యూట్యూబ్‌లో చూసి రూ.2000 నోట్ల తయారీ.. చివరికి..!

author img

By

Published : Nov 18, 2022, 9:41 PM IST

Gang was arrested for printing fake currency notes watching on YouTube

Fake currency notes printing: ఈ ఆధునిక కాలంలో మంచికైనా.. చెడుకైనా.. టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అన్ని విషయాలు ఆ సామాజిక మాధ్యమాల నుంచే నేర్చుకుంటున్నారు. అయితే కొందరు వ్యక్తులు ఏకంగా యూట్యూబ్‌లో రూ.2000 నోట్లు తయారు చేయడం ఎలా అని తెలుసుకున్నారు. ఆ విధంగా తన ప్రయత్నాలను చేశారు. కానీ చివరికి ఏం జరిగిందంటే..?

Fake currency notes printing: యూట్యూబ్ సహాయంతో నకిలీ నోట్లను ముద్రిస్తున్న ముఠాను వరంగల్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యూట్యూబ్ సహాయంతో నకిలీ నోట్లను ముద్రించి వివిధ ప్రాంతాల్లో చెలామణి చేస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్‌, సుబేదారి పోలీసులు కలిసి పట్టుకున్నారు. ఈ ముఠా నుంచి 300ల రూ.రెండు వేల నోట్లు (ఆరు లక్షలు), కలర్ ప్రింటర్, ఏడు సెల్‌ఫోన్‌లు, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు నకిలీ నోట్ల తయారీకి వినియోగించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఇందుకు సంబంధించిన విషయాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి వివరించారు. పోలీసులు అరెస్ట్ చేసిన సయ్యద్ యాకుబ్ అలియాస్ షకీల్, గడ్డం ప్రవీణ్, గుండా రజనీ గతంలో కిడ్నాప్ కేసులో రామగుండం సబ్ జైలులో శిక్ష అనుభవించారని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఈ సమయంలోనే వీరికి దొంగ నోట్లు ముద్రించే ముఠా సభ్యులతో పరిచయం ఏర్పడిందని పేర్కొన్నారు. వారి ద్వారా దొంగ నోట్లు ముద్రించే తీరును తెలుసుకున్న నిందితులు.. జైలు నుంచి విడుదలైన అనంతరం సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో ఈ మార్గాన్ని ఎంచుకున్నారని సీపీ వెల్లడించారు.

వీరు ముద్రించే ఈ నోట్ల గురించి ఎవరికి అనుమానం కలగకుండా ఉండేందుకు ఈ ముఠా యూట్యూబ్‌ను అనుసరించడంతో పాటు.. ఒరిజినల్‌గా రూ.రెండు వేలు ముద్రించే కాగితాన్ని పోలి ఉండే కాగితాన్ని కొనుగోలు చేసి వీటిని ముద్రించారని సీపీ తెలిపారు. నిందితులు ముద్రించిన నకిలీ నోట్లను రద్దీ ఉండే వ్యాపార సముదాయాలతో పాటు కిరాణ, బట్టల షాపులు, మద్యం బెల్ట్ షాపుల వద్దకు వెళ్లి చలామణి చేసేవారన్నారు. గత సంవత్సర కాలంగా నిందితులు వరంగల్ పోలీస్ కమిషనరేట్‌తో పాటు చుట్టు పక్కల జిల్లాల్లోనూ నకిలీ నోట్లను వినియోగించారు. ఈ విధంగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారు. ఈ రోజు ఉదయం ప్రధాన నిందితుడు ఆ ముఠాకే చెందిన మరో వ్యక్తితో కలిసి దొంగనోట్లను చెలామణి చేసేందుకు ద్విచక్ర వాహనంపై సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుమల్ బార్ వద్దకు వచ్చినట్లుగా పోలీసులకు సమాచారం అందడంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా అసలు నిజం బయటపడిందన్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో మిగతా వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నకిలీ నోట్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని సీపీ తరుణ్‌ జోషి తెలిపారు. వీరిపై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.