Road Accidents in TS: మద్యం మత్తు.. అతివేగం.. నిర్లక్ష్యం.. 15 మంది దుర్మరణం

author img

By

Published : Dec 19, 2021, 5:58 AM IST

Road Accidents in TS

రాష్ట్రంలో శనివారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 15 మంది కన్నుమూశారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో అయిదేళ్ల లోపు చిన్నారులు ముగ్గురు ఉండటం విషాదం. హైదరాబాద్‌ గచ్చిబౌలి ప్రాంతంలో ముగ్గురిని బలిగొన్న ప్రమాదానికి మద్యం మత్తు, నిర్లక్ష్యం ప్రధాన కారణాలు కాగా.. ఏడుగురిని కబళించిన కామారెడ్డి దుర్ఘటనకు అతివేగం హేతువుగా కనిపిస్తోంది. ఇదే జిల్లాలో ద్విచక్రవాహనం అదుపుతప్పి ఇద్దరు మరణించారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలో క్వారీ లోయలోకి టిప్పర్‌ ప్రమాదవశాత్తు జారిపడటంతో ముగ్గురు మృతిచెందారు. ఈ ప్రమాదాలు మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి.

అతి వేగమే వారి పాలిట శాపమైంది. కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని క్వాలిస్‌ వాహనం ఢీకొని ఏడుగురు దుర్మరణం చెందారు. పెద్దకొడప్‌గల్‌ మండలం జగన్నాథపల్లి గేట్‌ వద్ద శనివారం మధ్యాహ్నం ఈ ఘోరప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు మరణించగా.. మరో అయిదుగురు తీవ్ర గాయాలపాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. మృతుల్లో హుస్సేన్‌ (27), ఆయన భార్య తస్లీమా బేగం (25), అతడి స్నేహితుడు మహ్మద్‌ అమీర్‌తాజ్‌ (28), భార్య సనా ఫర్వీన్‌ (20), వీరి పిల్లలు హురియా ఫాతిమా (ఏడాదిన్నర), హనన్‌ఫాతిమా (4 నెలలు) ప్రమాద స్థలిలోనే ప్రాణాలు విడిచారు. తీవ్రగాయాల పాలైన మహ్మద్‌హుస్సేన్‌ కుమార్తె హూరా బేగం (5) చికిత్స పొందుతూ కన్నుమూసింది. హజీరా బేగం (9), హాదీ (8), హిబా బేగం (4), సుల్తాన్‌హుస్సేన్‌ (3)లతో పాటు అమీర్‌తాజ్‌ బంధువు ఆస్మా (12)లు నిజామాబాద్‌ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రమాదం జరిగిందిలా..!

హైదరాబాద్‌ పరిధిలోని చాదర్‌ఘాట్‌-మూసానగర్‌, వినాయకవీధి-రసూల్‌పురాలకు చెందిన మహ్మద్‌హుస్సేన్‌-మహ్మద్‌ అమీర్‌తాజ్‌లు స్నేహితులు. ఇరు కుటుంబాలకు చెందిన 12 మంది కలిసి వాహనంలో శుక్రవారం రాత్రి మహారాష్ట్రలోని నాందేడ్‌ సమీపంలోని కందార్‌ దర్గాకు వెళ్లారు. శనివారం ఉదయం దర్శనం అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. వారంతా కామారెడ్డి జిల్లా పెద్దకొడప్‌గల్‌ మండలం జగన్నాథపల్లి గేట్‌ సమీపంలోకి రాగానే ఎస్‌ఎన్‌ఏ (సంగారెడ్డి-నాందేడ్‌-అకోలా) 161వ జాతీయ రహదారి పక్కన ఆపి ఉన్న లారీని ఢీకొట్టారు ఇంటికి తొందరగా చేరుకోవాలని వారు వేగంగా ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో వీరి క్వాలిస్‌ వాహనం నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా ఒక చిన్నారి ఆసుపత్రిలో కన్నుమూసింది. మిగిలిన వారు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది.

మరో ప్రమాదంలో ఇద్దరు మృతి

ఈ ప్రమాదం జరిగిన మరో గంటకే అదే నియోజకవర్గంలోని జుక్కల్‌ మండలం ఖండేబల్లూర్‌ గ్రామ శివారులో మరో దుర్ఘటనలో ఇద్దరు మరణించారు. ద్విచక్ర వాహనం అదుపు తప్పి ట్రాక్టర్‌ కల్టివేటర్‌పై పడి కేమ్‌రాజ్‌కల్లాలి గ్రామానికి చెందిన రెడ్డెం సాయిలు (25), జింగే శివుగొండ (33)లు దుర్మరణం చెందారు.

చెట్టుకు ఢీకొని రెండు ముక్కలైన కారు... ముగ్గురి దుర్మరణం
వారిలో ఇద్దరు యువతులు జూనియర్‌ ఆర్టిస్టులు

హైదరాబాద్‌ గచ్చిబౌలి వద్ద చెట్టుకు ఢీకొని రెండు ముక్కలైన కారు

ఈనాడు, హైదరాబాద్‌ గచ్చిబౌలి, న్యూస్‌టుడే: గంటకు 150-180 కిలోమీటర్ల వేగం.. అప్పటికే తలకెక్కిన మత్తు. కారును నియంత్రించలేక చెట్టును ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. హైదరాబాద్‌ గచ్చిబౌలి-హెచ్‌సీయూ మార్గంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు రెండు ముక్కలైందంటే ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఎయిర్‌ బెలూన్లు బయటకు వచ్చినా ప్రాణాలు దక్కలేదు. ప్రమాదానికి మితిమీరిన వేగమే కారణమని పోలీసులు నిర్ధారించారు.

గచ్చిబౌలి సమీపంలోని జె.వి.కాలనీ అపార్ట్‌మెంట్‌లో ప్రసాద్‌, సాయిసిద్ధ్‌ నివాసం ఉంటున్నారు. జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న సాయిసిద్ధ్‌ వెబ్‌సీరిస్‌లో నటిస్తున్నాడు. అక్కడే జూనియర్‌ ఆర్టిస్టులుగా పనిచేస్తున్న ఎన్‌.మానస (కర్ణాటక), ఎం.మానస (మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల) పరిచయమయ్యారు. వీరిద్దరూ అమీర్‌పేట్‌లోని ప్రైవేటు వసతిగృహంలో ఉంటున్నారు. శుక్రవారం సాయంత్రం షూటింగ్‌ ముగిశాక జె.వి.కాలనీలోని ప్రసాద్‌ ఫ్లాట్‌కు చేరారు. సరదాగా పార్టీ చేసుకోవాలనుకున్నారు. దీనికి అమీర్‌పేట్‌ హాస్టల్‌లో ఉంటున్న ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి, విజయవాడకు చెందిన అబ్దుల్‌ రహీంను సాయిసిద్ధ్‌ ఆహ్వానించాడు. సాయిసిద్ధ్‌ మినహా నలుగురూ అర్ధరాత్రి వరకూ మద్యం తాగారు. తర్వాత హెచ్‌సీయూ సమీపాన హోటల్‌లో టీ తాగేందుకు వెళ్లాలనుకున్నారు. ప్రసాద్‌ ఫ్లాట్‌లోనే ఉండిపోగా మిగిలిన నలుగురూ కలసి శనివారం తెల్లవారుజామున కారులో బయల్దేరారు. అబ్దుల్‌రహీమ్‌ కారు నడుపుతున్నాడు. హెచ్‌సీయూ వైపు బయల్దేరారు. స్నేహితులు వద్దని వారించినా అబ్దుల్‌రహీం కారు వేగం పెంచాడు. గంటకు 180-200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఎదురుగా ఉన్న చెట్టును ఢీకొట్టాడు. తీవ్రతకు కారు(హ్యుందాయ్‌ వర్నా) ఐదు అడుగుల పైకి లేచి రెండు ముక్కలైంది. వాహనం నడుపుతున్న అబ్దుల్‌ రహీం(24), జూనియర్‌ ఆర్టిస్టులు ఎన్‌.మానస (21), ఎం.మానస(19) అక్కడికక్కడే మరణించారు. మరో జూనియర్‌ నటుడు సాయిసిద్ధ్‌(24) గాయపడ్డాడు. స్థానికులు ఫోన్‌ చేయటంతో గచ్చిబౌలి ఎస్‌ఐ వెంకటరెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సాయిసిద్ధ్‌ను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్టు ఇన్‌స్పెక్టర్‌ జి.సురేష్‌ తెలిపారు. వైద్య పరీక్షల్లో సాయిసిద్ధ్‌ మద్యం తీసుకున్నట్టు ఆనవాళ్లు లభించలేదన్నారు.

ఎం.మానస ఎన్‌.మానస అబ్దుల్‌ రహీం

జూమ్‌యాప్‌లో అద్దెకు కారు

ప్రమాదానికి గురైన కారును మూడ్రోజుల క్రితం జూమ్‌యాప్‌లో నవీన్‌ అనే వ్యక్తి అద్దెకు తీసుకున్నాడు. అప్పటి నుంచి దానిని అబ్దుల్‌ రహీం వాడుతున్నాడు. ప్రమాదం అనంతరం నవీన్‌కు పోలీసులు ఫోన్‌ చేసి విచారణకు రావాల్సిందిగా కోరారు. ఆ తరువాత అతడి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయినట్టు సమాచారం. ప్రమాదానికి ముందు ఏం జరిగింది? కారులో ముగ్గురి మధ్య ఏమైనా గొడవ చోటు చేసుకుందా? నలుగురు బయటకు రావటానికి కారణాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. కాగా ఈ కారుపై రూ.14,625ల చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. వీటిలో ఎక్కువ అతివేగానికి సంబంధించినవే కావడం గమనార్హం.

మత్తులో డ్రైవింగ్‌ వద్దని వారించినా విన్లేదు

‘‘శుక్రవారం రాత్రి దాటాక అందరం కలసి ప్రసాద్‌ గదిలోనే పార్టీ చేసుకున్నాం. కారులో బయల్దేరే సమయానికే నలుగురూ పరిమితికి మించి తాగారు. నేను మద్యం ముట్టలేదు. అబ్దుల్‌ రహీమ్‌ నడవలేక తూలుతున్నాడు. మత్తులో డ్రైవింగ్‌ వద్దని, పోలీసులు పట్టుకుంటారని వారించినా విన్లేదు’’ అని ప్రమాదం నుంచి బయటపడిన సాయిసిద్ధ్‌ తెలిపాడు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు మీడియాతో మాట్లాడాడు.

అయిదేళ్ల కిందట తల్లి.. ఇప్పుడు కుమార్తె

గచ్చిబౌలి ప్రమాదంలో మరణించిన మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లకు చెందిన యువతి మాడమోని మానస కుటుంబంలో విషాదం నెలకొంది. అయిదేళ్ల కిందట ఆమె తల్లి బాలమణి కూడా రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందారు. పెట్రోలు బంకులో పనిచేసే తండ్రి రవీందర్‌కు మానస ఆర్థికంగా అండగా ఉండేది. ఇటీవల జడ్చర్లకు వచ్చిన ఆమె శుక్రవారం ఉదయమే తిరిగి హైదరాబాద్‌కు వెళ్లింది. కుమార్తె దుర్మరణంతో రవీందర్‌ కన్నీటిపర్యంతం అయ్యారు.

లోయలోకి జారిన టిప్పర్‌.. ముగ్గురి దుర్మరణం

క్వారీలోయలో పడిన టిప్పర్‌

మడికొండ, న్యూస్‌టుడే: క్వారీ లోయలోకి టిప్పర్‌ జారిపడి ముగ్గురు యువకులు మరణించారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి శివారులో శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. మడికొండ పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండకు చెందిన తోకల ముఖేష్‌ (23), కేసముద్రం మండలం ఇనుగుర్తికి చెందిన చిత్రం చందు (21), బిహార్‌కు చెందిన ఎండీ.అఖీం (24) తరాలపల్లిలోని గాయత్రీ క్వారీలో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. శనివారం తెల్లవారుజామున మూడుగంటల సమయంలో క్వారీ వద్ద టిప్పర్‌ లారీలో ఉన్న రాళ్లను గుట్టపై నుంచి లోయలోకి విడిచేందుకు ముఖేష్‌ బండి తీశారు. చలి ఎక్కువగా ఉండటంతో పక్కనే ఉన్న ఇతర వాహనాల డ్రైవర్లు చందు, అఖీం టిప్పర్‌ క్యాబిన్‌లో కూర్చున్నారు. రాళ్లను జారవిడుస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు వాహనం లోయలో జారిపడింది. దాని కింద చిక్కుకుని చందు, అఖీం అక్కడికక్కడే మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న ముఖేష్‌ను ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటికే ఆయన కూడా మరణించారు.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.