'ఇంటర్వ్యూకు మేం హాజరువుతాం.. ఉద్యోగం మీరు చేసుకోండి'

author img

By

Published : Jul 13, 2022, 9:58 AM IST

proxy interviews

proxy interviews: ఏదైనా సాఫ్ట్‌వేర్‌ సంస్థలో కొలువుకు అర్జీ పెట్టుకున్నారా? ఇంటర్వ్యూలో అడిగే అంశాలపై పట్టు లేదా? మీ బదులు మరొకరు అందులో పాల్గొనాలా? మా సంస్థను సంప్రదించండి. ఆయా అంశాల్లో నిష్ణాతులు మీ తరఫున ఇంటర్వ్యూకు హాజరవుతారు. మీకు జాబు వచ్చేటట్లు చేస్తారు. ఇంటర్వ్యూ మాది...ఉద్యోగం మీది. అంటూ కొత్తరకం దందాకు తెరలేపుతున్నారు కొందరు కేటుగాళ్లు.

proxy interviews: సామాజిక మాధ్యమాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న వివిధ సంస్థల వెబ్‌సైట్లలో ఇలాంటి ప్రకటనలు కోకొల్లలు. ఒకరి బదులు మరొకరు ఇంటర్వ్యూకి హాజరుకావడం నేరమని తెలిసినా బహిరంగ ప్రకటనల ద్వారా అభ్యర్థులను ఆకర్షిస్తున్నారు. ఇలాంటి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకే ప్రత్యేకంగా సంస్థలూ స్థాపిస్తున్నారు. ప్రాక్సీ ఇంటర్వ్యూల పేరుతో జరుగుతున్న ఈ దందా పరాకాష్ఠకు చేరుకోవడంతో పోలీసులూ దృష్టి సారించారు.

పద్ధతి పాతదే కానీ: ఉద్యోగార్థులకు తగిన అర్హత ఉందో లేదో తెలుసుకునేందుకు అనేక పరీక్షలు పెడుతుంటారు. ఉద్యోగం సమర్థంగా నిర్వహించగలిగే వారినే ఎంపిక చేస్తుంటారు. ఇక్కడే కొంతమంది అభ్యర్థులు గోల్‌మాల్‌కు తెరతీసేవారు. ఒకరికి బదులు ఒకరు పరీక్ష రాసేవారు.. ఈ తంతు గతంలోనూ ఉంది. అలానే అసలు, నకిలీ అభ్యర్థులు ఇద్దరూ పరీక్ష రాసి హాల్‌టికెట్‌ నంబర్లు మాత్రం ఒకరివి మరొకరు వేసుకునేవారు. 2018 పోలీసు నియామకాల సందర్భంగా నల్గొండ పరీక్షా కేంద్రంలో ఒకరి బదులు మరో అభ్యర్థి పరీక్షల్లో పాల్గొనేందుకు ప్రయత్నించాడు.

అధికారులు ఇద్దర్నీ పట్టుకున్నారు. సాంకేతికత అందుబాటులోకి రావడంలో ఇలాంటి అక్రమాలకు ముకుతాడు పడింది. హాల్‌టికెట్‌ నంబర్లు ముద్రించిన జవాబుపత్రాలు అభ్యర్థులకు ఇవ్వడంతోపాటు వారి వేలిముద్రలనూ సరిపోల్చుకుంటున్నారు. తర్వాత విదేశాల్లో ఉద్యోగావకాశాలు పెరగడంతో చాలాకాలం ఫోన్లోనే ఇంటర్వ్యూలు నిర్వహించేవారు. దాంతో ఒకరి బదులు మరొకరు వాటికి హాజరయ్యేవారు. ప్రక్రియలో అవకతవకలు గమనించిన సంస్థలు తర్వాతి కాలంలో వ్యక్తిగత ఇంటర్వ్యూలు మొదలుపెట్టాయి. విదేశీ సంస్థలైతే వివిధ దేశాల్లో కొన్ని ప్రత్యేక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. దరఖాస్తుదారులే ఇంటర్వ్యూకు హాజరయ్యేలా చూస్తున్నాయి.

దిశ మార్చిన కరోనా: కరోనా కారణంగా వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఆపేసి ఆన్‌లైన్‌లో వాటిని ఆరంభించడంతో అక్రమార్కుల హవా మొదలైంది. కొంతకాలంగా సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలో ఉపాధి అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా పెరగడం ఆశావహులకు వరంగా మారింది. కనీస విషయపరిజ్ఞానం లేనివారూ దరఖాస్తు చేసుకుంటున్నారు. తమకు ఇన్నేళ్ల అనుభవం ఉందంటూ తప్పుడు పత్రాలు సమర్పిస్తున్నారు. వారి సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఆయా సంస్థలు ఇంటర్వ్యూలకు పిలవగానే వారు తప్పుకొని, అనుభవజ్ఞులను రంగంలోకి దింపుతున్నారు. అంటే అసలు అభ్యర్థుల తరఫున నకిలీలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటారు.

పరిశ్రమ స్థాయికి: ఇప్పుడు ప్రాక్సీ ఇంటర్వ్యూలు నిర్వహించడం చిన్నపాటి పరిశ్రమగా మారింది. సంబంధిత ప్రకటనలు సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో ఇంటర్వ్యూకి రూ.10-15వేల వరకూ గుంజుతున్నారు. ఇంకొందరు వివిధ సాఫ్ట్‌వేర్‌ కోర్సుల్లో నిపుణుల సాయంతో చిన్నపాటి పరిశ్రమనే నడుపుతున్నారు. ‘మీ తరఫున ఇంటర్వ్యూల్లో పాల్గొనేందుకు మావద్ద నిష్ణాతులు ఉన్నారు, ఉద్యోగం గ్యారంటీ’ అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు.ఇంటర్వ్యూలే కాదు.. అభ్యర్థులకు అనుభవమున్నట్లు తెలిపే పత్రాలు, వేతనం తీసుకున్నట్లు చెప్పే పే స్లిప్పుల వంటివీ సమకూర్చుతామని ఆయా సంస్థలు ప్రకటనలు ఇస్తున్నాయి.

నాణ్యత దెబ్బతింటోంది: నాగేశ్వర గుప్తా, ఎండీ, జెటా మైన్‌ ల్యాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

ఇతరులతో ఇంటర్వ్యూలు చేయించి, అవగాహన లేనివారు ఉద్యోగాల్లో చేరుతుండటం వల్ల పనినాణ్యత దారుణంగా దెబ్బతింటోంది. అనేక తప్పులు దొర్లి మొత్తం ప్రాజెక్ట్‌పై ప్రభావం పడుతోంది. ఇది అంతర్జాతీయ స్థాయిలో భారత సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలపై చులకనభావం ఏర్పడేలా చేస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదోలా నకిలీలు ఇంటర్వ్యూలకు హాజరవుతూనే ఉన్నారు. ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటే తప్ప దీన్ని అడ్డుకోవడం కష్టం.

ఫిర్యాదు వస్తే చర్యలు: కేవీఎన్‌ ప్రసాద్‌, ఏసీపీ, సైబర్‌ క్రైమ్స్‌, హైదరాబాద్‌

ప్రాక్సీ ఇంటర్వ్యూలకు సంబంధించి మాకూ సమాచారం ఉంది. తగిన ఆధారాలతో ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్పక చర్యలు తీసుకుంటాం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.