పాతబస్తీ మైనర్ బాలిక అపహరణ, అత్యాచారం కేసులో ముమ్మర దర్యాప్తు.. ఇద్దరు అరెస్టు

author img

By

Published : Sep 15, 2022, 8:54 PM IST

Updated : Sep 15, 2022, 9:01 PM IST

హైదరాబాద్‌

Gang Rape In Old City Latest News: పాతబస్తీ డబీర్‌పురా మైనర్ బాలిక అపహరణ, అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈనెల 12న రాత్రి బాలికను కారులో హోటళ్లకు తీసుకెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా పోలీసులు గుర్తించారు. నిబంధనలు పాటించకుండా మైనర్‌ను హోటలకు అనుమతించినవారిపై కేసులు నమోదు చేశారు.

Gang Rape In Old City Latest News: హైదరాబాద్‌ పాతబస్తీలో కలకలం రేపిన మైనర్ బాలిక అపహరణ అత్యాచారం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఘాతుకానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. బాధితురాలికి తండ్రి లేకపోవడంతో తల్లితో కలిసి చంచల్‌గూడాలోని అమ్మమ్మ ఇంటి వద్దనే ఉంటున్నారు. ఈనెల 12న రాత్రి 8 గంటల సమయంలో మందుల కోసం బాలికను ఆమె తల్లి మందుల దుకాణానికి పంపింది.

తర్వాత బాలిక తిరిగి రాకపోవడంతో పలు చోట్ల వెతికిన తల్లి చివరకు 13న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక వెళ్లిన ప్రాంతంలో సీసీ కెమెరాలు పరిశీలించారు. ఆమె ఓ కారులో ఎక్కడం గమనించి కిడ్నాప్‌గా కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పోలీసులు బాలిక కోసం గాలించారు. కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలో బాలిక తల్లికి నిందితులు ఈనెల 14న ఫోన్ చేశారు.

బాలిక తమ వద్దనే ఉందని చెప్పి చాదర్‌ఘాట్‌ సమీపంలో వదిలివెళ్లారు. అక్కడి నుంచి పోలీసులు బాధితురాలిని డబీర్‌పురా స్టేషన్‌కు తరలించారు. ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. తనకు వచ్చిన ఫోన్‌నంబర్‌ను బాధితురాలి తల్లి పోలీసులకు ఇవ్వడంతో.. నంబర్ ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నిందితులు రీన్‌బజార్‌ షా కాలనీకి చెందిన రావిష్ మెహది, అతని స్నేహితుడు రియాసత్ అహ్మద్‌గా గుర్తించారు. వారిని అరెస్ట్ చేసిన రిమాండ్‌కు తరలించారు.

కేసు దర్యాప్తులో వెలుగులోకి కీలక అంశాలు: కేసు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు బాలికను రెండు హోటళ్లకు తరలించినట్లు తేలింది. బాలికను తీసుకుని లోపలికి వెళ్లిన నిందితులు కొద్దిసేపటి తర్వాత ఆమెను గదిలో ఉంచి బయటకి వెళ్లారు. తాళం లోపలే ఉండడంతో తలుపు బద్దలుకొట్టారు. దీంతో నిర్వాహకులు వారిని బయటకి పంపించారు. కారులో హోటల్‌కు తీసుకెళ్లి తన చేతికి ఇంజెక్షన్ ఇచ్చారని, నాలుగు మాత్రలు మింగించారని బాధితురాలు పోలీసులకు తెలిపింది.

అనంతరం మద్యం తాగించి తనపై అత్యాచారం చేశారని వివరించింది. దీంతో కిడ్నాప్ కేసుతో పాటు నిందితులపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ బాలిక తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. మైనర్​ను అత్యాచారం చేసిన నిందితులను శిక్షించాలంటూ మహిళా కాంగ్రెస్ నేతలు డబీర్‌పురా పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళన చేశారు.

"బాలిక గురించి 13నాడు ఫిర్యాదు వచ్చింది. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశాం. మరిన్ని విషయాలు దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే కేసు వివరాలు వెల్లడిస్తాం." -కోటేశ్వరావు డబీర్‌పురా సీఐ

పాతబస్తీ మైనర్ బాలిక అపహరణ, అత్యాచారం కేసులో ముమ్మర దర్యాప్తు.. ఇద్దరు అరెస్టు

ఇవీ చదవండి: తాగి చస్తావా...? అన్నందుకు భార్యనే చంపిన భర్త.. ఆపై సూసైడ్​గా చిత్రీకరించి..

చెట్టుకు వేలాడుతూ దళిత మైనర్ల మృతదేహాలు.. రేప్ చేసి హత్య.. దివ్యాంగురాలిపై దారుణం

Last Updated :Sep 15, 2022, 9:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.