Sand Mafia: అర్ధరాత్రి జేసీబీలతో మట్టి తవ్వి ట్రాక్టర్లతో తరలింపు!

author img

By

Published : Jul 29, 2021, 9:20 AM IST

Sand Mafia

ఏపీ రాజధాని ప్రాంతంలో కంకర, ఇసుకను తవ్వి తీసుకెళ్తున్న ఘటనలు ఇటీవల చూశాం. ఇప్పుడు ఏకంగా మట్టిని కూడా తవ్వి తోడేస్తున్నారు. అర్ధరాత్రి జేసీబీలతో తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. సచివాలయం సమీపంలోనే దుండగులు ఈ చర్యకు పాల్పడ్డారు. రైతులు అడ్డుకునేందుకు వెళ్లేలోపు పరారయ్యారు.

ఆంధ్రప్రదేశ్​లో మొన్న రోడ్డును తవ్వి కంకర ఎత్తుకెళ్లారు. నిన్న హైకోర్టు న్యాయమూర్తుల భవనాలు, ఇతర నిర్మాణాల కోసం నిల్వచేసిన ఇసుక తోడుకెళ్లారు. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర సచివాలయం సమీపంలోనే నల్లమట్టి తవ్వి తీసుకెళ్లారు. వెలగపూడి సచివాలయం వెనుకభాగంలో రోడ్డు నెం.6 సమీపంలోని భూముల్లో మట్టిని అర్ధరాత్రి సమయంలో కొందరు జేసీబీలతో తవ్వి ట్రాక్టర్లతో తరలించారు. విషయం తెలుసుకున్న అమరావతి దళిత ఐకాస నాయకులు, రైతులు మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఘటనా స్థలానికి వెళ్లారు. వారిని గమనించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. వాహనాల లైట్లు ఆపేసి వెళ్లిపోయారని రైతులు తెలిపారు. మట్టి తవ్వకాలను నిరసిస్తూ రైతులు అక్కడే కొద్దిసేపు నినాదాలు చేశారు. అమరావతిని నాశనం చేసేందుకే ఇలా వరుస విధ్వంసాలకు ఒడిగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మేం రాగానే.. వాహనాలతో పరారీ

‘మట్టి తవ్వుతున్న జేసీబీలను అడ్డుకోవడానికి వెళ్లగా.. లైట్లు ఆపేసి వాహనాలతో పరారయ్యారు. రహదారి వివరాలు తెలిపే బోర్డులనూ తొలగించడం దారుణం. అమరావతిలో కుంటలు, గోతులు గత ప్రభుత్వంలో చంద్రబాబు తీసినేవని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు నల్లమట్టి ఎవరు తీసుకెళ్లారు? మట్టిని తరలిస్తుంటే పోలీసు నిఘా ఏమైంది? రాజధానిలో తవ్వకాలు, అక్రమాలు జరగకుండా పర్యవేక్షించాలి’ చిలకా బసవయ్య, రైతు

‘రాజధానిని అభివృద్ధి చేస్తారని భూములిచ్చామే తప్ప దోచుకోవడానికి కాదు. మాట్లాడితే అమాయక రైతుల మీద పోలీసులు కొవిడ్‌ కేసులు పెడుతున్నారు. మట్టి తవ్వకాలను అడ్డుకునేందుకు వస్తున్నామనే సంగతి దుండగులకు ఎలా తెలుస్తోందో అర్థం కావట్లేదు. ప్రభుత్వం, పోలీసులు అక్రమాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ ఇడుపులపాటి సీతారామయ్య, వెలగపూడి రైతు

రోడ్లను తవ్వి గుంతలు పూడ్చడానికి పోలీసులు అనుమతిస్తారా?

అర్ధరాత్రి మట్టి తవ్వుకెళ్లి గుంతలు పూడ్చడానికి పోలీసు శాఖ అనుమతించిందా..? అని అమరావతి ఐకాస నేత కళ్లెం రాజశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. ‘ఉద్దండరాయునిపాలెంలో రోడ్డు తవ్వి కంకర తీసుకెళ్తే.. గుంతలు పూడ్చడానికి తీసుకెళ్లారని పోలీసులు చెబుతున్నారు. అర్ధరాత్రి గుంతలు పూడ్చడానికి పోలీసు శాఖ అనుమతించిందా? రాష్ట్రంలో, రాజధాని ప్రాంతంలో పొలాలకు వెళ్లే మార్గంలో అనేక గుంతలు ఉన్నాయి. వాటిని పూడ్చేందుకు పోలీసులు అనుమతిస్తారా?’ అని ప్రశ్నించారు.

ఇవీ చూడండి: అమరావతి భూములపై ఏపీ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

AMARAVATI LANDS: అమరావతి భూముల కేసు విచారణ మరోసారి వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.