Karimnagar Accident today : చెట్టును ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మరణం

author img

By

Published : Nov 26, 2021, 7:24 AM IST

Updated : Nov 26, 2021, 10:57 AM IST

కరీంనగర్‌ జిల్లాలో ప్రమాదం, చెట్టును ఢీకొట్టిన కారు, కరీంనగర్ రోడ్డు ప్రమాదం, Karimnagar road accident

07:22 November 26

కరీంనగర్‌ జిల్లాలో ప్రమాదం.. నలుగురు దుర్మరణం

Karimnagar Accident today  : కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.  చెట్టును కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఉండగా... వారి బంధువు సహా కారు డ్రైవర్‌ చనిపోయారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నగిరికి చెందిన అన్నదమ్ములు కొప్పుల శ్రీనివాస్‌రావు, కొప్పుల బాలాజీ శ్రీధర్‌... ప్రస్తుతం కరీంనగర్‌లోని జ్యోతినగర్‌లో నివాసముంటున్నారు. ఖమ్మంజిల్లా కల్లూరులో బంధువుల ఇంట్లో జరిగిన దశదినకర్మకు... తమ బంధువులైన సుధాకర్‌రావు, శ్రీరాజ్‌తో కలిసి శ్రీనివాస్‌రావు, బాలాజీ శ్రీధర్‌.... కారులో వెళ్లారు.

చెట్టును ఢీకొట్టిన కారు.. 

తిరిగి వచ్చే క్రమంలో కరీంనగర్‌ జిల్లా మానకొండూరు సమీపంలోకి రాగానే... వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ జలంధర్‌తో పాటు శ్రీనివాస్‌రావు, బాలాజీ శ్రీధర్‌, శ్రీరాజ్‌లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారులో ఉన్న పెంచాల సుధాకర్‌రావు తీవ్రంగా గాయపడ్డాడు.

ప్రమాదానికి అదే కారణం..

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి పంపించారు. గాయపడిన వ్యక్తి సుధాకర్ రావును కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతులను.. డ్రైవర్ జలంధర్, కొప్పుల బాలాజీ శ్రీధర్, కొప్పుల శ్రీనివాసరావు, శ్రీరాజ్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో కారు నడపడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కారు చెట్టును ఢీకొట్టిన సమయంలో బెలూన్లు తెరుచుకున్నా.. నలుగురు చనిపోయారంటే ప్రమాదానికి అత్యంత వేగమే కారణం కావొచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. 

కేటీఆర్ దిగ్భ్రాంతి..

మృతుల్లో ఒకరైన శ్రీనివాస్‌రావు.. సిరిసిల్లలో పంచాయతీ రాజ్ ఈఈగా పనిచేస్తుండగా.. అతని సోదరుడు బాలాజీ శ్రీధర్‌... పెద్దపల్లిలో అడ్వకేట్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరు అన్నదమ్ములు చనిపోవటంతో.. బాధిత కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. సిరిసిల్ల ఈఈ శ్రీనివాస రావు మృతిపట్ల రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 

6 నెలల్లో 4సార్లు కెమెరాకు చిక్కింది

ప్రమాదానికి గురైన కారు.... 'TS 02 ER 7477' పై ఇప్పటి వరకు 4వేల 140 రూపాయల చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఆర్నెళ్ల కాలంలో ట్రాఫిక్‌ పోలీసుల కెమెరాకు చిక్కిన ప్రతిసారి అతివేగంతో వెళ్తున్నట్లు రికార్డైంది. 'ఆన్‌ గౌట్‌ డ్యూటీ' బోర్డుతో పేరుతో నడుస్తున్న ఈ కారు... నిబంధనలకు విరుద్ధంగా 100 స్పీడ్‌ను దూసుకువెళ్తూ..... ఆర్నెళ్ల కాలంలోనే 4సార్లు కెమెరాకు చిక్కింది.

Last Updated :Nov 26, 2021, 10:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.