విచ్చలవిడిగా గ్లైఫోసెట్​ అమ్మకాలు.. ఏఓల నిర్లక్ష్యమే కారణం

author img

By

Published : Jun 21, 2021, 11:23 AM IST

glyphosate-sales-in-jayashankar-bhupalpally

బీటీపత్తి తప్పా.. మిగతా అన్ని మొక్కలను మాడ్చేసి చంపేసే అత్యంత విషపూరిత ‘గ్లైఫోసెట్‌’ రసాయన మందుల అమ్మకాలను వ్యవసాయశాఖ నిషేధించినా క్షేత్రస్థాయిలో ఏఓలు నియంత్రించలేకపోతున్నారు. ఈ మందులను నిల్వ చేయకుండా ఏఓలు ప్రతి దుకాణానికి వెళ్లి తనిఖీ చేయాలి. కానీ, వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి.

క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వ్యవసాయాధికారు(ఏఓ)ల నిర్లక్ష్యం.. రైతుల ప్రాణాలకు, పర్యావరణానికి తీవ్ర ముప్పును తెచ్చిపెడుతోంది. కలుపును చంపే ‘గ్లైఫోసెట్‌’ రసాయనాన్ని తట్టుకుని బతికే(హెర్బిసైడ్‌ టాలరెంట్‌-హెచ్‌టీ) పత్తి వంగడాలను నాటే ప్రతి రైతూ ఈ మందును కొంటున్నారు. అసలు హెచ్‌టీ పత్తి విత్తనాలకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. అయినా అక్రమంగా కొన్ని కంపెనీలు అమ్ముతున్నాయి. కలుపు సమస్య ఉండదని ప్రచారం చేస్తూ ఈ విత్తనాలను గ్రామాల్లో వ్యాపారులు విచ్చలవిడిగా రైతులకు అమ్ముతున్నారు. ఈ విత్తనాలు కొంటే తప్పనిసరిగా గ్లైఫోసెట్‌ వాడాల్సిందేనని అంటగడుతున్నారు.

తాజాగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మల్హర్‌ మండలం గాదెంపల్లిలోని శ్రీనివాస పురుగుమందుల దుకాణం వ్యాపారి పెద్దపల్లి మండలం రంగాపూర్‌కు 14 లీటర్ల గ్లైఫోసెట్‌ను తరలిస్తుండగా పోలీసులు వాహన తనిఖీల్లో పట్టుకున్నారు. వారు లోతుగా విచారణ చేస్తే జయశంకర్‌ జిల్లా మహదేవ్‌పూర్‌ మండల కేంద్రంలోని ఆరాధన ఎరువుల దుకాణంలో నిల్వచేసిన మరో 660 లీటర్ల మందు నిల్వలు బయటపడ్డాయి. లీటరును రూ.420 చొప్పున రైతులకు విక్రయిస్తున్నట్లు తేలింది. హైదరాబాద్‌ ఆటోనగర్‌లోని ఓ గోదాములో నిల్వల నుంచి వీరికి సరఫరా చేశారు.

క్యాన్సర్‌ కారకమని అమెరికాలో గుర్తింపు

గ్లైఫోసెట్‌ అన్ని రకాల మొక్కలను, పచ్చిగడ్డిని మలమల మాడ్చి చంపేస్తుంది. ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో గడ్డిని చంపడానికి తరచూ ఈ మందును చల్లడం వల్ల తనకు క్యాన్సర్‌ వచ్చిందని, మందు తయారీ కంపెనీ నుంచి పరిహారం ఇప్పించాలని ఓ వ్యక్తి అక్కడి కోర్టును ఆశ్రయించాడు. క్యాన్సర్‌ రావడానికి ఈ మందే కారణమని కోర్టు నిర్ధారించి పరిహారం ఇవ్వాలని తీర్పు చెప్పింది. మనదేశంలో కేవలం తేయాకు తోటల్లో పచ్చిగడ్డిపై లేదా ఎలాంటి పంటలు లేని మైదానాల్లో గడ్డిని చంపడానికి మాత్రమే గ్లైఫోసెట్ రసాయనాన్ని చల్లాలని కేంద్రం అనుమతించింది. ఈ మందును తెలంగాణలో ఏ పంటలోనూ వాడవద్దని వ్యవసాయశాఖ ఏటా ఉత్తర్వులు జారీచేస్తోంది.

ఈ మందులను నిల్వ చేయకుండా ఏఓలు ప్రతి దుకాణానికి వెళ్లి తనిఖీ చేయాలి. కానీ, వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. ఈ వానాకాలంలో 75 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో సగానికి పైగా హెచ్‌టీ విత్తనాలతో సాగుచేస్తారని ఏఓలు అనధికారికంగా చెబుతున్నారు. ‘లక్షలాది ఎకరాల్లో ఈ మందును చల్లేటప్పుడు రైతుల ఆరోగ్యం గుల్లవుతుంది. దాని ప్రభావంతో పర్యావరణానికి సైతం ముప్పు వాటిల్లుతుంది’ అని ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్త ఒకరు ‘ఈనాడు’కు చెప్పారు.

ఇదీ చూడండి: నిర్లక్ష్యంతో ప్రాణాలు పోగోట్టుకుంటున్న వాహనదారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.