలిసి ఒకే ద్విచక్ర వాహనంపై వచ్చి రాజేందర్‌ను లిఫ్టు అడిగి వెనుక కూర్చుని దాడి చేయాలని పథకం పన్నారు. ద్విచక్ర వాహనంపై వెంబడించి వెనుక నుంచి దాడి చేయడానికి ప్రయత్నించడంతో పారిపోయి తప్పించుకున్నాడు. ఇన్నిసార్లు హత్యకు ప్రయత్నించినా ఫలించడం లేదని భావించిన రాజు తన కారుతో ఇందారం ఫారెస్టు చెక్‌పోస్టు వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రాజేందర్‌ను ఢీకొట్టాడు. స్వల్ప గాయాలతో బతికి బయటపడ్డాడు. చివరకు శ్రీరాంపూర్‌ ప్రాంతానికి చెందిన జాడి అలియాస్‌ నీలాల శ్రీనును సంప్రదించిన రాజు తుపాకీ కావాలని అడిగాడు. బీహార్‌కు ఇద్దరు వెళ్లి రూ.1.5 లక్షలు చెల్లించి కొనుగోలు చేశాడు. తుపాకీతో రెండుసార్లు కాల్పులు జరిపి హత్యచేసే ప్రయత్నం చేశాడు. అందులోనూ విఫలమయ్యాడు.

ప్రియురాలితో కలిసి.. ఏ విధంగానైన రాజేందర్‌ను హత్య చేయాలనుకున్న రాజు మృతుని భార్య రవళితో మరో పథకం పన్నాడు. పూర్తి నిద్రలో ఉన్న సమయంలో తుపాకీతో కాల్చి చంపవచ్చని చెప్పాడు. రాజేందర్‌ నిద్రిస్తున్న సమయంలో తలుపులు తీసి పెట్టమన్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 19న రాత్రి 10.30 గంటలకు గులాం సయ్యద్‌తో కలిసి రాజు ద్విచక్ర వాహనంపై గంగానగర్‌ చేరుకున్నారు. 20న తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఇంట్లోకి వెళ్లిన రాజు నిద్రిస్తున్న రాజేందర్‌ కుడి కణతపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే రాజు, సయ్యద్‌ అక్కడి నుంచి పారిపోయారు. మృతుని భార్య రవళి సామాజిక మాధ్యమ డాటాను సేకరించి హత్య కేసును తక్కువ సమయంలో ఛేదించామని, దీనికి గోదావరిఖని ఒకటో పట్టణ సీఐలు రమేశ్‌బాబు, రాజ్‌కుమార్‌ వేగంగా స్పందించి నిందితులను పట్టుకున్నారని తెలిపారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. రాజేందర్‌ను హత్య చేయడానికి ప్రయత్నించిన మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామన్నారు. వారు పరారీలో ఉన్నారని వివరించారు.

"గోదావరిఖని గంగానగర్​కు చెందిన సింగరేణి కార్మికుడు కోరికొప్పుల రాజేందర్ భార్య రవళికి.. ఆమె అమ్మగారి ఊరు కిష్టంపేటకు చెందిన చిన్ననాటి మిత్రుడు రాజుతో వివాహేతర సంబంధం ఉండేది. ఆరేళ్ల కాపురంలో ఇద్దరు కుమారుల సంతానం ఉన్నప్పటికీ.. రాజుతో రవళి వివాహేతర సంబంధం కొనసాగించింది. ఈ క్రమంలోనే అడ్డుగా ఉన్న భర్త రాజేందర్​ను చంపేయాలనే ఉద్దేశంతో పలుమార్లు ప్రియుడితో కలిసి ప్రయత్నం చేసింది. చివరకు ఈ నెల 19న అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రియుడు రాజుతో పాటు అతని మిత్రుడు సయ్యద్ వచ్చి గంగానగర్​లోని తన ఇంట్లో నిద్రిస్తున్న రాజేందర్​పై తుపాకితో రెండు రౌండ్లు కణతిపై కాల్చారు." - చెన్నూరి రూపేశ్​, పెద్దపల్లి డీసీపీ

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.