Gandhi Hospital Rape: 'గాంధీ'లో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం... పోలీసుల అదుపులో నలుగురు

author img

By

Published : Aug 17, 2021, 1:24 PM IST

Updated : Aug 17, 2021, 3:06 PM IST

Gandhi Hospital rape case

13:20 August 17

గాంధీ ఆస్పత్రి ఘటనలో పోలీసుల అదుపులో నలుగురు

గాంధీ ఆస్పత్రి ఘటనలో నలుగురు నిందితులను చిలకలగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో టెక్నిషియన్‌ ఉమామహేశ్వర్‌, సెక్యూరిటీ సిబ్బందితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ నలుగురిని పోలీసులు విచారిస్తున్నారు.

విచారణకు ఆదేశం..

గాంధీ ఆస్పత్రిలో అత్యాచార ఆరోపణలపై విచారణకు సూపరింటెండెంట్‌ రాజారావు ఆదేశించారు. ఈ ఘటనపై కమిటీ వేశామని ఆయన స్పష్టం చేశారు. అత్యాచారం జరిగిందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గాంధీలో 189 సీసీ కెమెరాలు ఉన్నాయన్న సూపరింటెండెంట్‌... ఆరోపణలు రుజువు కాకుండా అసత్య ప్రచారం చేయవద్దని కోరారు.

సీసీ కెమెరా మాయం!

ఈ ఘటనపై పోలీసులు... బాధిత మహిళ కనిపించిన స్థలంలో ఆధారాలు సేకరించారు. అయితే ఓపీ పక్కన ఉన్న షెడ్‌లో ఎక్కడా సీసీ కెమెరా కనిపించకపోవడం గమనార్హం.  

ముమ్మర గాలింపు

మరోవైపు బాధితురాలి సోదరి కోసం పోలీస్‌ బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. గాంధీ ఆస్పత్రిలో అత్యాచారం జరిగిందని ఓ యువతి సోమవారం ఫిర్యాదు చేశారు. తనతో పాటు అక్క పైనా అత్యాచారం జరిగిందని ఆమె తెలిపారు.  

ఏం జరిగింది?

మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మూత్రపిండాల వ్యాధితో ఈ నెల 5న గాంధీ ఆసుపత్రిలో చేరారు. భార్య, మరదలు ఆయనకు సహాయకులుగా వచ్చారు. కుమారుడు రోజూ ఆస్పత్రికి వచ్చి వెళ్లేవాడు. ఆసుపత్రిలోని రేడియోగ్రాఫర్‌ ఉమామహేశ్వర్‌ ఆ మహిళలకు దూరపు బంధువుకావడంతో.. వారు అతడితో మాట్లాడేవారు. ఈ నెల 8 నుంచి అక్కాచెల్లెళ్లిద్దరూ కనిపించలేదు. రోగి కుమారుడు వెళ్లి ఉమామహేశ్వర్‌ను అడగ్గా.. విషయం వెలుగులోకి వచ్చింది.

దర్యాప్తు ముమ్మరం

ఉమామహేశ్వర్‌ ఈ నెల 8న ఆ మహిళలను ఒక గదికి తీసుకెళ్లి కల్లులో మత్తుమందు కలిపి తాగించాడని తెలుస్తోంది. వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత.. ఉమామహేశ్వర్‌తో పాటు మరికొందరు వారిపై సామూహికంగా అత్యాచారం చేశారని బాధితురాలు తెలిపారు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారని వెల్లడించారు. మర్నాడు వారిద్దరినీ సెల్లార్‌లోని చీకటి గదిలోకి తీసుకెళ్లి మరోమారు అఘాయిత్యానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అనంతరం నగరంలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లారని చెప్పారు. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు... దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు. 

కాంగ్రెస్ నిరసన...

మహిళలపై అత్యాచారాలను ఖండిస్తూ మహిళా కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. గాంధీ ఆసుపత్రి ఘటనను ఖండిస్తూ... ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు మహిళ కాంగ్రెస్ నాయకులు మౌనదీక్ష చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన పై మహిళ మంత్రులు స్పందించకపోవడం దారుణమని ఆవేదన వెలిబుచ్చారు. తెరాస ప్రభుత్వ హయాంలో మహిళ పై అత్యాచారాలు, దాడులు పెరిగాయని ఆరోపించారు. దళిత బంధులు కాదు.. మహిళకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: GANDHI HOSPITAL: గాంధీలోనే కాదు.. అన్ని ఆస్పత్రుల్లోనూ రాత్రయితే అదే భయం!

Last Updated :Aug 17, 2021, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.